వాహనానికి పూర్తి బీమా కవరేజ్ ను పొందండిలా..

ఒక వ్యక్తి తన వాహనానికి పూర్తి కవరేజ్ ను పొందడానికి యాడ్ ఆన్ కవర్ ను తీసుకోవడం మంచిది.

Published : 22 Dec 2020 12:52 IST

భారతదేశంలో 2015, 2016 సంవత్సరాల్లో సుమారు 10 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రవాణా పరిశోధన విభాగం అందించిన నివేదిక ప్రకారం, ఈ రెండు సంవత్సరాల్లో జాతీయ రహదారులపై 34.5 శాతం ప్రమాద మరణాలు సంభవించగా, రాష్ట్ర రహదారులపై 27.9 శాతం ప్రమాద మరణాలు సంభవించాయి. మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం, రహదారిపై ఎలాంటి వాహనానైనా నడపడానికి చెల్లుబాటు అయ్యే మోటారు బీమా తప్పనిసరి. అయితే, వినియోగదారులు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం ద్వారా 100 శాతం కవరేజ్ ను పొందలేరు. మీరు ఒక సమగ్ర బీమా కవరేజ్ పాలసీని తీసుకున్నప్పటికీ, అది వేర్వేరు రకాల నష్టాలకు పూర్తి కవరేజ్ ని అందించదు. కావున ఒక వ్యక్తి పూర్తి కవరేజ్ ను పొందడానికి యాడ్ ఆన్ కవర్ ను తీసుకోవడం మంచిది. ఒక వ్యక్తి తన కారు బ్రేక్ డౌన్ అయ్యి ఒంటరిగా ఉన్న సమయంలో అత్యవసర సహాయక కవర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కవర్ ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. అదేవిధంగా, ఒకవేళ వ్యక్తి తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతంలో నివాసం ఉన్నట్లయితే ఇంజిన్, గేర్బాక్స్ ప్రొటెక్టర్ కవర్ ను తీసుకోవడం మంచిది. ఇది ఇంజిన్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కు భద్రత కలిపిస్తుంది, ముఖ్యంగా కారు నీటిలో మునిగిన సమయంలో ఇంజిన్ కు నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ కోసం 13 రకాల యాడ్ ఆన్ లను కింద తెలియచేశాము. ఇవి మీ వాహన బీమాకు ఫుల్ కవరేజ్ ని అందిస్తాయి.

  1. అత్యవసర రోడ్డు సైడ్ అసిస్టెన్స్

ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా మీ వాహనానికి ఏదైనా సమస్య ఏర్పడితే, అలాంటి సమయంలో ఈ యాడ్ ఆన్ కవర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాడ్ ఆన్ ద్వారా బీమా సంస్థ ఇంధనం నింపడం, పంక్చర్ అయిన టైర్ ను మార్చడం, ప్రమాదానికి గురైన వాహనాన్ని సర్వీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, వాహనాన్ని రిపేర్ చేయడం వంటి సేవలను అందిస్తుంది. అలాగే ప్రమాద వశాత్తు కారు బ్రేక్ డౌన్ అయిన సందర్భాల్లో కూడా ఈ కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

  1. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

ఒకవేళ మీరు ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతంలో నివసిస్తున్నట్లైతే, మీరు ఈ యాడ్ ఆన్ కవర్ ను తీసుకోవడం మంచిది. వాహన ఇంజిన్ పూర్తిగా నీటిలో ఉండడం వలన ఇంజిన్ కు కలిగే నష్టం ఈ యాడ్ ఆన్ ద్వారా కవర్ అవుతుది. అలాగే ఇది ఆయిల్ లీకేజ్, గేర్ బాక్స్ డామేజ్ వంటి వాటికి కూడా వర్తిస్తుంది.

  1. కాస్ట్ అఫ్ కన్సూమబుల్స్

ఒకవేళ మీ వాహనం ప్రమాదానికి గురైతే, ప్రామాణిక మోటారు బీమా పాలసీ ప్రకారం, మీ బీమా సంస్థ నట్లు, బోల్టులు, ఇంజిన్ ఆయిల్, బేరింగ్స్ వంటి వినియోగ వస్తువుల ధరను మినహాయిస్తారు. ఒకవేళ మీరు ఈ యాడ్ ఆన్ ను తీసుకున్నట్లైతే, వినియోగ వస్తువుల ధరను కూడా క్లెయిమ్ మొత్తంలో చేరుస్తారు.

  1. మల్టీ ఇయర్ పాలసీ

మల్టీ ఇయర్ పాలసీ ద్విచక్ర వాహనాన్ని గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కవర్ చేస్తుంది. గాయాలు, మరణం, యజమాని - డ్రైవర్, ప్రయాణీకులకు ఆప్షనల్ వ్యక్తిగత ప్రమాద కవరేజ్ అలాగే ప్రమాదంలో థర్డ్ పార్టీ వ్యక్తి ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో చట్టపరమైన కవరేజ్ ను కల్పిస్తుంది.

  1. జీరో డిప్రిసియేషన్ కవర్

ఈ యాడ్ ఆన్ ను కొత్త కార్ల కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు, ఎందుకంటే ఇది పాలసీదారుడికి నష్టాల వ్యయాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ యాడ్ ఆన్ తీసుకోకపోతే, ప్లాస్టిక్ / రబ్బరు, ఫైబర్, మెటల్, పెయింట్ పదార్థాలకు అయ్యే ఖర్చును పాలసీదారుడు భరించవలసి ఉంటుంది. దీనిని నిల్ డిప్రిసియేషన్ లేదా బంపర్ టూ బంపర్ అని కూడా పిలుస్తారు, ఇది మీకు పూర్తి కవరేజ్ ను అందిస్తుంది. ఇది సాధారణ బీమా ప్రీమియం కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. జీరో డిప్రిసియేషన్ కవర్ విలాసవంతమైన కార్లు, ఖరీదైన విడిభాగాలు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

  1. వ్యక్తిగత ప్రమాద కవరేజ్

కారు ప్రమాదంలో ఒక వ్యక్తి ఎలాంటి భౌతిక నష్టం లేదా వైకల్యానికి గురైనా అలాంటి వారికి వ్యక్తిగత ప్రమాద కవరేజ్ రక్షణ కల్పిస్తుంది.

  1. యాక్ససరీస్ కవరేజ్

ఒక వ్యక్తి కారును తనకు అనుకూలంగా మార్చుకుంటే, కారులో చేసిన మార్పుల కారణంగా బీమా రద్దు అవుతుందనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు ఇంజిన్ కు లేదా మెకానికల్ వస్తువులకు చేసిన మార్పులు ప్రామాణిక కవరేజ్ కిందకు రావు. ఒకవేళ మీరు బీమా కవరేజ్ ను పొందాలనుకుంటే, మీరు చేయాలనుకుంటున్న మార్పులను పరిమితం చేయాలి. కారులో మార్పులు చేయాలనుకునే ముందు బీమా పరిమితులకు సంబంధించి ఏజెంట్ ను సంప్రదించడం మంచిది.

  1. స్వచ్ఛంద మినహాయింపులు

ఒకవేళ కారు బీమా ప్రీమియం ఎక్కువని మీరు భావించిన సందర్భంలో మాత్రమే స్వచ్ఛంద మినహాయింపులు ఆప్షన్ ను ఎంచుకోండి. స్వచ్ఛంద మినహాయింపులు ఏదైనా క్లెయిమ్ విషయంలో మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని పాలసీదారుడు కూడా చెల్లించాలి.

  1. నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)

బీమా పాలసీ కాల వ్యవధిలో వాహన యజమానులు ఒక్క క్లెయిమ్ కూడా చేయకపోతే, పాలసీని పునరుద్ధరించే సమయంలో వారు తగ్గింపును పొందవచ్చు. దీనిని నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) అని పిలుస్తారు.

  1. నెట్వర్క్ గ్యారేజీలు

బీమా సంస్థతో సంబంధం కలిగి ఉన్న గ్యారేజీలపై వాహన యజమానులు అవగాహన కలిగివుండడం చాలా ముఖ్యం. పెద్ద మొత్తంలో క్లెయిమ్స్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బీమా నెట్వర్క్ లో భాగం కాని గ్యారేజ్ కు కారును తీసుకెళ్ళినట్లైతే, దానికి అయ్యే ఖర్చును వాహన యజమాని తన పాకెట్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాలలో, పాలసీదారుడు తాను చెల్లించిన మొత్తాన్ని బీమా సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా బీమా సంస్థలు ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ లను దాఖలు చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీని వలన వినియోగదారులు సులభంగా క్లెయిమ్ లను దాఖలు చేసుకోవచ్చు.

  1. ఇంజిన్ ప్రొటెక్షన్

ఇంజిన్ అనేది వాహనానికి అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా, ఇంజన్ కి జరిగే నష్టానికి సాధారణ వాహన పాలసీలో కవరేజ్ లభించదు. ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ ను తీసుకోవడం ద్వారా వరదలు, మొదలైన నష్టాల కారణంగా ఇంజిన్ కు ఏదైనా నష్టం ఏర్పడితే దానికి కవరేజ్ లభిస్తుంది.

  1. పర్సనల్ బిలాంగిగ్స్ కవరేజ్

ప్రస్తుత రోజుల్లో, ప్రజలు లాప్ టాప్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఖరీదైన వస్తువులను తీసుకుని కారులో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ కారు ప్రమాదానికి గురైతే, అందులోని వస్తువులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఖరీదైన వస్తువులకు జరిగే నష్టాన్ని సాధారణ వాహన బీమా పాలసీ కవర్ చేయదు. ఒకవేళ మీకు వ్యక్తిగత వస్తువుల కవరేజ్ యాడ్ ఆన్ తీసుకున్నట్లైయితే, మీ దెబ్బతిన్న వస్తువులకు కవరేజ్ లభించడంతో పాటు, మీ కారులో దొంగతనానికి గురైన వస్తువులకు కూడా కవరేజ్ లభిస్తుంది.

  1. పిలియన్ రైడర్ కవర్

సాధారణంగా వ్యక్తిగత ప్రమాద కవరేజ్ బైకు ను నడిపే వ్యక్తికి వర్తిస్తుంది, అలాగే బైకును నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న ప్రయాణికుడిని పిలియన్ రైడర్ అంటారు. అతనికి పిలియన్ రైడర్ కవర్ వర్తిస్తుంది. ఈ కవరేజ్ గాయపడిన పిలియన్ రైడర్ వైద్యానికి అయ్యే ఖర్చులను క్లెయిమ్ చేసుకోడానికి సహాయపడుతుంది. మీరు ఒక ఒకవేళ మీరు కారుని కలిగి ఉంటే, ప్యాసింజర్ కవర్ యాడ్ ఆన్ ను ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని