క్రెడిట్ కార్డు ప్ర‌యోజ‌నాలను ఎలా ఉప‌యోగించుకోవాలి..

మీ క్రెడిట్ కార్డును ఎలా ఉప‌యోగించుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం:

Updated : 15 Jan 2021 14:43 IST

భార‌త‌దేశంలో ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక కోటి 50 ల‌క్ష‌ల పైగానే క్రెడిట్ కార్డులు జారీ చేయ‌బ‌డుతున్నాయి. చాలా మంది క్రొత్తగా క్రెడిట్ కార్డు తీసుకున్న వినియోగ‌దారుల‌కి దానిని నియంత్రించే ల‌క్ష‌ణాలు, నియ‌మాలు తెలియ‌వు. క్రెడిట్ కార్డుల‌తో అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల‌న అధిక ఛార్జీల‌కు దారితీస్తుంది. కార్డుల వ‌ల‌న పొందే ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు, క్రెడిట్ విలువ కూడా త‌గ్గుతుంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు కార్డులు జారీ చేస్తుంటాయి. మీ ఖ‌ర్చు విధానానికి త‌గ్గ ల‌క్ష‌ణాలు ఉన్నాయా అని త‌నిఖీ చేయ‌కుండా కొత్త క్రెడిట్ కార్డు కోసం ధ‌ర‌ఖాస్తు చేయ‌వ‌ద్దు.  మీ క్రెడిట్ కార్డును ఎలా ఉప‌యోగించుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం:

1) మీరు వాహ‌నాన్ని విస్తృతంగా ఉప‌యోగిస్తుంటే, కో-బ్రాండెడ్ ఇంధ‌న కార్డును తీసుకోండి. ఇది ఇంధ‌న స‌ర్‌ఛార్జిని మాఫీ చేస్తుంది, ఖ‌ర్చుల‌పై ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

2) మీరు చాలా దూర ప్ర‌యాణాలు, విమాన ప్ర‌యాణాలు చేసేవారైతే విమానాశ్ర‌యం లాంజ్ సౌక‌ర్యాల గ‌రిష్ట సౌల‌భ్యాన్ని అందించే కార్డుని తీసుకోండి. త‌ర‌చూ ఫ్లైయ‌ర్ పాయింట్ల‌తో పాటు ఎటువంటి స‌మ‌య ప‌రిమితి లేకుండా డ‌బ్బుని ఆదాచేయ‌వ‌చ్చు.

3) ఆన్‌లైన్ వినియోగానికి అధిక రివార్డు పాయింట్ల‌ను అందించే కార్డులు, ఎక్కువ డిజిట‌ల్ లావాదేవీలు చేసే వ్య‌క్తుల‌కు స‌రిపోతాయి.

4) మీరు త‌ర‌చూ హోట‌ళ్లు, రెస్టారెంటుల‌కు వెళ్లే వారైతే డైనింగ్ ఎంపిక‌ల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన త‌గ్గింపుల‌ను అందించే కార్డును ఎంచుకోండి.

మీరు క్రెడిట్ కార్డులు బ‌కాయిలు చెల్లించేట‌పుడు, కార్డ్ బ‌కాయిల‌ను పూర్తిగా, షెడ్యూల్ ప్ర‌కారం క్లియ‌ర్ చేస్తే, బ్యాంక్ పొడిగించిన క్రెడిట్‌పై ఎటువంటి రుసుము ఉండ‌దు. బ‌కాయిల చెల్లింపులు ఆల‌స్యం అయితే, మీకు జ‌రిమానా విధించ‌బ‌డ‌డ‌మే కాకుండా, చెల్లించ‌ని మొత్తానికి అధిక వ‌డ్డీ రేటు విధించ‌బ‌డుతుంది. బిల్ మొత్తంలో క‌నీస ఛార్జీ 5% చెల్లిస్తే, మిగ‌తా మొత్తానికి నెలవారీ 3% నుండి 4% వ‌డ్డీ‌ను చెల్లించ‌డానికి సిద్ధంగా ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం చెల్లింపును బ్యాంక్ ద్వారా ఆటోమేట్ చేయ‌డం కూడా మంచిదే, దీనివ‌ల్ల మీరు చెల్లింపు గ‌డువును మ‌రిచిపోయిన‌ప్ప‌టికీ ఇబ్బంది ఉండ‌దు.

మీ ఖ‌ర్చులు నియంత్ర‌ణ‌లో ఉంటే ఒక‌టి క‌న్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నా మంచిదే. క్రెడిట్ కార్డులు జారీ చేసేవారు చిల్ల‌ర వ్యాపారులు, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌తో జ‌త‌క‌ట్టారు. ఒక‌టి కంటే ఎక్కువ కార్డులుంటే అటువంటి ఒప్పందాల వ‌ల‌న లాభం క‌లిగే అవ‌కాశ‌ముంది. ఎక్కువ కార్డులుంటే బిల్లింగ్ తేదీ దూరంగా ఉన్న కార్డును ఉప‌యోగించొచ్చు. దీనివ‌ల‌న 40-45 రోజుల వ‌డ్డీలేని క్రెడిట్‌ను పొందొచ్చు. మీకు డ‌బ్బుకు ఇబ్బందులుంటే బ్యాలెన్స్‌ను ఒక కార్డు నుండి మ‌రొక కార్డుకు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. బ్యాలెన్స్ బ‌దిలీని త‌ర‌చుగా అల‌వాటు చేసుకోకండి, ఎందుకంటే అప్పుల ఊబిలో చిక్క‌డానికి ఇది ఆరంభం కావ‌చ్చు.

క్రెడిట్ కార్డు ద్వారా కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఒకేసారి చెల్లించకుండా ఆ మొత్తాన్ని సులభమైన `ఈఎంఐ`లుగా మార్చుకోవచ్చు. కొన్ని కంపెనీ లు 0% వడ్డీ తో కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్నిటికి ఏడాదికి 14% నుంచి 24% ఉంటుంది.

బ‌కాయిలు స‌కాలంలో స‌రిగ్గా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ భ‌విష్య‌త్తులో మ‌న‌కు ఆర్ధికంగా మేలు క‌లిగే విధంగా మార్చుకోవచ్చు లేక‌పోతే క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. షాపింగ్‌కు వెళ్లిన‌పుడు బ‌డ్జెట్‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం మంచిది. అధిక కొనుగోళ్లు చేసే ముందే, తిరిగి చెల్లించే ప్రణాళిక వేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని