Credit Score: విద్యారుణంతో మంచి క్రెడిట్‌ స్కోర్‌.. ఎలా సాధించాలి?

ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుని చదువుకునే వారికి, సాధారణంగా విద్యారుణమే.. మొదటి రుణం అవుతుంది కాబట్టి మంచి క్రెడిట్‌ స్కోరును ఇక్కడి నుంచే సాధించవచ్చు. 

Published : 06 Jan 2023 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత విద్య కోసం నిధుల లోటును తీర్చడంలో ఎడ్యుకేషన్‌ లోన్‌ సహాయపడుతుంది. విద్యార్థులు దేశ విదేశాల్లో తమకు నచ్చిన కళాశాలలో నచ్చిన కోర్సును చదువుకుని తమ కలలను నెరవేర్చుకోవచ్చు. ఇలా ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుని చదువుకునే వారికి, సాధారణంగా విద్యారుణమే.. మొదటి రుణం అవుతుంది. అంటే మీ రుణ చరిత్ర ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోరు సాధించాలంటే ఇక్కడి నుంచే వ్యూహాత్మకంగా ప్లాన్‌ చేసుకోవడం అవసరం.

రుణం తీసుకునే ముందే..

ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్న విద్యార్థులు తమ చదువుకోవాలనుకుంటున్న కోర్సు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది? ఎంత ఖర్చువుతుంది,? ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు, ఏ బ్యాంకులు అందిస్తున్నాయి? వంటి అన్ని అంశాలపై పరిశోధన చెయ్యాలి. ఇలాంటి రుణాన్ని ఇప్పటికే తీసుకున్న స్నేహితులు, బంధువులు ఉంటే వారితో మాట్లాడాలి. విద్య, ఆర్థిక ప్రయాణం ప్రారంభం నుంచి చెల్లింపుల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే వ్యూహాత్మకంగా చెల్లింపుల ప్రణాళిక సిద్ధం చేసుకుని భవిష్యత్‌లో మంచి క్రెడిట్‌ స్కోరు సాధించవచ్చు.

రీపేమెంట్‌ వ్యూహం..

రుణం తిరిగి చెల్లించడం అనేది విద్యార్థి  బాధ్యత. అందువల్ల ఆన్‌-బోర్డింగ్‌కు ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి. తద్వారా రుణ పత్రాల్లో ఉన్న అన్ని క్లాజుల గురించీ తెలుసుకోగులుగుతారు. అలాగే తిరిగి చెల్లింపులకు ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం రుణ మొత్తం, కాలపరిమితి, ఈఎంఐలు వంటి వాటి గురించి బ్యాంకులతో చర్చించాలి.

మారటోరియం..

రుణాన్ని సజావుగా చెల్లించేందుకు, మొదటి నుంచే మంచి క్రెడిట్‌ స్కోరును రూపొందించడానికి.. ఫైనాన్సును క్రమబద్ధీకరించడం అవసరం. సాధారణంగా విద్యా రుణం తీసుకున్న నాటి నుంచి ఈఎంఐలు చెల్లింపులు మొదలుకావు. చదువు పూర్తిచేసి సంపాదన ప్రారంభమైన తర్వాత రుణ చెల్లింపులను ప్రారంభించవచ్చు. ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మారటోరియం పీరియడ్‌ అంటారు. సాధారణంగా ఈ కాలంలో రుణంపై వర్తించే వడ్డీ మొత్తాన్ని కూడా అసలు మొత్తానికి జోడించి, ఈఎంఐను లెక్కిస్తారు. కాబట్టి, రుణ మొత్తం పెరగకుండా ఈ మారటోరియం కాలంలో ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించడం ద్వారా భారం తగ్గించుకోవచ్చు.

చదువుకుంటూనే..

విదేశాల్లో విద్యార్థులు చదువుతూనే పార్ట్‌-టైమ్‌ జాబ్‌ చేస్తుంటారు. ఆ మొత్తం వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం మన దేశంలోనూ పార్ట్‌-టైమ్‌ ఉద్యోగావకాశాలు పెరిగాయి. కాబట్టి విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్‌-టైమ్‌ జాబ్‌ చేసి.. వచ్చిన ఆదాయంతో వడ్డీ చెల్లించవచ్చు. ఈఎంఐలు ప్రారంభం కావాడానికి ముందే రుణ భారాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.

ఉద్యోగంలో చేరాక..

చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత.. ముందుగా ఎడ్యుకేషన్‌ లోన్‌పై దృష్టి పెట్టాలి. బ్యాంకును సంప్రదించి మీ ఆదాయం ఆధారంగా చెల్లింపుల ప్రణాళికను రూపొందించుకోవాలి. అలాగే ఆదాయంలో ఎక్కువ భాగం పొదుపు చేసే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే క్రమం తప్పకుండా ఈఎంఐలను చెల్లించడంలో సఫలం అవుతారు. 

అత్యవసర నిధి..

ఉద్యోగంలో చేరాక.. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూనే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా కారణంగా రెండు మూడు నెలలు ఈఎంఐ చెల్లించలేకపోతే ఈ అత్యవసర నిధి సహాయపడుతుంది. దీంతో ఈఎంఐ చెల్లింపుల్లో ఇబ్బందులు రావు. మంచి క్రెడిట్‌ స్కోరును రూపొందించుకోవచ్చు. 

చివరిగా..

ఎడ్యుకేషన్‌ లోన్‌ను ఒత్తిడి లేకుండా.. సకాలంలో చెల్లించగలిగితే, ప్రారంభంలోనే మంచి చెల్లింపుల రికార్డును సొంతం చేసుకోగులుగుతారు. ఇది క్రెడిట్‌ స్కోరును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి భవిష్యత్‌లో గృహ, వాహన రుణాలను తక్కువ వడ్డీ రేటుకే పొందొచ్చు. అలాగే బ్యాంకులు మీకు రుణం ఇచ్చే విషయంలో ఎప్పుడూ ముందుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని