‘ITR ఎలా ఫైల్‌ చేయాలి?’.. గూగుల్‌లో ఈ ఏడాది తెగ వెతికారు!

ఐటీఆర్‌ను ఇప్పటి వరకు దాఖలు చేయకపోతే కొంత జరిమానాతో 2022 డిసెంబరు 31 లోపు ఫైల్‌ చేయవచ్చు.

Published : 12 Dec 2022 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది గూగుల్‌లో  (Google) ఎక్కువ మంది వెతికిన వాటిలో ఐటీఆర్‌ (ITR) సైతం నిలిచింది. ‘ఐటీఆర్ ఆన్‌లైన్‌లో ఎలా ఫైల్ చేయాలి’ అనేది ఈ ఏడాది ఎక్కువమంది శోధించారని ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ నివేదికలో గూగుల్‌ తెలిపింది. జులై 24, జులై 30 మధ్య ఎక్కువ శోధనలు ఉన్నాయని గూగుల్‌ ట్రెండ్‌ డేటా చూపిస్తోంది. సాధారణంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌కు గడువు తేదీ జులై 31. ఈ ఏడాది గడువు పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో 2022-23కి ఐటీఆర్‌  ఫైలింగ్ గడువు తేదీ జులై 31తోనే ముగిసింది.

అయితే ఐటీఆర్‌ను ఇప్పటి వరకు దాఖలు చేయకపోతే కొంత జరిమానాతో 2022 డిసెంబరు 31లోపు ఫైల్‌ చేయవచ్చు. ఒకవేళ ఐటీఆర్‌ను ఇప్పటికే దాఖలు చేసినా తప్పులు ఉంటే ఈ తేదీలోపు రివైజ్డ్‌ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఈ తేదీలోపు ఐటీఆర్‌ను సమర్పించకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుతాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్నులను ఆన్‌లైన్‌లో ఏవిధంగా ఫైల్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ దాఖలు చేసే విధానం..

  • ముందుగా ఆదాయపు పన్ను శాఖ వైబ్‌సైట్‌ను సందర్శిచాలి. ఈ లింక్‌ని క్లిక్‌ చేయడం ద్వారా నేరుగా వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు.   
  • పాన్‌/ఆధార్‌తో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌కు లాగిన్‌ అవ్వాలి.
  • ఫైల్‌ రిటర్న్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇక్కడ ఫైలింగ్‌ మోడ్‌ను, అసెస్మెంట్‌ సంవత్సరం ఎంపిక చేసుకోవాలి.
  • అన్ని సూచనలను (ఆదాయం, స్టేటస్‌, ఇతర వివరాలు) అనుసరించి, సరైన ఐటీఆర్‌ ఫారంను ఎంచుకోవాలి (జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులు ఐటీఆర్‌-1 ఎంచుకోవాలి).
  • రిటర్నులు దాఖలు చేయడానికి గల కారణాన్ని ఎంపిక చేసుకుని ఫారంలో ముందుగా నింపి ఉన్న సమాచారాన్ని ధ్రువీకరించాలి. ఫారం 16 ద్వారా మీ సంస్థ ఆదాయపు పన్ను శాఖకు అందించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి.
  • అవసరమైతే ముందుగానే నింపిన ఫారంలో మార్పులు చేసుకోవచ్చు.
  • ఐటీఆర్‌ వెరిఫై చేసిన తర్వాత సమర్పించి రీఫండ్ (మీరు ఏడాదిలో చెల్లించిన పన్ను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే) కోసం వేచి చూడాలి. 

ఆదాయపు పన్ను అధికారిక డేటా ప్రకారం... మదింపు సంవత్సరం 2022-23 కోసం ఇప్పటివరకు 6,99,87,701 ఐటీఆర్‌లు ఫైల్ చేశారు. వీటిలో 6.62 కోట్ల ఐటీఆర్‌లు వైరిఫై కాగా..6.37 కోట్ల కంటే ఎక్కువ రిటర్నులను పన్ను శాఖ ప్రాసెస్‌ చేసింది. అసెస్మెంట్‌ సంవత్సరం 2023-24కు సంబంధించి ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు చివరి తేది 2023 జులై 31.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని