RBI Ombudsman: ఫిర్యాదు చేసినా మీ బ్యాంక్‌ స్పందించడం లేదా? ఎవరికి ఫిర్యాదు చేయాలి?

How To File Complaint Against Your Bank: మీ బ్యాంకుకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? నెలలు గడుస్తున్నా పరిష్కరించడం లేదా? అయితే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండిలా..

Updated : 29 Jun 2023 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటితో పోలిస్తే బ్యాంకింగ్‌ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి నగదు చెల్లింపు సంస్థలు అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తినా క్షణాల్లో పరిష్కరించుకునే అవకాశమూ లభిస్తోంది. అయితే, కొన్ని ఫిర్యాదుల విషయంలో మాత్రం నెలలు గడిచినా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సమాధానం దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు (NBFC), నగదు చెల్లింపు సేవా సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంబుడ్స్‌మన్‌కు (RBI Ombudsman) ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చింది. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ ద్వారా గానీ, 14440 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి గానీ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. ఆర్‌బీఐ యాప్‌లో కూడా ఫిర్యాదుకు అవకాశం ఉంది. సరైన కారణం చూపకుండా ఖాతా తెరిచేందుకు నిరాకరించడం, ఏటీఎం లావాదేవీలు, ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో జాప్యం, చెక్కులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఛార్జీలు విధించడం వంటి ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. అయితే, అంబుడ్స్‌మన్‌కు నేరుగా ఫిర్యాదు చేయడానికి లేదు. ముందుగా సంబంధిత బ్యాంకు/ ఎన్‌బీఎఫ్‌సీకి ఫిర్యాదు ఇచ్చి ఉండాలి. నెల దాటినా స్పందన రాకపోతే  అప్పుడు మాత్రమే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఆ ఫిర్యాదు ఏడాదిలోపుదే అయిఉండాలి. వినియోగ‌దారుల‌ న్యాయ‌స్థానంలో పెండింగ్ ఉన్నప్పుడు అంబుడ్స్‌మన్‌ ఫిర్యాదులు స్వీకరించదు.

ఫిర్యాదు ఇలా..

  • రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్ పోర్టల్ cms.rbi.orgin లోకి తొలుత లాగిన్‌ అవ్వాలి..
  • ఫైల్‌ కంప్లయింట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేయగానే వేరే పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. అక్కడ క్యాప్చాను ఎంటర్‌ చేయాలి.
  • ఆ తర్వాత పేరు, మొబైల్ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.
  • తదుపరి దశలో ఫిర్యాదు చేయాల్సిన సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
  • గతంలో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీని అప్‌లోడ్‌ చేయాలి.
  • ఫిర్యాదుకు కేటగిరీని ఎంచుకుని తర్వాత మీ పూర్తి ఫిర్యాదును అక్కడ పేర్కొనాలి.
  • ఇప్పుడు మీ ఫిర్యాదును రివ్యూ చేసుకొన్న తర్వాత సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.
  • మీ కంప్లయింట్‌ స్థితిని ట్రాక్‌ అప్లికేషన్‌ ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు