Home loan: గృహ రుణ అర్హత మెరుగుపరుచుకోవడానికి 5 మార్గాలు

రుణం కోసం దాఖ‌లు చేసిన‌ప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి.

Updated : 28 Jan 2022 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఒక మంచి మార్గం గృహ రుణం. బ్యాంకుల పాటు బ్యాంకింగేత‌ర‌ ఆర్థిక సంస్థలు కూడా గృహ రుణాల‌ను (Home loan) ఇస్తున్నాయి. అయితే త‌క్కువ వ‌డ్డీ రేటు (Home loan intrest rate)తో త్వరితగతిన రుణం మంజూరు కావాలంటే రుణం తీసుకునే వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. గృహ రుణ ద‌ర‌ఖాస్తును మూల్యాంక‌నం చేసేట‌ప్పుడు బ్యాంకులు అనేక అంశాల‌ను పరిగ‌ణ‌నలోకి తీసుకుంటాయి. ద‌ర‌ఖాస్తుదారుని ఆదాయం, ప్రస్తుత వయసు, ఇంకా ఎంత కాలం ప‌నిచేస్తారు? ఎల్‌టీవీ నిష్పత్తి, కొనుగోలు చేసే ఆస్తి, ఇప్పటికే ఉన్న రుణాలు ఇలా అనేక అంశాల‌ను ప‌రిశీలించి రుణ అర్హతను నిర్ణయిస్తారు. అయితే ఈ గృహ రుణాన్ని పొందేందుకు మీకు అర్హత ఉందా? గృహ రుణ అర్హతను ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

గృహ రుణ అర్హత పెంచుకునేందుకు 5 మార్గాలు

క్రెడిట్ స్కోర్‌: రుణ అర్హత సాధించాలంటే క్రెడిట్ స్కోర్‌ (Credit Score) పెంచుకోవాలి. క్రెడిట్ స్కోర్ అనేది రుణ అర్హతను నిర్ణయిస్తుంది. రుణం కోసం దాఖ‌లు చేసిన‌ప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎక్కువ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందొచ్చు. సాధార‌ణంగా 750 పైన క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులు తప్పనిసరిగా రుణాలు ఆమోదిస్తాయి. క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునేందుకు చాలా మార్గాలున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుని ఉప‌యోగించ‌డం, బిల్లుల‌ను స‌కాలంలో చెల్లించ‌డం ద్వారా క్రెడిట్ స్కోరును మెరుగుప‌ర‌చుకోవ‌చ్చు.

డౌన్‌పేమెంట్‌: గృహ విలువ‌లో 75 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణం (Home Loan) మంజూరు చేసేందుకు బ్యాంకుల‌ను ఆర్‌బీఐ అనుమ‌తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రుణ గ్రహీత స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని డౌన్‌పేమెంట్ లేదా మార్జిన్ కాంట్రీబ్యాష‌న్ అంటారు. క‌నీస డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తానికి గృహ రుణం తీసుకునే వీలున్నప్పటికీ ఎక్కువ మొత్తం డౌన్‌పేమెంట్ చేసేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివ‌ల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒక‌టి రుణం మొత్తం త‌గ్గుతుంది కాబ‌ట్టి ఈఎమ్ఐ (Home Loan EMI) కూడా త‌క్కువే ఉంటుంది. ఈఎమ్ఐ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండ‌డంతో సుల‌భంగా రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించ‌గ‌లుగుతారు. మ‌రోవైపు రుణం అందించిన ఆర్థిక సంస్థలకు కూడా క్రెడిట్ రిస్క్ త‌గ్గుతుంది కాబ‌ట్టి రుణం ఆమోదం పొందే అవ‌కాశాలు పెరుగుతాయి.

ఉమ్మడి గృహ రుణం: తగినంత ఆదాయం లేక‌పోయినా, క్రెడిట్ స్కోరు త‌క్కువున్నా రుణం తిర‌స్కరించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంట‌ప్పుడు స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న మ‌రొక కుటుంబ స‌భ్యుడితో క‌లిపి రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే రుణం ఆమోదం అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. మ‌హిళ‌ను స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారునిగా ఎంచుకుంటే వ‌డ్డీ రేటు కూడా త‌గ్గే అవ‌కాశం ఉంది. కొన్ని బ్యాంకులు మ‌హిళ‌ల‌కు ఇత‌రుల‌తో పోలిస్తే త‌క్కువ వ‌డ్డీ రేటుకే గృహ రుణాన్ని ఇస్తున్నాయి. అందువ‌ల్ల భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా, స్థిర ఆదాయ మార్గం ఉన్నా ఉమ్మడిగా గృహ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని సుల‌భంగా గృహ రుణం పొందొచ్చు.

కాల‌ప‌రిమితి పెంచుకోవ‌డం: ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం వల్ల ఈఎమ్ఐ (Home Loan EMI) తగ్గుతుంది. దీంతో రుణం సుల‌భంగా చెల్లించ‌గ‌ల‌రనే ఉద్దేశంతో రుణం మంజూరు చేస్తాయి. దీంతో రుణ‌ అర్హత పెరుగుతుంది. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. కాల‌ప‌రిమితి పెరిగే కొద్దీ రుణ మొత్తంపై చెల్లించాల్సిన వ‌డ్డీ కూడా పెరుగుతుంది. ఒక‌వేళ ఎక్కువ మొత్తం ఈఎమ్ఐలు చెల్లించ‌గలిగే వారు త‌క్కువ కాల‌వ్యవధి ఎంచుకోవచ్చు. కానీ రుణం త్వరగా చెల్లించాలనే ఉద్దేశంతో ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌ను కోసం కేటాయించిన మొత్తాన్ని రుణ ఈఎమ్ఐల‌కు మ‌ళ్లించండం కూడా మంచి ప‌ద్ధతి కాదు.

రుణ భారం త‌గ్గించుకోవ‌డం ద్వారా: గృహ రుణ మంజూరు చేసే ముందు ద‌ర‌ఖాస్తుదారునికి ఉన్న ఇత‌ర రుణాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటాయి. ఆదాయం, రుణ నిష్పత్తిని పరిశీలిస్తాయి. నెల‌వారీ ఆదాయంలో 50 నుంచి 60 శాతం మొత్తాన్ని ఈఎమ్ఐ కోసం కేటాయించాల‌ని బ్యాంకులు భావిస్తాయి. ఎందుకంటే మిగిలిన మొత్తాన్ని ఇంటి అవ‌స‌రాలు, ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించాలి. లేదంటే భవిష్యత్‌లో రుణ భారం పెరిగిపోయే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ మీకు చిన్న చిన్న రుణాలు ఉంటే గృహ రుణం కోసం ద‌రఖాస్తు చేసే కంటే ముందే వాటిని క్లియ‌ర్ చేసేందుకు ప్రయత్నించండి. దీంతో మీ చెల్లింపుల సామ‌ర్థ్యంపై బ్యాంకులకు నమ్మకం పెరుగుతుంది. రుణం మంజూరయ్యే అవ‌కాశాలు పెరుగుతాయి. ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఆటంకం ఏర్పడదు.

చివ‌రిగా: గృహ రుణం అనేది దీర్ఘకాలిక రుణం. చెల్లింపుల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల రుణం కోసం బ్యాంకును ఎంచుకునే ముందు వివిధ సంస్థలు అందించే గృహ రుణ వ‌డ్డీ రేట్లను, ప్రాసెసింగ్‌ ఫీజులను పోల్చి చూడండి. డౌన్‌పేమెంట్ చెల్లింపుల కోసం అత్యవసర నిధిని వినియోగించడం మంచిది కాదు. ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించిన మొత్తాన్ని ఈఎమ్ఐ చెల్లింపుల కోసం వినియోగించకూడ‌దు. అందువ‌ల్ల రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందే గృహ రుణ కాలిక్యులేట‌ర్ల ద్వారా ఈఎమ్ఐ లెక్కించి, మీ చెల్లింపుల‌కు సామ‌ర్థ్యానికి అనుగుణంగా గృహ రుణం ఈఎమ్ఐ, కాల‌ప‌రిమితుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని