ఈఎల్ఎస్ఎస్ దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు

ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో మ‌దుపు చేస్తుంటాయి కాబ‌ట్టి ప‌న్నుమిన‌హాయింపు మాత్రమే కాకుండా దీర్ఘ‌కాలికపెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి.​​​​​​.....

Published : 19 Dec 2020 13:12 IST

ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో మ‌దుపు చేస్తుంటాయి కాబ‌ట్టి ప‌న్నుమిన‌హాయింపు మాత్రమే కాకుండా దీర్ఘ‌కాలికపెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి.​​​​​​​

ఈక్విటీ లింకిడ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబ‌డుల‌తో దీర్ఘ‌కాలంలో అధిక రాబ‌డులే కాకుండా ప‌న్ను మిన‌హాయింపు కూడా పొంద‌వ‌చ్చు. సెప్టెంబ‌రు గ‌ణాంకాల ప్ర‌కారం లిక్విడ్ ఫండ్లు, ఇన్‌క‌మ్ ఫండ్ల నుంచి నిధుల ఉప‌సంహ‌ర‌ణ పెరిగింది. అదే స‌మ‌యంలో ఈక్వీటీ, ఈక్వీటీ సంబంధ పొదుపు ప‌థ‌కాలు (ఈఎల్ఎస్ఎస్‌)లో పెట్టుబ‌డులు రూ. 11,250 కోట్లు పెరిగాయి. సెప్టెంబ‌రు చివ‌రికి మ్యూచువ‌ల్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల విలువ త‌గ్గి మొత్తంగా రూ.22 ల‌క్ష‌ల కోట్లకు చేరాయి.

ఈక్వీటీ, ఈఎల్ఎస్ఎస్ ఫోలీయోలు ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం మొద‌టి ఆరు నెల‌లో రూ. 56 ల‌క్ష‌ల నుంచి 5.91 కోట్ల మేర వృధ్ది చెందాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై పెట్టుబ‌డిదారునికి ఆస‌క్తి పెర‌గ‌డంతో ఈక్వీటీ సంబంధ ప‌థ‌కాల‌లో రూ. 60,475కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఈ కాలంలో 65 ల‌క్ష‌ల కొత్త ఫోలియోలు అద‌నంగా చేరాయి. సెప్టెంబ‌రు చివ‌రి నాటికి మొత్తం ఫోలియోల సంఖ్య 7.78 కోట్ల‌కు చేరింది.

ఈఎల్ఎస్ఎస్ ఎలా ప‌నిచేస్తుంది?

ప‌న్నుఆదా కోసం చూస్తున్న‌వారికి ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక‌. ఇవి ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో మ‌దుపు చేస్తుంటాయి కాబ‌ట్టి ప‌న్నుమిన‌హాయింపు మాత్రమే కాకుండా దీర్ఘ‌కాలికపెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి. ఇందులో సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి ప‌న్నుచెల్లించే వ్య‌క్తి దీనిని ప‌న్నుఆదా చేసే పెట్టుబ‌డి సాధ‌నంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. అయితే ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే దీర్ఘకాలిక మూలధన రాబ‌డుల‌పై 10 శాతం పన్ను విధిస్తారు. లాక్ - ఇన్ పీరియ‌డ్‌ 3 సంవత్సరాలు. అధిక శాతం పెట్టుబ‌డిని వివిధ సంస్థ‌ల షేర్ల‌లో పెడ‌తారు. ఒక వ్య‌క్తి ఈఎల్ఎస్ఎస్‌లో ఎంతైన పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. దీనికి ప‌రిమితి లేదు.

ఇత‌ర‌ ప‌థ‌కాల‌తో పోలిస్తే లాక్ ఇన్ త‌క్కువే

వాస్తవానికి, ఇత‌ర ప‌న్ను ఆదా ప‌థ‌కాలైన‌ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, 5 సంవత్సరాల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటితో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ లో అత్యల్ప లాక్-ఇన్ వ్యవధి ఉంది. ఒక సంవత్సరానికి ఈఎల్ఎస్ఎస్‌లో అత్యధిక 30% స్లాబు పన్ను చెల్లింపుదారుడు 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెడితే, అతను పన్నుల రూపంలో రూ.46,350 ఆదా చేయవచ్చు. అంతేకాకుండా, మిగిలిన వాటితో పోలిస్తే అతి త‌క్కువ పెట్టుబ‌డితో ప్రారంభించ‌వ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్‌ కనీస పెట్టుబడి రూ. 500. నిధుల మొత్తాన్ని ఒకేసారిగా, సిస్ట‌మేటింగ్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (సిప్‌) ద్వారా ప్రతి నెలా పెట్టుబడి పెట్టవచ్చు.

అధిక రాబ‌డులు:

గ‌ణాంకాల ప్ర‌కారం ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ల కంటే ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల్లో రాబ‌డి కాస్త మెరుగ్గా వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌నీసం మూడు సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి పెట్ట‌డం త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి ఫండ్ మేనేజ‌ర్లు పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇది అస్థిర‌త‌ను త‌గ్గిస్తుంది. ఫండ్ మేనేజ‌ర్ అధిక రాబ‌డులు సాధించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. స్థిర‌త్వం పెంచ‌డంతో పాటు మెరుగైన రాబ‌డుల‌ను అందిస్తుంది. అంతేకాకుండా సిప్ విధానం ద్వారా పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల ప్ర‌తి మూడు సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పిరియ‌డ్ పెరుగుతుంది. ఇందులో ఉన్న మ‌రో అతిపెద్ద లాభం, మార్కెట్ ఒడిదుడుకుల వ‌ల‌న వ‌చ్చే రిస్క్‌ను అధిగ‌మించ‌డం కోసం ఫండ్ మేనేజర్ విభిన్న రంగాల షేర్ల‌లో పెట్టుబడులు పెడుతుంటారు. అందువ‌ల్ల పెట్టుబడిదారుడు వ్య‌క్తిగ‌తంగా షేర్ల‌ పనితీరును క్రమం తప్పకుండా చూడాల్సిన అవసరం లేదు. అయితే రాబ‌డులు ఫండ్ మేనేజ‌ర్ స‌రైన షేర్ల‌ను ఎంచుకోవ‌డంలో చూపించే సామ‌ర్ధ్యం మీద ఆదార‌ప‌డి ఉంటుంది.

ఈఎల్ఎస్ఎస్ ల్లో ఫండ్ మేనేజ‌ర్లు ఎంపిక చేసుకునే పెట్టుబ‌డుల ఆధారంగా ఫండ్లు ఆర్జించే రాబ‌డిలో తేడా ఉంటుంది. పెట్టుబ‌డి మొత్తాన్ని ఒకే ఫండ్‌లో కాకుండా 3నుంచి 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల‌గా విభజించడం మంచిది. అదేవిధంగా, పెట్టుబ‌డిదారుడు సిప్ విధానం ద్వారా రూ. 5000 పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్న‌ప్పుడు రెండు భాగాలుగా విభ‌జించి రూ.2500 చొప్పున రెండు ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో పెడితే పెట్టుబ‌డికి మ‌రింత వైవిధ్య‌త చేకూరుతుంది.

గ్రోత్ vs డివిడెండ్ ఎంపిక‌

ఫండ్ సంస్థ‌లు రెండు ర‌కాల ఎంపిక‌ల‌ను పెట్టుబ‌డిదారుల‌కు అందిస్తున్నాయి. గ్రోత్. డివిడెండ్. గ్రోత్ విధానంలో మ‌ధ్య‌లో డివిడెండ్ల రూపంలోరాబ‌డి ఉండ‌దు. మెచ్యూరీటీ అనంత‌రం రాబ‌డితో పాటు మొత్తం నిధిని పెట్టుబ‌డిదారునికి అందిస్తారు. దీర్ఘ‌కాలంలో కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నాల‌తో ఎన్ఏవీ పెరుగుతుంది. కాబ‌ట్టి దీర్ఘ‌కాలంలో వృద్ధి ని కోరుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకోవ‌డం మంచిది. డివిడెండ్ చెల్లింపు ఎంపికలో, ఫండ్ నిర్వాహ‌కులు మ‌ధ్య‌లో డెవిడెండ్లు చెల్లిస్తారు. వారు ప్ర‌క‌టించిన విధంగా మ‌దుప‌ర్ల‌కు త‌మ పెట్టుబ‌డి అనుగుణంగా డివిడెండ్లు పొందుతారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి గృహ అవ‌స‌రాల‌కు, అద‌న‌పు ఆదాయం కోసం చూస్తున్న వారికి డివిడెండ్ చెల్లింపులు స‌రైన ఎంపిక‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని