కార్డు చెల్లింపుల్లో పోయిన మొత్తాన్ని తిరిగి పొంద‌డం ఎలా?

మీ డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు ద్వారా ఏదైనా రెస్టారెంట్ బిల్లు చెల్లించిన‌ప్పుడు, డ‌బ్బు మీ ఖాతాలో డెబిట్ అయ్యి, ఆ వ్యాపారి ఖాతాలో జ‌మ కాక‌పోతే ఏం చేయాలి? చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి, మీ సెషన్ సమయం ముగిసింది లాంటి మెసేజ్ స్క్రీన్ పై క‌నిపిస్తుంది. అయితే డబ్బు చెల్లింపు అయిన‌ట్లు ఎస్ఎమ్ఎస్ కూడా మీకు వ‌స్తుంది

Published : 17 Dec 2020 14:59 IST

డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు ద్వారా ఏదైనా రెస్టారెంట్ బిల్లు చెల్లించిన‌ప్పుడు, డ‌బ్బు మీ ఖాతాలో డెబిట్ అయ్యి, ఆ వ్యాపారి ఖాతాలో జ‌మ కాక‌పోతే ఏం చేయాలి? చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి, మీ సెషన్ సమయం ముగిసింది లాంటి మెసేజ్ స్క్రీన్ పై క‌నిపిస్తుంది. అయితే డబ్బు చెల్లింపు అయిన‌ట్లు ఎస్ఎమ్ఎస్ కూడా మీకు వ‌స్తుంది. ఇలాంటి ప‌ర‌స్థితి ఎదురైన‌ప్పుడు ఏంచేయాలి? సాధారణంగా, ఏదైనా బిల్లు చెల్లించిన‌ప్పుడు గానీ, మరి ఏఇత‌ర సంద‌ర్భంలో గానీ మీ ఖాతాలో డ‌బ్బు డెబిట్ అయ్యి, అవ‌త‌లి వారికి డ‌బ్బు చేర‌క‌పోతే, ఆ మొత్తం కొన్ని రోజుల‌లోనే మీ ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది.

ఒక వేళ అలా క్రెడిట్‌ కాక‌పోతే అప్పుడు ఏంచేయాలి?
క్రెడిట్‌కానీ సంద‌ర్భాల‌లో మీరు మీ బ్యాంకుకు “ఛార్జ్ బ్యాక్” అభ్యర్థనను పెట్ట‌వ‌చ్చు .ఛార్జ్ బ్యాక్ మెకానిజం అనేది ఒక వివాద పరిష్కార యంత్రాంగం, ఇది వినియోగ‌దారుడు మోసం, వివాదం లేదా తిరస్కరించడం వంటి వాటికి గురైన‌పుడు, అత‌డు లేదా ఆమె కోల్పోయిన మొత్తాన్ని రిఫండ్ చేసేందుకు ఉద్దేశించిన‌ది.

ఏవిధంగా ప‌నిచేస్తుంది:
ఖాతాదారుడు చార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్‌ను ప‌ట్టేందుకు 45-120 రోజుల స‌మ‌యం ఉంటుంది. ఇది మీ బ్యాంకును నియ‌మ‌నిబంధ‌న‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇందుకోసం వినియోగ‌దారుడు చెల్లింపులు చేసిన కార్డు జారీ చేసిన బ్యాంకుకు, త‌మ పూర్తి వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తు నింపి బ్యాంకుకు అందించాలి. వినియోగ‌దారులు ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ చేస్తున్నందుకు గ‌ల కార‌ణాలు, జ‌రిపిన లావాదేవీ వివ‌రాలు అందించాలి. వినియోగదారులు ఇచ్చిన‌ వివ‌రాల ప్ర‌కారం బ్యాంకులు లావాదేవీ జ‌రిపిన విధానం, వ్యాపారి త‌దిత‌ర వివ‌రాల‌ను క‌నుగొనే ప్ర‌య‌త్నం చేస్తుంది. బ్యాంకులు వినియోగ‌దారుల ఖాతా నుంచి ఏ ఖాతాలోకి మొత్తం జ‌మ అయింద‌నే విష‌యం తెలుసుకుంటారు.

బ్యాంకు స‌ద‌రు వ్యాపారిని క‌నుగొన్న త‌రువాత వారికి ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను పెడుతుంది. ఈ సంద‌ర్భంలో వ్యాపారి ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను తీసుకోవ‌చ్చు లేదా తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఒక‌వేళ తిర‌స్క‌రిస్తే అందుకు త‌గిన కార‌ణాల‌ను, వ‌స్తువులు లేదా సేవ‌లు డెలివ‌రీ చేసిన‌ట్లు ఆధారాలు ఉంటే వాటిని అందించాలి. ఈ స‌మ‌చారం వ్యాపారి ఖాతా ఉండే బ్యాంకు, వినియోగ‌దారుని బ్యాంకు, వినియోగ‌దారునికి తెలియ‌చేస్తారు. ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ ను అంగీక‌రించిన త‌రువాత ఆ మొత్తాన్ని మ‌ర్చెంట్ బ్యాంకు ఖాతా నుంచి వినియోగ‌దారుని బ్యాంకు ఖాతాకు బ‌దిలీ జ‌రిపి అనంత‌రం కార్డు య‌జ‌మాని ఖాతాలోకి జ‌మ‌చేస్తారు. బ్యాంకు ఇచ్చిన స‌మ‌యంలోగా వ్యాపారి స్పందించ‌క‌పోతే బ్యాంకు మ‌ర్చెంట్ ఖాతా నుంచి మొత్తాన్ని తీసి కార్డు య‌జ‌మాని ఖాతాలోకి జ‌మ‌చేస్తుంది.

ఒక వేళ వ్యాపారి వ‌స్తువ‌లు లేదా సేవ‌లు వినియోగ‌దారునికి చేర‌వేసిన‌ట్లు చెప్పినా, వినియోగ‌దారునికి ఆ వ‌స్తువులు లేదా సేవ‌లు అంద‌క‌పోతే వ్యాపారి దీనికి సంబంధించి మ‌రిన్ని ఆధారాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే త‌దుప‌రి ఆర్బిట్రేష‌న్‌కు వెళ్ల‌వ‌చ్చు. ఇక్క‌డ మొత్తం లావాదేవీ జ‌రిగిన క్ర‌మాన్ని ప‌రిశీలించి వినియోగ‌దారుడు, వ్యాపారి ఇద్ద‌రిలో ఎవ‌రి వ‌ద్ద‌ త‌ప్పు జ‌రిగింద‌నేది ప‌రిశీలించి చివ‌ర‌గా త‌ప్పు జ‌రిగిన వైపు పెనాల్టీ విధిస్తారు.

నిబంధనలు, షరతులు:
ఛార్జ్ బ్యాక్ రిక్వ‌స్ట్ పెట్టే ముందు వినియోగ‌దారులు అంగీకరించిన నిబంధనలు, షరతులను ప‌రిశీలించుకోవాలి. ఉదాహరణకు, వర్తకుడు ఐదు రోజుల వ్యవధిలో డెలివరీని పొందుతారని చెప్పిన‌ప్ప‌టికీ, మీరు 10 రోజుల్లో దాన్ని పొందుతారు. అలాంట‌పుడు ఛార్జ్ బ్యాక్ క్లెయిమ్ చేస్తే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. వివాదాలకు సంబంధించి పేర్కొన్న కాల వ్యవధి నిబంధన‌ల‌ను చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని