ఉద్యోగం లేక‌పోయినా క్రెడిట్ కార్డు పొందొచ్చా?

బ్యాంకులో ఎఫ్‌డి చేసిన క‌స్ట‌మ‌ర్ల‌కు కొన్ని బ్యాంకులు.. ఎఫ్‌డీ మొత్తంపై 80 నుంచి 90 శాతం లిమిట్‌తో  క్రెడిట్ కార్డుల‌ను మంజూరు చేస్తున్నాయి. 

Updated : 07 Jan 2022 16:35 IST


ఉద్యోగం చేస్తున్న వారికి బ్యాంకులు సాధార‌ణంగా క్రెడిట్ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తుంటాయి. ప్ర‌తీ నెల నిర్దిష్ట ఆదాయం ఉంటుంది కాబ‌ట్టి స‌కాలంలో బిల్లు చెల్లింపులు చేయ‌గ‌ల‌ర‌ని బ్యాంకులు న‌మ్ముతాయి. ఈ కార‌ణం చేత‌నే జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగుల‌కు క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఉద్యోగం చేయ‌ని వారు కూడా క్రెడిట్ కార్డును పొంద‌చ్చు. స్వ‌యం ఉపాధి పొందుతున్న వారు (వ్యాపారులు, వృత్తి నిపుణ‌లు, తదిత‌రులు), విద్యార్థులు, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వ్య‌క్తులు, గృహిణులు కూడా క్రెడిట్ కార్డు తీసుకోవ‌చ్చు. అయితే వీరికి స‌రైన ఆదాయ మార్గం ఉండాలి. అప్పుడే క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హ‌లు అవుతారు. 

ఉద్యోగం లేని వారు క్రెడిట్ కార్డు పొందేందుకు మార్గాలు..

1. స్టాండ‌ర్డ్ క్రెడిట్ కార్డు.. 
మీరు నిరుద్యోగులు అయిన‌ప్ప‌టికీ.. ఇతర వనరుల నుంచి ఆదాయం వ‌స్తుంటే క్రెడిట్ కార్డు పొందొచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్లు, డివిడెండ్లు, వృత్తి, వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్ వ‌ర్క్‌ నుంచి ప్ర‌తీనెల‌ స్థిర‌ ఆదాయం బ్యాంకు ఖాతాకు జ‌మవుతుంటే..అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను త‌నిఖి చేసిన త‌ర్వాత‌ బ్యాంకులు స్టాండ‌ర్డ్ క్రెడిట్ కార్డు జారీ చేసే అవ‌కాశం ఉంది. ఇందుకోసం బ్యాంకులు మీ ఖాతా స్టేట్‌మెంట్‌ల‌ను, ఐటీఆర్ రికార్డుల‌ను ప‌రిశీలిస్తాయి. స్టాండ‌ర్డ్ క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌లేరు. ఇందుకోసం నేరుగా బ్యాంకుని సంప్ర‌దించాల్సి ఉంటుంది. 

2. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌..
ఉద్యోగం లేని వారు క్రెడిట్ కార్డును పొందేందుకు మ‌రొక ఆప్ష‌న్ ఇది. ఫిక్స‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన వారు ఈ కార్డును పొంద‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై కార్డు లిమిట్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఎఫ్‌డి మొత్తం నుంచి 80 నుంచి 90 శాతం వ‌ర‌కు లిమిట్ ఉంటుంది. 100 శాతం విత్‌డ్రాల‌కు అనుమ‌తిస్తారు. సెక్యూర్డ్ క్రెడిట్‌కార్డులతో బ్యాంకుల‌కు న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌, కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్ ఆక్వా గోల్డ్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డును పొందాలంటే బ్యాంకులో క‌నీసం రూ. 25 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండాలి. అలాగే ఎస్‌బీఐ ఉన్న‌తి క్రెడిట్ కార్డును పొందేందుకు ఎస్‌బీఐలో రూ. 25 వేలు, అంత‌కంటే ఎక్కువ మొత్తానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఉండాలి. 

3. యాడ్‌-ఆన్ క్రెడిట్ కార్డ్స్‌..
ఆదాయం మార్గం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేని వారు క్రెడిట్ కార్డును పొంద‌చ్చు. అదే యాడ్‌-ఆన్ లేదా స‌ప్లిమెంట‌రీ క్రెడిట్ కార్డ్‌. మీరు నిరుద్యోగులు అయివుండి, ఎలాంటి ఆదాయం లేనివారైతే.. మీ కుటుంబంలో సంద‌పాదిస్తూ ఇప్ప‌టికే ప్రైమ‌రీ/స్టాండ‌ర్డ్‌ క్రెడిట్ కార్డు పొందిన వారి ద్వారా ప్రాధమిక క్రెడిట్ కార్డుకు అద‌నంగా ఈ కార్డును పొంద‌చ్చు. ప్ర‌త్యేకించి విద్యార్ధుల‌కు, గృహిణుల‌కు ఈ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్ప‌టికే క్రెడిట్ కార్డు ఉన్న వ్య‌క్తులు వారి జీవిత భాగ‌స్వామికి, త‌ల్లిదండ్రుల‌కు, 18 సంవ‌త్స‌రాలు నిండిన‌ పిల్ల‌ల‌కు, తోబుట్టువుల‌కు ఈ కార్డును ఇవ్వ‌చ్చు. ఇక్క‌డ మొత్తం క్రెడిట్ లిమిట్ ని ప్రైమ‌రీ, యాడ్‌-ఆన్ క్రెడిట్ హోల్డ‌ర్‌కి షేర్ చేస్తారు. రెండు కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు ఒకే కన్సాలిడేటెడ్ స్టేట్ మెంట్ ఇస్తారు.

చివ‌రిగా..
మీకు మంచి క్రెడిట్ చ‌రిత్ర‌, బిల్లు చెల్లించేందుకు త‌గిన ఆదాయ వ‌న‌రు ఉంటే క్రెడిట్ కార్డు పొందేంద‌కు ఉద్యోగం లేక‌పోవ‌డం అనేది అడ్డంకి కాదు. మీరు వ్యాపార‌, వృత్తి నిపుణ‌లు అయితే మీ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు, ఫైనాన్షియ‌ల్ స్టేట్‌మెంట్స్‌ని ఆదాయ ఫ్రూఫ్‌లుగా చూపించి కార్డు తీసుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డులు తీసుకోవ‌డంతో అయిపోదు. వాటి నిర్వ‌హ‌ణ స‌రిగ్గా ఉండాలి, స‌కాలంలో బాధ్యతగా బిల్లు చెల్లించాలి. అప్పుడే పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని