UPI Payments: ఇంట‌ర్నెట్‌ లేకున్నా యూపీఐతో డబ్బులు పంపొచ్చు తెలుసా?

ఫీచ‌ర్ ఫోన్ నుంచి కూడా యూపీఐ  ద్వారా డ‌బ్బు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 

Updated : 22 Dec 2021 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ అంటే.. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఒక‌రి బ్యాంకు ఖాతా నుంచి వేరొక‌రికి న‌గ‌దు ఏ స‌మ‌యంలోనైనా సులువుగా పంపించ‌గ‌ల స‌దుపాయం. నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన భీమ్‌ యాప్‌తో పాటు పేటీఎమ్‌, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రైవేట్ యాప్‌ల నుంచి కూడా యూపీఐ చెల్లింపుల స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకుగానూ ఆయా యాప్‌ల‌ను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు స్మార్ట్ ఫోన్, ఇంట‌ర్నెట్‌ స‌దుపాయం కావాలి. కానీ ఫీచ‌ర్డ్ ఫోన్‌, స్మార్ట్ ఫోన్ రెండింటిలోనూ ఇంట‌ర్నెట్‌ స‌దుపాయం లేకుండా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. *99#కి డ‌య‌ల్ చేయ‌డం ద్వారా ఈ స‌ర్వీస్ మీకు ల‌భిస్తుంది. దీనిని USSD 2.0గా కూడా పిలుస్తారు.

రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం ఎలా?
* బ్యాంకులో న‌మోదైన రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంచి *99# డ‌యల్ చేసి బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి.

* మీ డెబిట్‌కార్డులోని చివ‌రి 6 అంకెలను ఎంట‌ర్ చేయాలి.

* ఎక్స్‌పైరీ తేదీ, యూపీఐ పిన్ ఎంట‌ర్ చేసి ధ్రువీకరించాలి. దీని త‌ర్వాత మీరు ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించ‌కోవ‌చ్చు.

* అయితే, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి డయల్‌ చేసినప్పుడు కచ్చితంగా మీ బ్యాంకు ఖాతా నంబర్‌ సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్లకూడదు.

న‌గ‌దు బ‌దిలీ చేసే విధానం..
* ముందుగా మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబర్‌ నుంచి *99#కి డ‌యల్ చేయాలి.

* స్ర్కీన్‌పై క‌నిపించే ఆప్ష‌న్ల‌లో డ‌బ్బు పంపించ‌డం కోసం ‘సెండ్ మ‌నీ’ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఇందుకోసం 1పై క్లిక్ చేయాలి.

*  త‌ర్వాత ఏ ఆప్ష‌న్ ద్వారా డ‌బ్బు పంపించాలో సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌ అయితే, 1 యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన ల‌బ్ధిదారుని కోసం 4, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోసం 5 క్లిక్ చేయాలి.

* ఉదాహ‌ర‌ణ‌కు మీరు మొబైల్‌ నంబర్‌ ద్వారా పంపించాలి అనుకుంటే 1ని డ‌యల్ చేయాలి.

* తర్వాత ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

* వారి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకు సాగాలి.

* వివరాలు సరైనవైతే మీరు పంపించాల‌నుకుంటున్న మొత్తాన్ని డ‌యల్ ప్యాడ్‌తో ఎంట‌ర్ చేయాలి.

* ఆ త‌ర్వాత మీ లావాదేవీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకోవాలి.

*  అన్నీ సరైనవే అయితే, యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయాలి.

* డ‌బ్బు బ‌దిలీ విజ‌య‌వంతంగా పూర్తైన త‌రువాత మొబైల్ నెంబ‌రుకి మెసేజ్ వ‌స్తుంది.

* లావాదేవీ రిఫరెన్స్‌ నంబర్‌ను ముందు జాగ్రత్తగా సేవ్‌ చేసి పెట్టుకోవాలి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం *99# సేవ ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేయ‌డంతో పాటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, యూపీఐ పిన్ సెట్ చేయ‌డం, మార్చ‌డం వంటి ఇత‌ర సేవ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స‌ర్వీస్‌ను ప్ర‌స్తుతం 41 ప్ర‌ముఖ బ్యాంకులు, అన్ని జీఎస్ఎమ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు హిందీ, ఆంగ్లంతో క‌లిపి 12 విభిన్న భాష‌ల్లో అందిస్తున్నాయి. ఈ సేవ‌ల‌కు టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు లావాదేవీకి రూ.రూ.0.50 నుంచి గ‌రిష్ఠంగా రూ.1.50 నామ‌మాత్ర‌పు ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు