Financial Planning: మీ పెళ్లికి మీరే ఖ‌ర్చు పెడితే..?

ఒక వ్య‌క్తి త‌న వార్షిక ఆదాయానికి 1.5 లేదా 2 రెట్లు మొత్తాన్ని విహాహ వేడుక కోసం ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

Updated : 24 Nov 2021 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల చదువుల కోసం, పెళ్లి కోసం తమ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని మ‌రీ పిల్ల‌ల చిన్న‌తనం నుంచే పొదుపు చేస్తుంటారు తల్లిదండ్రులు. ఈ క్ర‌మంలో వారి గురించి, వారి ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక వంటివి కూడా పక్కన పెట్టేస్తుంటారు. పెళ్లి అనేది అంత చిన్న విష‌య‌మేమీ కాదు. అందుకే ‘ఇల్లు క‌ట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని పెద్దలంటారు. కానీ, అదంతా పూర్వం రోజుల్లో మాట‌. ఇప్పుడు యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు పెరిగాయి. సంపాద‌న సామ‌ర్థ్యం కూడా పెరిగింది. ఉద్యోగంలో చేరిన కొన్ని సంవ‌త్స‌రాల‌కే ఇల్లు కొనుగోలు చేసే శ‌క్తి వ‌చ్చింది. దీనికి కార‌ణం రుణాలు సుల‌భంగా ల‌భించ‌డం. ఈఎంఐలో రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించ‌గ‌ల‌గ‌డం. ఇక వివాహ విష‌యానికొస్తే.. పూర్వం పెద్దలే త‌మ పిల్ల‌ల‌కు త‌గిన జీవిత భాగ‌స్వామిని ఎంపిక చేసేవారు. ఇప్పుడు యువ‌త ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో సెటిల్‌ అవుతున్నారు. అక్క‌డే త‌మ‌కు న‌చ్చిన జీవిత భాగ‌స్వామిని ఎంచుకుని, పెద్ద‌ల స‌మ్మ‌తితో పెళ్లి చేసుకుంటున్నారు. వివాహానికి కావ‌ల‌సిన ఖ‌ర్చుల‌ను కూడా తామే స్వ‌యంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వివాహానికి కూడా రుణం దొరుకుతుంది. అయితే రుణం తీసుకోకుండా పొదుపు చేసి ఇందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని కూడ‌బెట్ట‌డం మంచిది.

త‌ల్లిదండ్రుల‌కు మీరే బ‌హుమ‌తి ఇవ్వండి: పెళ్లితో మ‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని జీవితంలోకి ఆహ్వానిస్తాం. ఈ సంద‌ర్భం యువ‌తీ యువ‌కుల‌కు చాలా ప్ర‌త్యేకం. అందువ‌ల్ల త‌మ వివాహ విష‌యంలో ప్రతి ఒక్కరికీ క‌ల‌లు కోరిక‌లు ఉంటాయి. కొంత మంది వినూత్న రీతిలో పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. మ‌రికొంత మంది త‌క్కువ ఖ‌ర్చుతో పెళ్లి చేసుకుని వివాహానికి అయ్యే ఖ‌ర్చును సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించాలని భావిస్తారు. ఏదిఏమైనా వివాహానికి ఖ‌ర్చు ఎక్కువ‌గానే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన‌ప్ప‌టి నుంచి ఒక ప్రణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే.. అప్పు చేయ‌కుండా, పెద్ద‌లు కూడ‌బెట్టిన సొమ్మును వినియోగించకుండా మీ వివాహనికి కావ‌ల‌సిన మొత్తాన్ని మీరే స‌మ‌కూర్చుకోగ‌ల‌రు. పెద్దలు డ‌బ్బును వారి ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి స‌రిపోయే ప్ర‌ణాళిక‌లో పెట్టుబ‌డి పెట్టి.. మీ వివాహానికి మీరే వారికి గొప్ప బ‌హుమ‌తిని ఇవ్వొచ్చు.

బ‌డ్జెట్‌: ఆర్థిక ప్ర‌ణాళిక.. డ‌బ్బుకి సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ కీల‌క‌మే. ముందుగా పెళ్లికి ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుంది? ఎలాంటి ఖ‌ర్చులు ఉంటాయో తెలుసుకునేందుకు బ‌డ్జెట్ వేసుకోవాలి. సామ‌ర్థ్యాన్ని మించి ఖ‌ర్చు చేయ‌డం కూడా మంచిది కాదు. ఖ‌ర్చులు బ‌డ్జెట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. థంబ్ రూల్ ప్ర‌కారం ఒక వ్య‌క్తి త‌న వార్షిక ఆదాయానికి 1.5 లేదా 2 రెట్లు మొత్తాన్ని వివాహ వేడుక కోసం ఖ‌ర్చుచేయొచ్చు.

రుణాలు: వివాహం అయిన త‌ర్వాత బాధ్యతలు పెరుగుతాయి. కాబ‌ట్టి ఖ‌ర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. పొదుపు, పెట్టుబ‌డుల కంటే ముందు అప్ప‌టికే ఉన్న రుణాల‌ను తీర్చడం మంచిది. ఇది వివాహం త‌రువాత ఖ‌ర్చులు భారం కాకుండా కాపాడుతుంది.

ఆర్థిక ప‌టిష్ఠత సాధించండి: వివాహ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఆర్థికంగా ప‌టిష్ఠం కావాల్సి ఉంటుంది. అందువ‌ల్ల భ‌విష్య‌త్తు ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను ఎలా నిర్వ‌హించాలో ప్లాన్ చేసుకోండి. బీమా, అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. వివాహం త‌రువాత జీవిత భాగ‌స్వామికి స‌రిపోయే విధంగా వీటిని స‌మీక్షించి పున‌రుద్ధ‌రించాలి.

పెట్టుబ‌డులు: ఒక పెద్ద మొత్తం స‌మ‌కూర్చుకోవాలంటే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని పొదుపు చేస్తే స‌రిపోదు. పెట్టుబ‌డులు పెట్టాలి. పెళ్లికి ఉన్న స‌మ‌యాన్ని అంచ‌నా వేసి అందుకు త‌గిన‌ట్లు స్వల్పకాల, దీర్ఘకాల పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి.

పెళ్లి త‌రువాత ఖ‌ర్చులు: ఆర్థిక ప్రణాళిక అనేది వివాహ వేడుకల నిర్వహణకు మాత్రమే కాకుండా, వివాహం అయిన వెంటనే ఆనందించడానికి అంటే విహారం మొద‌లైన‌ ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పెళ్లి త‌రువాత కొత్త‌గా ఫ్యామిలీ ఏర్పాటు చేయాల్సి వ‌స్తే, గృహోప‌క‌ర‌ణాలు వంటి వాటిని కొనుగోలు చేయాలి. వాటికోసం కూడా ప్లాన్ చేయండి. లేదంటే అప్ప‌టిక‌ప్పుడు క్రెడిట్ కార్డులు ఉప‌యోగించి కొనుగోలు చేస్తే.. బిల్లు భార‌మై పెనాల్టీలు క‌ట్టాల్సి వ‌స్తుంది. స్వ‌ల్పకాల అవ‌స‌రాల కోసం క్రెడిట్ కార్డును వినియోగించుకోవ‌చ్చు. ఒక‌వేళ క్రెడిట్ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేసే అవసరం వస్తే, చెల్లింపులు నిర్దిష్ట  సమయం లోపే ఉండేట్లు చూసుకోవాలి. కొద్ది రోజుల్లో చెల్లించ‌గ‌ల‌మ‌నుకుంటే బైనౌ-పేలేట‌ర్ విధానంలోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ముగింపు..: ప్ర‌స్తుత రోజుల్లో యువ‌తీ యువ‌కులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. కాబ‌ట్టి వివాహం అయిన త‌ర్వాత.. ఆర్థిక విష‌యాల‌లో ఇద్ద‌రూ స‌మష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోగ‌ల‌రు. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత వారికి కావ‌ల‌సిన‌వి సమ‌కూర్చ‌గ‌లుగుతారు. కుటుంబం ఆర్థికంగా బ‌లంగా ఉంటే చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎటువంటి ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిడీ లేకుండా వివాహ జీవితాన్ని ఆస్వాదించ‌గ‌లుగుతారు. పెట్టుబడులు, ఖర్చులు, రుణాల వంటి విషయాలు జీవిత భాగస్వామితో ముందుగానే చ‌ర్చించ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని