EPFO: ఆన్‌లైన్‌లో పీపీఓ నంబ‌ర్‌ తెలుసుకోవ‌డం ఎలా?

ఈపీఎస్ అనేది ఈపీఎఫ్‌లో ఒక భాగం. ఈపీఎఫ్‌లో స‌భ్యులైన‌ ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది.

Updated : 17 Feb 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెల‌వారీ పెన్షన్‌ పొందేందుకు గానూ ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్ఓ).. ఎంప్లాయిస్ పెన్షన్‌ స్కీమ్ (ఈపీఎస్‌)ను అందిస్తోంది. ఈపీఎస్ ప‌రిధిలోకి వ‌చ్చే పెన్షనర్లకు ప్రత్యేకమైన పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ (పీపీఓ) నంబ‌ర్‌ కేటాయిస్తుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పింఛను పొందే ఉద్యోగులు ఈ నంబర్‌ను తప్పకుండా తెలుసుకోవాలి.

పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ నంబర్‌ ఎలా పొందాలి..?
పెన్షన్‌ పేమెంట్ ఆర్డర్‌ నంబర్‌లో 12 అంకెలు ఉంటాయి. ఇందులో మొద‌టి ఐదు అంకెలు పీపీఓ జారీ చేసే అథారిటీ కోడ్‌ను, త‌ర్వాతి రెండు అంకెలు.. నంబ‌ర్‌ జారీ చేసిన సంవ‌త్సరాన్ని, ఆ త‌ర్వాతి నాలుగు అంకెలు పీపీఓ సీక్వెన్షియ‌ల్ నంబ‌ర్‌ను, చివ‌రి అంకె కంప్యూట‌ర్ చెక్ కోడ్‌ను సూచిస్తాయి. చందాదారులు పీపీఓ నంబర్‌ పొందేదుకు కింది ద‌శ‌ల‌ను అనుస‌రించాల్సి ఉంటుంది..

  • ముందుగా www.epfindia.gov.inకి లాగినవ్వాలి. 
  • తర్వాత స‌ర్వీసెస్‌లో ఉన్న పెన్షన్‌ పోర్టల్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు పెన్షనర్ల పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ‘వెల్‌కమ్‌ టు పెన్షనర్స్‌ పోర్టల్‌’ అనే మెసేజ్‌ కనిపిస్తుంది.
  • ఇప్పుడు కుడివైపున ఉన్న నో యుర్ పీపీఓ నంబర్‌పై క్లిక్ చేయాలి. 
  • ఇక్కడ మీ బ్యాంకు ఖాతా నంబ‌ర్‌ లేదా మెంబ‌ర్ ఐడీని ఎంట‌ర్ చేయాలి.

ఈ వివ‌రాలు ఇస్తే పీపీఎఫ్ నంబ‌ర్‌తో పాటు, స‌భ్యత్వ ఐడీ, పింఛను ర‌కం త‌దిత‌ర స‌మాచారం కూడా మీకు అందుతుంది. ఇక్కడ పెన్షన్‌ స్టేటస్‌నూ తెలుసుకోవచ్చు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, వార్షిక‌ జీవిత ధ్రువీకరణ పత్రం (లైఫ్ స‌ర్టిఫికెట్‌) సమర్పించేటప్పుడు పీపీఓ నంబర్ అవసరం. పీపీఓ నంబ‌ర్‌ తెలియ‌క‌పోతే పీఎఫ్‌ ఖాతాను ఒక బ్యాంకు శాఖ నుంచి మరొక బ్యాంకుకు బదిలీ చేయడంలో ఇబ్బందులు వ‌స్తాయి.

ఈపీఎస్ కోసం ఎంత కాంట్రీబ్యూట్ చేస్తారు?
ఈపీఎస్ అనేది ఈపీఎఫ్‌లో ఒక భాగం. ఈపీఎఫ్‌లో స‌భ్యులైన‌ ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను పొందొచ్చు. ఉద్యోగి మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా నామినీ ఈ పెన్షన్‌ పొందొచ్చు. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున‌ ఉద్యోగి వేతనానికి స‌మాన‌మైన మొత్తాన్ని ప్రతి నెలా ఈపీఎఫ్‌లో జ‌మ‌చేస్తారు. సంస్థ వాటా అయిన 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కి చెందుతుంది. మిగ‌తా 3.67 శాతం ఈపీఎఫ్‌కి చేరుతుంది. అంటే, ఈపీఎస్ కోసం ఉద్యోగి ప‌నిచేసే సంస్థ కాంట్రిబ్యూట్ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని