Marriage: వివాహానికి ఆర్థిక ప్రణాళికలను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

పెళ్లిళ్ల సీజన్‌లో ఆర్థిక ప్రణాళికలను సులభతరం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి, అవేంటో ఇక్కడ చూడండి.

Published : 07 Feb 2023 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లిళ్ల సీజన్‌ (Marriage season) మళ్లీ మొదలయ్యింది. ఒకవేళ మీరూ వివాహానికి సిద్ధమవుతుంటే..  మీ కలల వివాహానికి ఆర్థిక ప్రణాళికలను సరైన రీతిలో ప్లాన్‌ చేసుకోవాలి. పెళ్లి అనేది నిస్సందేహంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలకమైన ఘట్టం. దీని కోసం ఖర్చు చేసేటప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. అందులోనూ భారతీయులు వివాహ వేడుకను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు.  పెళ్లి అనుకున్నప్పుడు ప్లాన్‌ చేసిన ఖర్చులకు, పెళ్లి తర్వాత ఖర్చు చేసిన మొత్తానికి వ్యత్యాసం రావచ్చు. ఎందుకంటే పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ అనుకోని ఖర్చులు వచ్చిపడుతుంటాయి. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కీలక ఘట్టానికి ఆర్థిక ప్రణాళికలను సులభతరం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో ఇక్కడ చూడండి.

బడ్జెట్‌ను ఫిక్స్‌ చేయండి

వ్యక్తులు సాధారణంగా వివాహాల విషయమై అనేక మానసిక ప్రభావాలకు గురవుతుంటారు. కాబట్టి, వారు తరచుగా వారి ఆర్థిక సామర్థ్యం కంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ అధిక మోతాదు ఖర్చులు భవిష్యత్‌లో మీ కీలకమైన ఆర్థిక లక్ష్యాలకు భంగం కలిగిస్తాయి. అందుచేత వివాహ ఖర్చులపై తగిన గరిష్ఠ పరిమితిని నిర్ణయించుకోవాలి. వివాహానికి ముందే బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం ఉత్తమ మార్గం. కార్యక్రమాల ప్రాధాన్యతల ఆధారంగా అన్ని ఖర్చులను లిస్ట్‌ రాసుకోవాలి. అంటే, అగ్ర ప్రాధాన్యత ఖర్చులు ఎగువున, అప్రాధాన్యత ఖర్చులను దిగువున లిస్ట్‌లో రాసుకోవాలి. బడ్జెట్‌ మీ ఖర్చు పరిమితిని మించి ఉంటే, తక్కువ ప్రాధాన్యత గల కొన్ని ఖర్చులను తీసివేయాలి. ముఖ్యమైన ఖర్చులే కాకుండా, వివాహ సమయంలో ప్రణాళికలో లేని అనేక ఖర్చులు వస్తుంటాయి. వీటి గురించి కొంత ఆకస్మిక నిధిని కూడా దగ్గర పెట్టుకోవాలి.

డబ్బు ముందే ఆదా చేయాలి

మీ వివాహ తేదీని నిర్ణయించిన తర్వాత మాత్రమే డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. దీనికి చాలా సంవత్సరాలు, కనీసం కొన్ని నెలల నుంచి ఆర్థికంగా సిద్ధం కావాలి. తప్పనిసరిగా దీనికోసం పొదుపు చేయడం ప్రారంభించాలి. భద్రత, తక్షణ ఉపసంహరణను అందించే లిక్విడ్‌ సాధనాలలో డబ్బును పొదుపు చేయాలి. దీని కోసం లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. వడ్డీకి, అసలుకు హామీ ఉండే పొదుపు సాధనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఖాతాలలో డబ్బును ప్రతి నెలా దాస్తూ ఉండాలి. మీ వివాహా తేదీకి ముందే నిధి లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బోనస్‌, కాలానుగుణ ఆదాయాలను అందులో పొదుపు చేయాలి.

వివాహ బడ్జెట్‌

వివాహ బడ్జెట్‌ తెలిసిన తర్వాత దాని కోసం నిధులను సిద్ధం చేసే పనిని త్వరగా ప్రారంభించాలి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఆర్థిక లక్ష్యాలలో ఒకటి. చాలా మంది మధ్యతరగతి భారతీయులు ఈ కార్యక్రమం గురించి డబ్బును ఆదా చేస్తారు. పెళ్లి సమయం దగ్గర పడుతున్నప్పుడు, మీ చేతిలో బడ్జెట్‌ ఉన్నప్పుడు, సమర్థంగా ఉపయోగించుకునేలా అన్ని నిధులను ఒకే చోటకు చేర్చాలి. సేకరించిన నిధులు సరిపోకపోతే, మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. పెళ్లి ఖర్చులను తగ్గించుకోవాలి లేదా బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు తీసుకోవాలి. లేదంటే బ్యాంకుల వద్ద వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి.

అవసరమైతేనే రుణం

వివాహ ఖర్చులకు తప్పనిసరి పరిస్థితుల్లో రుణ ఎంపికలకు సిద్ధం కావాలి. కొన్నిసార్లు పెళ్లికి అయ్యే ఖర్చు విషయంలో మీ అంచనా తప్పు కావచ్చు. అసలు పెళ్లి ఖర్చులు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఈ డబ్బు అవసరాలకు స్నేహితులు, బంధువుల నుంచి అధిక మొత్తంలో ఫండ్‌ ఏర్పాటు కావడం సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణానికి వెళ్లడం మంచిదే. కొన్ని బ్యాంకులు వివాహ రుణాన్ని కూడా అందిస్తాయి. మీరు బ్యాంకు ఎఫ్‌డీను కలిగి ఉంటే.. ఎఫ్‌డీపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం చౌకగా, వేగంగా లభిస్తుంది. బహుళ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే బదులు, ఒకే రుణం తీసుకోవడం ద్వారా మీ బడ్జెట్‌ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ రీపేమెంట్‌ కెపాసిటీకి మించి ఎప్పుడూ రుణం తీసుకోకండి. ఎందుకంటే పెళ్లి అయిన వెంటనే మీరు తిరిగి బకాయి చెల్లింపులు ప్రారంభించాలి. అంతేకాకుండా అసలు ఖర్చు ఒక వ్యక్తికి పెళ్లి అయిన తర్వాతే పెరుగుతుంది. ఈ కారణం చేత వివాహానంతరం ఆర్థికపరంగా ఫ్రీగా ఉండడం మంచిది.

ప్రణాళికలేని షాపింగ్‌ వద్దు

ప్రణాళికలేని షాపింగ్‌ అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది. షాపింగ్‌ చేసేటప్పుడు తొందరపడకండి. ఎందుకంటే కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ముందుగా షాపింగ్‌ జాబితాను రూపొందించుకోండి.  జాబితా ప్రకారం కొనుగోలు చేయండి. షాపింగ్‌ చేసేటప్పుడు ఆ పనిని ఆస్వాదించేలా పూర్తిచేయండి. ఉత్తమ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చే షాపింగ్‌ పాయింట్లను గుర్తించండి. చెల్లింపుల్లో క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తే.. ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో ఉండేలా జాగ్రత్తపడండి. తదుపరి బిల్లింగ్‌ డేట్‌లో క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. లేకపోతే ఇది ఒక అప్పుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

బంగారు ఆభరణాలు

భారతీయ వివాహా వేడుకలో బంగారానికి, దుస్తులు తర్వాత ఎనలేని పాత్ర ఉంటుంది. వివాహానికి కావాల్సిన కీలకమైన వస్తువులలో ఆభరణాలు ఒకటి. ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువ ఉన్నాయని మనందరికి తెలిసిందే. వివాహ బడ్జెట్‌లో ఎక్కువ భాగం బంగారానికే కేటాయించాల్సి రావచ్చు. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, మీరు తగిన దుకాణాన్ని ఎంచుకోవాలి. ప్రతి వస్తువుకు సరైన బిల్లు తీసుకోండి. బంగారం విషయంలో తరుగు కీలక పాత్ర వహిస్తుంది. తరుగు, ధరల విషయంలో ఇతర దుకాణాలతో పోల్చి చూడండి. డైమండ్‌ ఆభరణాలను కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లయితే.. వాటి నాణ్యతకు సంబంధించిన ప్రామాణికత కోసం గుర్తింపు పొందిన రత్నశాస్త్ర ల్యాబ్‌ నుంచి పరీక్ష సర్టిఫికెట్‌ కోసం అడగండి. అభరణాల దుకాణానికి సంబంధించిన రిటర్న్‌ రేటు, వర్తించే నిబంధనలు, షరతులను తనిఖీ చేయండి. ఎందుకంటే భవిష్యత్‌లో మీరు అభరణాలను మార్చుకోవాలని ప్లాన్‌ చేసినప్పుడు ఇది మీకు సహాయపడవచ్చు.

చివరిగా: పెళ్లి ఖర్చులపై ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఈ ఖర్చుల కోసం మీ అత్యవసర నిధిని ఎప్పుడూ ఉపయోగించొద్దు. పెళ్లిని ఆస్వాదించడం ముఖ్యం కానీ మీ ఆర్థిక స్వేచ్ఛను, భవిష్యత్‌ను కాపాడుకోవడం మరింత ముఖ్యం. కాబట్టి మీ బడ్జెట్‌కు కట్టుబడి పెళ్లిని ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని