Job Loss: ఉద్యోగాన్ని కోల్పోయినవారు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?

ఉద్యోగం కోల్పోయిన అనంతరం తమకు తాము మానసికంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవడమే కాకుండా ఇంటిని చక్కదిద్దుకోవడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Published : 20 Apr 2023 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమందికి ఉద్యోగంతోనే జీవితం మొదలయినట్లు ఉంటుంది. అయితే, ఆర్థిక మాంద్యం కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఉద్యోగం కోల్పోవడం అనేది చాలా మందికి ఒక చిన్న పీడకల లాంటిది కాదు. అనేక రెట్లు షాక్‌కు గురిచేసేదే. ఈ దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కోడానికి మానసికంగా సిద్ధం కావాలి. ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు రెండు రకాల కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకటి మానసికంగా.. రెండోది ఆర్థికంగా. అలాంటప్పుడు ఆర్థికంగా ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం..

అత్యవసర నిధి

ఉద్యోగం కోల్పోయినప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మళ్లీ స్థిరపడేవారకు మీ ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న సమయంలో ఉద్యోగం కోల్పోవడం క్లిష్టమైన పరిస్థితనే చెప్పాలి. అయితే, సరైన ప్రణాళిక, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ మీకు కొత్త ఉద్యోగం వచ్చే వరకు మీ ఫైనాన్స్‌ను సమర్థంగా నిర్వహించడంలో బాగా సహాయపడతాయి. నెలవారీ ఆదాయం లేనప్పుడు, మీరు అత్యవసర నిధిపై ఆధారపడాలి. 8 నుంచి 10 నెలల ఖర్చును తట్టుకోవడానికి సహాయపడేలా ముందునుంచే ఈ నిధిని ఏర్పాట్లు చేసుకోవాలి. దీంతో రోజువారీ ముఖ్యమైన ఖర్చులనే కాకుండా రుణ చెల్లింపులు, బీమా ప్రీమియం మొదలైన వాటితో సహా కీలకమైన పెట్టుబడులు, అవసరమైన ఖర్చులను తీర్చుకోవచ్చు. 

అత్యవసర నిధి సరిపోకపోతే?

కొత్త ఉద్యోగం పొందడంలో జాప్యం జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర నిధి కొంత కాలానికే ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో మీకు ఆర్థికంగా మద్ధతునిచ్చే సన్నిహితులు, బంధువుల సాయం తీసుకోవచ్చు. ఎఫ్‌డీ/ఎల్‌ఐసీ పాలసీపై ఓవర్‌ డ్రాఫ్ట్‌, వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం, మ్యూచువల్‌ ఫండ్‌లు/షేర్‌లపై రుణం వంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప పీఎఫ్‌లో ఉన్న మొత్తాన్ని లిక్విడేట్‌ చేయకపోవడమే మంచిది. ఇది, మీకు పదవీ విరమణలో తగిన ఆదాయన్ని అందించడానికి ఉద్దేశించిన దీర్ఘకాలిక పెట్టుబడి.

నిత్యావసరాలకే పరిమితమవ్వాలి

ఉద్యోగం కోల్పోయిన తర్వాత రోజు, నెలవారీ ఖర్చులను యథాప్రకారం కొనసాగించేయకూడదు. దీనివల్ల అప్పటిదాకా సమకూర్చుకున్న నిధులను పూర్తిగా ఖర్చుపెట్టేసే అవకాశముంది. కఠినమైన నిర్ణయాలలో ఖర్చులను తగ్గించుకోవడం ఒకటి. మీ ఖర్చుల జాబితాను రూపొందించండి. వాటి ప్రాధాన్యతల ఆధారంగా వేరు చేయండి. ఉదాహరణకు అవసరమైన ఖర్చుల జాబితా పైన ఉండాలి. తక్కువ ముఖ్యమైన ఖర్చులు కింద ఉండాలి. అద్దె, కరెంట్‌ బిల్లులు, ఆహారం, కూరగాయల చెల్లింపులు, పాఠశాల ఫీజులు మొదలైనవి మీ ఖర్చుల జాబితాలో పైన ఉండాలి. వీలైనంత వరకు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, క్లబ్‌ మెంబర్‌షిప్‌, రెస్టారెంట్‌ ఖర్చులు, హాలిడే ట్రావెల్‌ మొదలైన కేటగిరీలపై ఖర్చులు దాదాపు లేకుండా చూసుకోవాలి.

వాయిదా వేసే ఖర్చులు

మీ దృష్టిని అవసరమైన చెల్లింపులపైకి మళ్లించడం, ఆలస్యం చేయగలిగిన వాటికి చెల్లింపులను నివారించడం ద్వారా మీ సాధారణ బడ్జెట్‌ను సర్దుబాటు చేయండి. ఉదాహరణకు మళ్లీ ఉద్యోగం పొందేవరకు ‘SIP’ పెట్టుబడులను చాలావరకు నిలిపివేయొచ్చు, పొదుపునకు సాయపడే RDలను ఆపేయడం మంచిది. ఇంధన ఖర్చులను ఆదా చేయడానికి వ్యక్తిగత కారులో ప్రయాణాన్ని నివారించాలి. 

మారటోరియం

మీకు ఉద్యోగం లేనప్పుడు, ఇప్పటికే ఉన్న అప్పులను తిరిగి చెల్లించడం చాలా పెద్ద పని. ఉద్యోగం లేకుండా ఉండే కాలం పెరిగికొద్దీ బకాయిల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు తిరిగి చెల్లించడంలో విఫలమైతే, అది మీ క్రెడిట్‌ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేయొచ్చు. మీ క్రెడిట్‌ హిస్టరీ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఉద్యోగ నష్టం గురించి సమాచారాన్ని పొందిన వెంటనే రుణాల విషయంలో ప్రణాళికలు మార్చుకోవాలి. మీకు రుణం ఇచ్చిన సంస్థలతో మాట్లాడి ఈఎంఐ పరిమాణాన్ని తగ్గించడానికి, రుణ చెల్లింపులు తాత్కలికంగా వాయిదా వేసుకోవడం, రీపేమెంట్‌ వ్యవధిలో పొడిగింపు వంటి అవకాశాలకు రుణ సంస్థలను అభ్యర్థించాలి.

తాత్కలిక సంపాదన

ఉద్యోగం కోల్పోవడమన్నది తాత్కలికం మాత్రమే. మీ మానసిక దైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత త్వరగా కొత్త ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అదే సమయంలో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ పొందడం లేదా నైపుణ్యాల ఆధారంగా ఫ్రీలాన్సింగ్‌ వంటి తాత్కలిక ఆదాయాలకు ప్రయత్నించండి. 

నైపుణ్యం పెంచుకోండి

ఖాళీ సమయంలో నైపుణ్యాన్ని పెంచుకోవడం మీద దృష్టి పెట్టండి. ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్‌, డిమాండ్‌ను అర్థం చేసుకోండి. మీరు పనిచేసే ఫీల్డ్‌లో ఎలాంటి నైపుణ్యం ఇప్పుడు అవసరమో ఆలోచించి అది పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు వచ్చిన పని మరింత మెరుగ్గా చేయడానికి ఖాళీ సమయాన్ని వెచ్చించండి. నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఉద్యోగం రావడం చాలా సులభం, దీనికి వయసుతో పనిలేదు. మీ రెజ్యూమ్‌ను అప్‌డేట్‌ చేసుకుని ఉత్సాహంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించండి. మీ స్నేహితులకు, ఇంతకు ముందు మీతో పనిచేసిన వారికి పంపించండి. దీనివల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరొక ఉద్యోగం సంపాదించగలరు.

చివరిగా: ఆర్థిక క్రమశిక్షణ, చక్కటి ప్రణాళికబద్ధమైన విధానాలు కలిగినవారు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులభంగా బయటపడొచ్చు. సాధారణ ఆర్థిక ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని