Credit Score: క్రెడిట్ స్కోర్‌ను మెరుగు పరుచుకోవడం ఎలా?

మంచి క్రెడిట్ స్కోర్ ఆర్థిక జీవితం సాఫీగా వెళ్ల‌డానికి ఒక మార్గం లాంటిది.

Updated : 25 Apr 2022 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ రుణ బ‌కాయిలు, రుణ చెల్లింపు గ‌డువు తేదీ లేదా ఎంచుకున్న ఈఎంఐ గురించి ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకోవాలి. రుణ చెల్లింపులో ఆల‌స్యం, రుణ గ్ర‌హీత క్రెడిట్ స్కోర్‌ను త‌గ్గిస్తుంది. మీ క్రెడిట్ కార్డ్‌ని తెలివిగా ఉప‌యోగించ‌డం, మీ ఖ‌ర్చుల‌ను ప‌రిమితం చేసుకోవ‌డం మంచి పద్ధ‌తి. మీరు క్రెడిట్ ప‌రిమితిని మించ‌కూడ‌దు. మంచి క్రెడిట్ స్కోర్ ఆర్థిక జీవితం సాఫీగా వెళ్ల‌డానికి ఒక మార్గం లాంటిది. క్రెడిట్ కార్డులు, కారు రుణాలు, ఇత‌ర రుణాల కోసం యువ‌త ప్ర‌య‌త్నించిన‌ప్పుడు 10 మంది దర‌ఖాస్తు చేస్తే 6 తిర‌స్క‌రణకు గురౌతున్నాయని వివిధ క్రెడిట్‌ నివేదిక‌లు చెబుతున్నాయి.

స‌కాలంలో రుణాలు చెల్లింపు: రుణ బ‌కాయిల కార‌ణంగా ప్ర‌భావిత‌మైన క్రెడిట్ స్కోర్‌ని మెరుగుప‌ర‌చుకోవ‌డానికి బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించాలి. మీరు గ‌తంలో కొన్ని చెల్లింపుల‌ను స‌రిగ్గా చేయ‌కుండా ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించే స్థితిలో ఉన్న‌ట్ల‌యితే వెంట‌నే బ‌కాయిల‌ను చెల్లించేయ‌డం మంచిది. మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఖ‌ర్చు చేసిన‌ప్పుడు, వినియోగాన్ని కొన‌సాగించ‌డానికి అవ‌స‌ర‌మైన క‌నీస మొత్తాన్ని చెల్లించే అవ‌కాశ‌మున్నా కూడా.. ఆ నెల‌లో మీరు భ‌రించ‌గ‌లిగే మొత్తం బ‌కాయి లేదా గ‌రిష్ఠ మొత్తాన్ని చెల్లించేయండి.

బ‌కాయిల చెల్లింపులు ఆల‌స్యం అయితే, మీకు జ‌రిమానా విధించడమే కాకుండా చెల్లించ‌ని మొత్తానికి అధిక వ‌డ్డీ రేటు విధిస్తారు. బిల్ మొత్తంలో క‌నీస ఛార్జీ 5% చెల్లిస్తే, మిగ‌తా మొత్తానికి నెలవారీ 3% నుంచి 4% వ‌డ్డీ‌ని చెల్లించ‌డానికి సిద్ధంగా ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం చెల్లింపును బ్యాంక్ ద్వారా ఆటోమేట్ చేయ‌డం కూడా మంచిదే. దీనివ‌ల్ల మీరు చెల్లింపు గ‌డువును మ‌రిచిపోయిన‌ప్ప‌టికీ ఇబ్బంది ఉండ‌దు.

రుణ దరఖాస్తులు: ఒక బ్యాంకు రుణ దర‌ఖాస్తుని తిర‌స్క‌రిస్తే ఆ బ్యాంకులోనే కాకుండా మ‌రొక బ్యాంక్‌లో కూడా వెంట‌వెంట‌నే రుణానికి దర‌ఖాస్తు చేయ‌కూడ‌దు. ఎందుకంటే మునుప‌టి బ్యాంక్ దర‌ఖాస్తుదారుని రుణం ఎందుకు తిర‌స్క‌రించిందో ఇత‌ర బ్యాంకులు కూడా తెలుసుకుంటాయి. మీ రుణ దర‌ఖాస్తుల‌ను ప‌రిమితం చేయాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్‌ మ‌రింత దెబ్బ‌తింటుంది. మీకు అవ‌స‌రం లేకుంటే క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్‌, రుణ దర‌ఖాస్తు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

క్రెడిట్ స్కోర్ త‌నిఖీ: మీ క్రెడిట్ స్కోర్‌ని అప్పుడ‌ప్పుడు త‌నిఖీ చేయండి. ఇది మీ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో తెలియ‌జేయ‌డంలో మీకు స‌హాయ‌ప‌డుతుంది. త‌ద‌నుగుణంగా క్రెడిట్ స్కోర్ స‌రిదిద్దుకోవ‌డానికి త‌గిన చ‌ర్య‌లు రూపొందించుకోవ‌చ్చు.

క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి: క్రెడిట్ కార్డ్ ప‌రిమితిపై 30 శాతం మాత్ర‌మే ఉప‌యోగించుకోవ‌డం మంచిది. ఇది దాటితే క్రెడిట్ స్కోర్ పై ప్ర‌భావం చూపుతుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా వ్య‌క్తిగ‌త రుణం తిర‌స్క‌రించిన‌పుడు బ‌య‌ట వివిధ యాప్‌ల‌తో గానీ రుణ సంస్థ‌ల‌లో గానీ రుణాలు తీసుకోవ‌డం మంచిది కాదు. త‌ప్ప‌నిస‌రి రుణం, విచ‌క్ష‌ణ‌తో కూడిన రుణాల మ‌ధ్య తేడాను గుర్తించండి.

ఆదాయాన్ని బ‌ట్టే ఖ‌ర్చు: మీ కెరీర్ ద‌శ‌, ప్ర‌స్తుత ఆదాయ స్థాయిల‌ను బ‌ట్టి ఖ‌ర్చుల‌ను పునఃప‌రిశీలించండి. సాధ్య‌మైన చోట ఖ‌ర్చుల‌ను నియంత్రించండి. మీకు ఏమైనా  రుణ బ‌కాయిలుంటే క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించండి. మంచి ఆర్థిక చరిత్ర‌తో మీరు సుల‌భంగా రుణాలు పొందొచ్చు. మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి, ఆర్థిక స్థిర‌త్వాన్ని సాధించ‌డానికి క్ర‌మ‌శిక్ష‌ణ‌, తెలివితేట‌లు చాలా అవ‌స‌రం.

బ్యాలెన్స్ బ‌దిలీ: మీకు డ‌బ్బుకు ఇబ్బందులుంటే, రెండు క్రెడిట్ కార్డ్‌లున్న‌వారు బ్యాలెన్స్‌ను ఒక కార్డు నుంచి మ‌రొక కార్డుకు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. బ్యాలెన్స్ బ‌దిలీని త‌ర‌చుగా అల‌వాటు చేసుకోకండి. ఇది అప్పుల ఊబిలో చిక్క‌డానికి ఆరంభం కావ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని