బంగారంపై వ‌డ్డీ పొంద‌డం ఎలా?

బంగారాన్ని కొనుగోలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా? మీ ఫోర్ట్‌ఫోలియోలో క‌నీసం 10 నుంచి 15 శాతం ప‌సిడి పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాల‌ని ఆర్ధిక ప్ర‌ణాళికా నిపుణులు సూచిస్తున్నారు. ఎస్‌బీఐ రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కంతో భౌతిక బంగారంపై కూడా రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఎస్‌బీఐ అందించే ...

Published : 16 Dec 2020 20:29 IST

బంగారాన్ని కొనుగోలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా? మీ ఫోర్ట్‌ఫోలియోలో క‌నీసం 10 నుంచి 15 శాతం ప‌సిడి పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాల‌ని ఆర్ధిక ప్ర‌ణాళికా నిపుణులు సూచిస్తున్నారు. ఎస్‌బీఐ రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కంతో భౌతిక బంగారంపై కూడా రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఎస్‌బీఐ అందించే ఈ ప‌థ‌కంలో మీ భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేయడం ద్వారా వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

ఎస్‌బీఐ రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కానికి సంబంధించిన ప్ర‌ధాన అంశాలు:

దేశంలో నిష్ప‌ప్ర‌యోజ‌నంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించి దానిని ఉప‌యోగంలోనికి తీసుకురావ‌ల‌నే ఉద్దేశంతో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. వినియోగ‌దారుల బంగారానికి వ‌డ్డీ ఆదాయాన్ని అందించ‌డ‌మే ప‌థ‌కం ల‌క్ష్యమ‌ని ఎస్‌బీఐ వెబ్‌సైట్ లో పేర్కొంది.

భార‌త దేశంలో నివ‌సించే ప్ర‌జ‌లు, విడిగా లేదా ఉమ్మ‌డిగా , య‌జ‌మాని, కంపెనీ భాగ‌స్వాములు, హిందూ అవిభాజ్య కుటుంబాల వారు, సెబీ(మ్యూచువ‌ల్ ఫండ్‌) కింద రిజిష్ట‌రైన‌ మ్యూచువ‌ల్ ఫండ్లు/ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లతో స‌హా ట్ర‌స్ట్‌లు మొద‌లైన‌వారు ఎస్‌బీఐ- ఆర్‌-జీడీఎస్‌ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ఈ ప‌థ‌కంలో చేరేందుకు క‌నీసం 30 గ్రాముల బంగారాన్ని పెట్టుబ‌డిగా పెట్టాలి. గ‌రిష్ట ప‌రిమితి లేదు.

స్వ‌ల్ప కాలిక బ్యాంకు డిపాజిట్ (ఎస్‌టీబీడీ):

1 నుంచి 3 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి; ఒక సంవ‌త్స‌ర డిపాజిట్ల‌కు వ‌డ్డీ వార్షికంగా 0.50 శాతం, 1 నుంచి 2 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి డిపాజిట్ల‌కు వ‌డ్డీ వార్షికంగా 0.55 శాతం, 2 నుంచి 3 సంవ‌త్స‌రాల‌కు వార్షికంగా 0.60 శాతంగా ఉంది. స్వ‌ల్ప‌కాలిక బ్యాంకు డిపాజిట్ల‌కు నాన్ కుమ్యూలేటీవ్ విధానంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి 31కి వ‌డ్డీ చెల్లిస్తారు. కుమ్యూలేటీవ్ విధానంలో మెచ్యూరిటీ స‌మ‌యానికి వ‌డ్డీ చెల్లిస్తారు. ఎస్‌టీబీడీలో అస‌లు, వ‌డ్డీ కూడా బంగారం రూపంలో ఉంటుంది. బ్రోకెన్‌ స‌మ‌యానికి కూడా వ‌డ్డీ చెల్లిస్తారు.

మ‌ధ్య‌, దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్లు:

మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌ (ఎమ్‌టీజీడీ) - 5 నుంచి 7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి. ఈ డిపాజిట్ల‌పై వ‌డ్డీ వార్షికంగా 2.25 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎల్‌టీజీడీ) - 12 నుంచి 15 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి. ఈ డిపాజిట్ల‌పై వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌, దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ల‌లో అస‌లు బంగారం రూపంలో ఉంటుంది. వ‌డ్డీ న‌గ‌దు రూపంలో చెల్లిస్తారు. వ‌డ్డీ కూడా బంగారం రూపంలో తీసుకోవ‌చ్చు. ల‌భించే బంగారం అప్ప‌టి ధ‌ర ఆధారంగా ఉంటుంది. అయితే దీనికి 0.2 శాతం ఛార్జీలు ఉంటాయి. సాదార‌ణ వ‌డ్డీని ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి31 నాటికి, కుమ్యూలేటీవ్ వ‌డ్డీని మెచ్యూరీటీ స‌మ‌యానికి, న‌గ‌దు రూపంలో చెల్లిస్తారు. బ్రోకెన్ పిరియ‌డ్‌కి కూడా మెచ్యూరిటీ స‌మ‌యానికి వ‌డ్డీ చెల్లిస్తారు. బంగారం డిపాజిట్ చేసిన రోజున ఉన్న విలువ ఆధారంగా వ‌డ్డీ చెల్లిస్తారు. (డిపాజిట్ పై వ‌డ్డీ పొందే తేదీ నాటికి డిపాజిట్ చేసిన తేదీకి మ‌ధ్య‌ ఉండే కాలాన్ని బ్రోకెన్ పిరియ‌డ్ అంటారు.)

డిపాజిట్ దారుడు వార్షిక సాధార‌ణ వ‌డ్డీ లేదా కుమ్యూలేటీవ్ (వార్షికంగా కాంపౌండ్ చేస్తారు) వ‌డ్డీ విధానాల‌లో ఒక దాన్ని బంగారం డిపాజిట్ స‌మ‌య‌ములోనే ఎంచుకోవాలి. ఈ డిపాజిట్ల‌ను ముంద‌స్తుగా ఉప‌సంహ‌రించుకుంటే దానికి కొంత పెనాల్టీ ఉంటుంది. ఇది సంబంధిత ప‌థ‌కం కాల‌ప‌రిమితిని బ‌ట్టి ఉంటుంది.

ఈ ప‌థ‌కం కింద డిపాజిట్ల‌పై వ‌డ్డీ, శుద్దీక‌ర‌ణ త‌రువాత అమ్మ‌కానికి వీలుగా ఉండే బంగారు క‌డ్డీలుగా మార్చిన త‌రువాత లేదా బంగారం తీసుకున్న 30 రోజుల త‌రువాత ఏదీ ముందుగా వ‌స్తుందో ఆ రోజు నుంచి చెల్లిస్తారు. బంగారు క‌డ్డీలు, బిల్ల‌లు, రాళ్ళు పొద‌గ‌ని ఆభ‌ర‌ణాలు ముడి బంగారాన్ని, ఇత‌ర లోహాలను అనుమ‌తిస్తారు. వినియోగ‌దారుడు ద‌ర‌ఖాస్తు పార‌మ్‌ను, గుర్తింపు కార్డ‌ను, చిరునామా ఆధారాలు, వ‌స్తువుల‌ను ఎస్‌బీఐకి ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని