NPS: నెల‌కు రూ.10 వేల మ‌దుపుతో రూ.1.5 ల‌క్ష‌ల పింఛను పొందడం ఎలా?

ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యంలో 40 శాతం నిధుల‌ను యాన్యూటీ కొనుగోలు కోసం వినియోగించాలి. 

Updated : 07 Dec 2021 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంపాదిస్తున్న వ్య‌క్తి.. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు, ప‌ద‌వీ విర‌మ‌ణ, ఇత‌ర ల‌క్ష్యాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పోర్ట్‌ఫోలియోను నిర్మించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప‌ద‌వీ విర‌మ‌ణానంతర జీవితం కోసం మ‌దుపు చేసేవారు నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీం(ఎన్‌పీఎస్‌)ను త‌మ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగం చేసుకోవ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రెండు ర‌కాలుగా ఉపయోగ‌ప‌డే పెట్టుబ‌డి సాధ‌నం ఇది. ఎన్‌పీఎస్‌లో మ‌దుపు చేస్తే.. మెచ్యూరిటీ మొత్తం నుంచి గ‌రిష్ఠంగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌డంతో పాటు క‌నీసం 40 శాతం నిధుల‌తో యాన్యూటీల‌ను కొనుగోలు చేయాలి. కాబ‌ట్టి నెల‌నెలా పెన్ష‌న్ పొందేందుకు వీలుంటుంది.

ఎన్‌పీఎస్.. ఒకే పెట్టుబ‌డిలో ఈక్వీటీ, డెట్ రెండింటినీ అందిస్తుంది. ఖాతాదారుడు ఎంచుకున్న డెట్‌, ఈక్వీటీ నిష్ప‌త్తిని బ‌ట్టి రాబ‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఇందులో రాబ‌డి స్థిరంగా ఉండ‌దు. మ‌దుప‌ర్లు 75 శాతం వ‌ర‌కు ఈక్వీటీల‌లో మ‌దుపు చేసేందుకు ఎన్‌పీఎస్ వీలు క‌ల్పిస్తుంది. అయితే ఈక్వీటీ, డెట్‌ల నిష్ప‌త్తి 60:40గా ఉంటే మంచిద‌నేది నిపుణుల సూచ‌న‌. ఎందుకంటే ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యంలో 40 శాతం నిధుల‌ను యాన్యూటీ కోసం త‌ప్ప‌క కేటాయించాలి.

ఎన్‌పీఎస్ రాబ‌డి లెక్కింపు విధానం..

పెట్టుబ‌డిదారుడు ఈక్వీటీలో 60 శాతం, డెట్‌లో 40 శాతం నిధులు ఉంచితే.. అత‌ను/ఆమె ఈక్వీటీ నుంచి 12 శాతం, డెట్ నుంచి 8 శాతం రాబ‌డి పొందే అవ‌కాశం ఉంది. మొత్తం రాబ‌డిని లెక్కిస్తే... 

ఎన్‌పీఎస్ ఖాతాదారుడు ఈక్వీటీల‌లో 60 శాతం నిధుల‌ను మ‌దుపు చేస్తే.. రాబ‌డి అంచ‌నా 12 శాతం అనుకుంటే.. 60 శాతం నిధుల నుంచి వ‌చ్చే రాబ‌డి 12 x 0.60 = 7.20 శాతం 

అలాగే డెట్‌లో 40 శాతం నిధుల‌ను మ‌దుపు చేస్తే.. రాబ‌డి అంచ‌నా 8 శాతం అనుకుంటే.. 40శాతం నిధుల నుంచి వ‌చ్చే రాబ‌డి 8 x 0.40 = 3.20 శాతం, మొత్తం రాబ‌డి 7.20+3.20 = 10.40 అంటే దాదాపు 10 శాతం రాబ‌డి ఉంటుంది. 

పెట్టుబ‌డిదారుడు 60:40 నిష్ప‌త్తి ప్ర‌కారం ఈక్విటీ, డెట్‌లో నెల‌కు రూ.10 వేలు పెట్టుబ‌డి పెడుతూ 30 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే.. మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం యాన్యుటీ కొనుగోలు చేయాలి కాబ‌ట్టి మిగిలిన 60 శాతం అంటే రూ. 1,36,75,952 విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అలాగే నెల‌వారీగా రూ. 45,587 పెన్ష‌న్ పొంద‌చ్చు. దీనికి తోడు విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి పెట్టుబ‌డి పెడితే దాదాపు రూ. 1.50 ల‌క్ష‌ల నెల‌వారీ ఆదాయాన్ని పొందవచ్చు.

ఎలాగంటే..

ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని ఎస్‌డ‌బ్లూపీ(క్రమానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ ప్లాన్‌)లో మ‌దుపు చేస్తే.. పెట్టుబ‌డిదారుడు క‌నీసం 8 శాతం వార్షిక రాబ‌డిని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎన్‌పీఎస్ నుంచి విత్‌డ్రా చేసుకున్న రూ.1.36 కోట్ల‌ను ఎస్‌డ‌బ్ల్యూపీలో 25 సంవ‌త్స‌రాలు మ‌దుపు చేస్తే.. త‌ర్వాతి 25 ఏళ్లు.. నెల‌కు రూ. 1.03 లక్షల చొప్పున ఆదాయం పొంద‌చ్చు. దీనికి ఎన్‌పీఎస్ నుంచి వ‌చ్చే పెన్ష‌న్‌ను జోడిస్తే నెల‌కు దాదాపు రూ. 1.50 ల‌క్ష‌లు (రూ.1.03 ల‌క్ష‌లు+ రూ. 45,587) నెల‌వారీ ఆదాయం పొంద‌చ్చు.

ఎస్‌డ‌బ్య్లూపీ ప్లాన్లు..

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఈ కింది ఫండ్ల నుంచి 8 శాతం వార్షిక రాబ‌డిని ఆశించ‌వ‌చ్చు. 
1. ఐసీఐసీఐ ప్రూడెన్షియ‌ల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్‌ ఫండ్
2. ఏబీఎస్ఎల్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌
3. నిప్పాన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ ఫండ్‌
4. యాక్సిస్ బ్యాలెన్సడ్ ఫండ్‌

మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత రిస్క్ ఉంటుంది అని గమనించండి. 60 ఏళ్ళు దాటినా వారు రిస్క్ లేని పథకాలు ఎంచుకోవాలంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం(ఎస్.సి.ఎస్.ఎస్), బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు ఎంచుకోవచ్చు. మీ వీలు, రిస్క్ పరిమితి ప్రకారం పథకం ఎంచుకోవచ్చు.

(గమనిక : ఈక్విటీ పథకాల్లో మదుపు నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబుడుల పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని