అధిక రాబడికి.. మదుపు ఇలా!

కొంతమంది మార్కెట్‌ పడిపోతుంటే మరిన్ని పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు....

Updated : 01 Jan 2021 18:52 IST

​​​​​​​పెట్టిన పెట్టుబడికి నష్టం ఉండకూడదు… మంచి రాబడి రావాలి… కష్టార్జితాన్ని మదుపు చేసేప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. మరి ఇది ఎలా సాధ్యం? పథకాలను ఎంచుకునేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ప్రయాణం ప్రారంభించేప్పుడు లక్ష్యం ఏమిటన్నది ముందే అనుకుంటాం. ఎంత వ్యవధిలో చేరుకుంటాం? ఏ వాహనం అయితే మంచిది? తదితర విషయాలన్నీ ఆలోచిస్తాం. ఇదే విషయాన్ని పెట్టుబడులకు కూడా అన్వయించవచ్చు. ఏ పథకంలో మదుపు చేయాలో నిర్ణయించుకునే ముందు మన లక్ష్యం ఏమిటి? దాన్ని సాధించడానికి ఉన్న వ్యవధి ఎంత? అన్నదే కీలకం. ఆ తర్వాతే ఎంత రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలన్నది సులువుగా అర్థమవుతుంది. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అదే సమయంలో వారి పెట్టుబడి మనస్తత్వం కూడా. కొంతమంది మార్కెట్‌ పడిపోతుంటే మరిన్ని పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో మీరు దూకుడుగా వ్యవహరిస్తారా? ఓపికతో ఉంటారా? దీర్ఘకాల మదుపరిగా మీకు మీరు అనుకుంటూ రోజువారీ లావాదేవీలు (ట్రేడింగ్‌) నిర్వహిస్తున్నారా? ఒకసారి సమీక్షించుకోవాలి. ఆ తర్వాతే మీ పెట్టుబడుల జాబితాలో వేటికి చోటివ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తక్కువ ఒడిదొడుకలతో అధిక రాబడులు అందించేలా ఉండేలా పెట్టుబడుల్లో సమతౌల్యం పాటించాలి.

కేటాయింపు ఎలా?

పెట్టుబడులు అంటేనే కొంత నష్టభయం ఉంటుంది. వీలైనంత వరకూ దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించడమే మనం చేయాల్సిన పని. దానికి అనుగుణంగా ఎంచుకునే పథకాల్లో సరైన మిశ్రమం ఉండాలి. అంటే, ఏ పథకంలో ఎంత శాతం మదుపు చేస్తే మనకు మేలు జరుగుతుందో అవగాహన ఉండాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే… ఈక్విటీ, డెట్‌, నగదు ఆధారిత పథకాలను ప్రాథమికంగా పరిశీలించాలి. ఆ తర్వాత మరింత మిగులు మొత్తం ఉంటే బంగారం, కమోడిటీస్‌, స్థిరాస్తి, ప్రైవేటు ఈక్విటీ తదితరాలను ఎంచుకోవచ్చు.

నష్టాన్ని తట్టుకోగలిగితేనే…

జీవితంలో ఏ దశలో ఉన్నవారైనా సరే… నష్టభయం లేకుండా రాబడిని ఆర్జించాల్సిందే. అయితే, లక్ష్య సాధనకు ఎంత రాబడిని ఆర్జించాలన్నదే ఇక్కడ చిక్కు ప్రశ్న. పెట్టుబడులు పరిస్థితులను బట్టి ఎప్పుటికప్పుడు మారుతూ ఉండాలి. ఉదాహరణకు పదేళ్ల లక్ష్యంతో మీరు మదుపు చేయాలనుకుంటున్నారు… ఈక్విటీల్లో 80శాతం, డెట్‌ పథకాల్లో 20శాతం పెట్టుబడులు పెట్టారు. మూడేళ్ల తర్వాత ఇది ఈక్విటీల్లో 60శాతం, డెట్‌లో 40శాతంగా ఉండాలి. ఇలా నిర్ణీత కాలానికి ఒకసారి మీ పెట్టుబడుల మిశ్రమం మారుతూ ఉండాలి.

కనీసం 12.9శాతం రాబడి వచ్చేలా మనం పెట్టుబడులు పెట్టాలనుకున్నాం అనుకుందాం. అప్పుడు ఈక్విటీ, డెట్‌ పథకాల్లో మన పెట్టుబడుల కేటాయింపు ఎలా ఉండాలో చూద్దాం! రూ.100 మదుపు చేయాలనుకున్నప్పుడు 70శాతం ఈక్విటీలకు, 30శాతాన్ని డెట్‌ పథకాలకు మళ్లించాలి. ఈక్విటీల్లో సగటు రాబడి 15శాతం అనుకుందాం. డెట్‌లో 8శాతం రాబడి వస్తుందని అంచనా. అంటే ఈక్విటీల్లో రూ.70 మదుపు చేస్తే ఏడాది తర్వాత రూ.80.50 అవుతాయి. డెట్‌లో రూ.30 మదుపు చేస్తే రూ.32.4 అవుతాయి. ఈ మొత్తాలు కలిపితే రూ.112.90 అవుతాయి. అంటే, 12.9శాతం రాబడిని ఆర్జించినట్లు.

వైవిధ్యమే ప్రాణం…

మదుపు చేసేప్పుడు ఒక పెట్టుబడి పథకానికి ఎంత శాతం కేటాయించాలన్న దాంతోనే వైవిధ్యం ప్రారంభం అవుతుంది. ఒక పథకంలోనూ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకున్నప్పుడు మరింత భిన్నత్వం సాధ్యమవుతుంది. ఈక్విటీల్లో 60శాతం పెట్టుబడి పెట్టాలనుకున్నారనుకుందాం. ఇందులో ఎన్ని ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవాలి? గ్రోత్‌, డివిడెండ్‌, వాల్యూ, మౌలిక వసతులు, ఇతర రంగాలకు చెందిన ఫండ్లు, లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, అంతర్జాతీయ ఫండ్లు ఇలా మరింత వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. వేర్వేరు చోట మదుపు చేయడం వల్ల ఒక చోట కాస్త రాబడి తక్కువగా వచ్చినా… మరో చోట అధిక రాబడి వచ్చి, అంతిమంగా మనం ఆశించిన రాబడి ఆర్జించేందుకు వీలౌతుంది.

సంఖ్యను పెంచుకోవద్దు:

నష్టశాతాన్ని తగ్గించుకునేందుకు వైవిధ్య పెట్టుబడులు మంచివే. అయితే, మరీ ఎక్కువగా ఉండటమూ మంచిది కాదు. పెట్టుబడుల జాబితాలో ఎన్ని ఎక్కువ షేర్లు, ఎక్కువ ఫండ్లు ఉంటే అంత ఉత్తమం అనుకోకూడదు. వీటిని నిర్వహించడం కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుంది. మీరు షేర్లు, ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని సేకరించడం లేదని అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చిన ప్రతి ఫండ్‌లోనూ మదుపు చేయాలనుకోవడం, ఈ ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం… ఎప్పుడూ బాగానే ఉంటుందని భావించడం ఇలా రకరకాల కారణాలతో చాలామంది తమ పెట్టుబడుల జాబితాలో ఫండ్ల సంఖ్యను పెంచుకుంటారు. ఇది ఎంత మాత్రం ఆచరణీయం కాదని గుర్తుంచుకోవాలి.

మార్పులతో ముందుకు:

ప్రతి విషయంలోనూ మార్పులు చేర్పులు అనివార్యం. పెట్టుబడులు కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. లక్ష్య సాధనకు అనుగుణంగా పెట్టుబడుల్లో అవసరమైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పథకాలు మంచి పనితీరుతో మనకు లాభాలు ఆర్జించి పెడుతూ ఉంటాయి. ఒకటి రెండు మనం అనుకున్న రీతిలో పనిచేయకపోవచ్చు. సమయానుకూలంగా సమీక్ష నిర్వహించినప్పుడు వేటిని వదిలేయాలన్నది నిర్ణయించుకోవాలి.

ఉదాహరణకు మీరు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టి, మంచి రాబడిని కళ్లచూశారు. ముందే నిర్ణయించుకున్న మీ పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగిస్తూ… కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో నుంచి డెట్‌ పథకాల్లోకి మళ్లించాలి. దీనివల్ల మీకు నష్టభయం తగ్గుతుంది. ఉదాహరణకు మీరు మొత్తం రూ.10,00,000 మదుపు చేయాలని అనుకున్నారు. ఈక్విటీ, డెట్‌ నిష్పత్తి 50:50 ఉండాలనుకున్నారు. అంటే, ఈక్విటీల్లో రూ.5,00,000; డెట్‌లో రూ.5,00,000 మదుపు చేశారు. ఆ ఏడాది ఈక్విటీల్లో దాదాపు 30శాతం రాబడి వచ్చిందనుకుందాం. అప్పుడు మీ పెట్టుబడి ఏడాదిలో రూ.6,50,000 అవుతుంది. డెట్‌లో 8శాతం రాబడి అంచనాతో ఏడాదిలో రూ.5,40,000 సమకూరుతాయి. అంటే మొత్తం పెట్టుబడి విలువ రూ. 11,90,000. ముందే అనుకున్నట్లు… 50:50గా మారిస్తే… ఈక్విటీల్లో రూ.5,95,000, డెట్‌లో రూ.5,95,000 ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీల్లో వచ్చిన లాభాలను స్వీకరించి, తక్కువ నష్టభయం ఉండే డెట్‌ పథకాలకు మళ్లించడం ఇక్కడ మనం గమనించవచ్చు.

  • మార్కెట్‌ పరిస్థితులు బాగాలేక, తక్కువ రాబడి అందించినా, దీర్ఘకాలిక లక్ష్యంతో మదుపు చేస్తాం కాబట్టి, డెట్‌ నుంచి ఈక్విటీకి కొంత మొత్తం మళ్లించి, నిష్పత్తిని కొనసాగించాలి.

  • మన లక్ష్యానికి సమీపిస్తున్న కొద్దీ… అంటే కనీసం మూడేళ్ల ముందు నుంచీ నష్టభయం అధికంగా ఉండే ఈక్విటీల్లో కొంత పెట్టుబడిని తగ్గిస్తూ రావాలి. అదే విధంగా నిర్ణీత శాతంలో క్రమానుగతంగా వెనక్కి తీసుకుంటూ డెట్‌ పథకాలకు మళ్లించాలి. దీనివల్ల మార్కెట్‌లో వచ్చే అనుకోని పతనాల నుంచి మనకు కొంత రక్షణ లభిస్తుంది. అనుకున్న తేదీ వరకూ ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంటే, తీరా మనం వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్‌ పరిస్థితి బాగాలేకపోతే లాభాల మాట పక్కనబెట్టి, నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది.

  • పెట్టుబడి పథకాల ఎంపిక, వాటిలో వైవిధ్యం, అవసరాన్ని బట్టి సమీక్షించుకుంటూ సమతౌల్యం చేసుకోవడం ద్వారానే మంచి ప్రతిఫలాల్ని సాధించగలం అని గుర్తుంచుకోవాలి. మంచి సమయం చూసి మదుపు చేస్తామనడం సరికాదు. ఏ సమయంలోనైనా మదుపును కొనసాగిస్తున్నామా లేదా అనేదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నష్టభయాన్ని తగ్గించుకుంటూ, అధిక రాబడిని ఆర్జిస్తూ ముందుకు సాగినప్పుడే ఆర్థిక ప్రశాంతత లభిస్తుంది.

నిధితో రక్ష:

చాలామంది చేసే పొరపాటేమిటో తెలుసా? ఏదైనా చిన్న అవసరం వచ్చినా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం. ఇలా చేయడం వల్ల మనం ఎప్పటికీ అనుకున్న సంపదను సృష్టించలేం. పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం ఇవ్వాలి. అందుకే, మదుపు చేసే ముందు కొంత అత్యవసర నిధిని చేతిలో ఉంచుకోవాలి. అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.

ఉద్యోగం కోల్పోవడం, అనుకోని వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు ఇలా అనేక విధాలుగా అవసరాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మన చేతిలో డబ్బు లేకపోతే, దీర్ఘకాలిక లక్ష్యంతో చేసే పొదుపు, మదుపు మొత్తాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులను అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. ఈ మొత్తాన్ని నగదు రూపంలో ఉంచుకోకూడదు.

సులభంగా నగదుగా మార్చుకునేందుకు వీలున్న చోట పెట్టాలి. బ్యాంకు ఫెక్లీ డిపాజిట్‌ ఖాతాలో, లిక్విడ్‌, షార్ట్‌ టర్మ్‌ ఫండ్లలో కొంత చొప్పున కేటాయించాలి. ఇవన్నీ కూడా బ్యాంకు పొదుపు ఖాతాకన్నా ఎక్కువ వడ్డీని ఇస్తాయి. కావాల్సినప్పుడు నగదుగా మార్చుకునేందుకు వీలూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు