Travel Card: ట్రావెల్ కార్డుతో అధిక ప్ర‌యోజ‌నాలు పొందాలంటే..ఏం చేయాలి?

ప్ర‌త్యేకించి ట్రావెల్ అవ‌స‌రాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్డుల‌ను రూపొందించ‌డం జ‌రిగింది.

Updated : 14 Feb 2022 15:04 IST

కోవిడ్ నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌యాణాల‌కు దూరంగానే ఉన్నారు. రెండేళ్ల సుదీర్ఘ కాలం త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌యాణాలు ఊపందుకున్నాయి. అయితే, పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణంతో ప్ర‌యాణ ఖ‌ర్చులు కూడా భారీగానే పెరిగాయి. స‌రైన ట్రావెల్ క్రెడిట్ కార్డును ఎంచుకోవ‌డం వ‌ల్ల కొంత‌వ‌ర‌కు ఈ ఖ‌ర్చుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

సాధార‌ణ క్రెడిట్ కార్డులు కూడా రివార్డు పాయింట్లు, రాయితీల‌ను అందిస్తాయి. కానీ, ప్ర‌త్యేకించి ట్రావెల్ అవ‌స‌రాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్డుల‌ను రూపొందించ‌డం జ‌రిగింది. అందువ‌ల్ల‌ ఎయిర్ మైళ్లు, విమానాశ్ర‌య లాంజ్ యాక్సెస్, ఇంధ‌న స‌ర్‌ఛార్జ్ త‌గ్గింపులు, హోట‌ల్ గ‌ది అద్దెపై రాయితీ, బీమా వంటి ప్ర‌యోజ‌నాలు ట్రావెల్ కార్డుతో ల‌భిస్తాయి. ఒక‌వేళ‌ మీరు విహార‌యాత్ర కోసం రూ. 5 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు అనుకుందాం. ఈ మొత్తాన్ని సాధార‌ణ క్రెడిట్ కార్డుతో ఖ‌ర్చు చేస్తే దాదాపు రూ. 2 వేల వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌యోజ‌నాలు ఉండ‌చ్చు. అదే  ట్రావెల్ కార్డుని ఉప‌యోగిస్తే రూ. 20 వేలకు మించి ప్ర‌యోజ‌నాలు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అన్ని బ్యాంకులు ఒకే ర‌కంగా ప్రయోజ‌నాలు అందించ‌వు. బ్యాంకును బ‌ట్టి అందించే ప్ర‌యోజ‌నాలు మారుతుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కి, సిటీబ్యాంక్ ప్రీమియ‌ర్ మైల్స్ కార్డును తీసుకుంటే..ఎయిర్‌లైన్స్‌, హోట‌ళ్ల‌లో చేసే ఖ‌ర్చుపై దాదాపు 4.5 శాతం వ‌ర‌కు రాయితీ ల‌భిస్తుంది. 

ట్రావెల్ కార్డులు అందించే ప్ర‌యోజ‌నాలు..
రివార్డు పాయింట్లు/క్యాష్‌బ్యాక్‌లు..
ట్రావెల్ కార్డు ద్వారా ఖ‌ర్చుపెట్టే ప్ర‌తీ రూపాయిపై రివార్డు పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. చాలా వ‌ర‌కు బ్యాంకులు జాయినింగ్ స‌మ‌యంలో కాంప్లిమెంట‌రీగా రివార్డు పాయింట్లు లేదా పున‌రుద్ధ‌రణ‌ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయి. జాయినింగ్ స‌మ‌యంలో ఇచ్చే రివార్డు పాయింట్లు ఒక్కోసారి పున‌రుద్ధ‌ర‌ణ రుసుముల‌ను తిరిగి పొంద‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. రివార్డు పాయింట్ల కోసం కార్డును తీసుకోవ‌డం కూడా స‌ముచితం కాదు. ఎందుకంటే, కార్డుపై జాయినింగ్ ఫీజులు ఉండ‌చ్చు. ప్ర‌యాణాల కోసం మీరు చేసే ఖ‌ర్చు, త‌ద్వారా మీకు ల‌భించే ప్ర‌యోజ‌నాలు..కార్డు తీసుకునేందుకు అయ్యే ఖ‌ర్చు కంటే అధికంగా ఉంటేనే క్రెడిట్ కార్డు తీసుకోవాలి. 

ఎయిర్ లాంజ్ యాక్సెస్, ఎయిర్ మైళ్లు..
ట్రావెల్ కార్డుతో ప్ర‌యాణాల‌కు ఖ‌ర్చు చేస్తే ఎయిర్ మైళ్లను పొంద‌వ‌చ్చు. కొన్ని కార్డులు జాయినింగ్ స‌మ‌యంలోనే బోన‌స్ ఎయిర్ మైళ్ల‌ను అందిస్తాయి. వీటిని భ‌విష్య‌త్తు ప్ర‌యాణ కొనుగోళ్ల‌కు వినియోగించుకోవ‌చ్చు. విమాన ఛార్జీలు, హోట‌ల్ వ‌స‌తి, గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేష‌న్, ట్రావెల్ ప్యాకేజీ డీల్స్ మొదలైన వాటి కోసం ఎయిర్‌మైళ్ల‌ను మార్చుకోవ‌చ్చు. ఎయిర్ మైళ్ల విలువ కార్డ్ వినియోగంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇది కాకుండా దేశీయ‌, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌లో కాంప్లిమెంట‌రీ లాంజ్ యాక్సెస్ కూడా ల‌భిస్తుంది. 

ఫారెక్స్ మార్క్‌-అప్ ఫీజు..
విదేశాలలో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లపై విదేశీ మార్క్-అప్ ఫీజులు వసూలు చేస్తారు. ట్రావెల్ కార్డ్‌ల‌పై అత్యధికంగా 3.50 శాతం వరకు మార్క్‌-అప్ ఫీజును వసూలు చేస్తారు. మ‌రోవైపు 2 లేదా 1.99 శాతం మార్క్-అప్ ఫీజు వ‌ర్తించే ట్రావెల్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్‌ 1.99 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ రిగాలియా క్రెడిట్ కార్డ్ 2 శాతం మార్క్‌-అప్‌ ఫీజును వసూలు చేస్తుండ‌గా, యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్‌లు మార్క్-అప్ ఫీజుగా 3.50 శాతం వసూలు చేస్తున్నాయి. 

ట్రావెల్ ఇన్సూరెన్స్..
ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు బీమా ర‌క్ష‌ణ‌ను అందిస్తున్నాయి. విమాన ప్రమాదాలు, ప్ర‌యాణించే స‌మ‌యంలో వ‌చ్చే ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితులు, పాస్‌పోర్ట్‌లు, సామాను పోగొట్టుకోవడం వంటి కార‌ణాల‌తో ఉత్పన్నమయ్యే ఊహించలేని ఖర్చుల నుంచి రక్షించడానికి సమగ్ర బీమా రక్షణ క‌ల్పిస్తున్నాయి. ఉదాహరణకు, యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ రూ. 2.5 కోట్లు, సిటి ప్రీమియ‌ర్ మైల్స్ క్రెడిట్ కార్డ్ రూ.1 కోటి వరకు విమాన ప్రమాద కవరేజీని అందిస్తున్నాయి. 

వీలైన‌న్ని ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే..
ప్ర‌యాణ స‌మ‌యంలో చేసిన ఖ‌ర్చుపై ఎయిర్ మైళ్ల‌ను సేక‌రించి వాటిని టికెట్ల కొనుగోలు వంటి వాటికి ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ప్ర‌యోజ‌నాలు పొందాల‌నే ఉద్దేశ్యంతోనే ట్రావెల్ కార్డును తీసుకుంటారు. కార్డు ద్వారా ఎంత ఎక్కువ మొత్తం ఖ‌ర్చు చేస్తే అంత ఎక్కువ‌గా ఎయిర్ మైళ్ల‌ను పొంద‌వ‌చ్చు.  

అయితే ట్రావెల్ కార్డుల‌లో వార్షిక రుసుము లేకుండా ఉచితంగా ల‌భించే కార్డులు, ప్రీమియం కార్డులు రెండూ ఉంటాయి. ఉచితంగా ల‌భించే కార్డుపై నామమాత్ర‌పు ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే ఉంటాయి. ప్రీమియం కార్డులో ల‌భించే ప్ర‌యోజ‌నాలు సాధార‌ణ క్రెడిట్ కార్డు లేదా ఉచితంగా ల‌భించే ట్రావెల్ కార్డులో ఉండ‌వు. ఉచిత కార్డులు, ఇంధ‌న స‌ర్‌ఛార్జ్ త‌గ్గింపు, ప‌రిమిత లాంజ్ ఏంట్రీ వంటి ప్రాథ‌మిక ప్ర‌యోజ‌నాల‌ను మాత్ర‌మే అందిస్తాయి. అత్య‌ధిక ప్ర‌యోజ‌నాలను పొందాల‌నుకునే వారు ప్రీమియం కార్డును తీసుకోవ‌చ్చు. రూ. 499 మొద‌లుకుని రూ. 10 వేల వార్షిక రుసుముతో ల‌భించే కార్డులు అందుబాటులోఉన్నాయి. ప్ర‌యాణాల కోసం ఎక్కువగా ఖ‌ర్చు చేసే వారు ప్రీమియం కార్డును ఎంచుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు పొందే ప్ర‌యోజ‌నాల విలువ మీరు చెల్లించే వార్షిక రుసుము కంటే త‌క్కువ ఉంద‌నుకుంటే అప్పుడు వార్షిక రుసుములు లేని కార్డును తీసుకోవ‌చ్చు.

ట్రావెల్ కార్డుల్లో కో-బ్రాండెడ్ కార్డులు ఉంటాయి. మీరు ఎప్పుడూ ఒకే విమాన‌యాన సంస్థ నుంచి ప్ర‌యాణించేందుకు ఇష్ట‌ప‌డే వారైతే కో-బ్రాండెడ్‌ కార్డుల‌ను తీసుకోవ‌చ్చు. ఇత‌ర కార్డుల‌పై ల‌భించే ప్ర‌యోజ‌నాల కంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు అందుతాయి. కానీ, వేరే సంస్థ‌ విమానంలో ప్ర‌యాణించాల్సి వ‌స్తే మాత్రం రివార్డు పాయింట్ల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని