Financial Planning: సంప‌ద సృష్టికి పెట్టుబ‌డులు ఎలా ఉండాలి?

ఏ ఒక్క పెట్టుబ‌డిపై ఆధార‌ప‌డ‌కుండా స‌రైన మ‌దుపుకు మిశ్ర‌మ పెట్టుబ‌డుల‌ను ఎన్నుకోండి.

Published : 13 Jul 2022 14:35 IST

ఆర్ధిక సంవ‌త్స‌రం మొద‌ల‌యి అప్పుడే 3 నెల‌లు దాటిపోయింది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో డ‌బ్బును మ‌దుపు చేయ‌డానికి పెట్టుబ‌డులు ఎక్క‌డ‌, ఎలా పెట్టాలి? మీ ఆర్ధిక ల‌క్ష్యాల అనుగుణంగా ఏ ఒక్క పెట్టుబ‌డిపై ఆధార‌ప‌డ‌కుండా స‌రైన మ‌దుపుకు మిశ్ర‌మ పెట్టుబ‌డుల‌ను ఎన్నుకోండి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో కొన‌సాగుతుండ‌టంతో  ఆ మార్కెట్లో పెట్టుబ‌డుల‌కు వేచి చూసే థోర‌ణి మంచిదే. ద్ర‌వ్యోల్బ‌ణం, స్టాక్ మార్కెట్ ఊగిస‌లాట‌, ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప‌రిస్థితులు ఇవ‌న్నీ కూడా పెట్టుబ‌డులు పెట్టేవారికి అడ్డు కాదు. మ‌దుపు చేసే ఆర్ధిక ప‌రిస్థితిని బ‌ట్టి పెట్టుబ‌డుల‌కు ఇంకా అనేక మార్గాలుంటాయి. 

కాబ‌ట్టి, మ‌దుపు చేయ‌గ‌ల డ‌బ్బును అంచెలంచెలుగా పెంచుకోవ‌డానికి ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో సానుకూల‌త‌తో, జాగ్ర‌త్త‌గా ఆర్ధిక ప్ర‌ణాళిక‌తో ప్రారంభిద్దాం.

ఆర్ధిక లక్ష్యాలు:
మీకు ఇల్లు కొన‌డం, మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, వివాహానికి నిధులు స‌మ‌కూర్చ‌డం లేదా మీ చేతిలో మంచి మూల నిధితో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డం వంటి కొన్ని ఆర్ధిక ల‌క్ష్యాలు ఉండ‌వ‌చ్చు. మీరు మీ ఆర్ధిక ల‌క్ష్యాల‌ను స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలికంగా మార్చ‌వ‌చ్చు. ఉదా: కారు కొన‌డం స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యం కావ‌చ్చు. అయితే, ఇల్లు కొన‌డం దీర్ఘ‌కాల ల‌క్ష్యం కావ‌చ్చు, ఎందుకంటే దీనికి ఎక్కువ నిధులు కావాలి. 

బీమా రక్ష‌ణ:
మీ పెట్టుబ‌డుల‌ను, మ‌దుపును కొన‌సాగించాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. దీనికి ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ త‌ప్ప‌క తీసుకోవాలి. కుటుంబంలో సంపాదించే వారు ఉండి త‌మ‌పై ఆధార‌ప‌డినవారు ఉంటే సంపాద‌న ప‌రుడికి త‌ప్ప‌క జీవిత బీమా ఉండాలి. సాంప్ర‌దాయ ఎండోమెంట్ పాల‌సీల కంటే కూడా ట‌ర్మ్ బీమాను అధిక మొత్తానికి తీసుకుంటే మంచిది. మీ ఆర్ధిక ల‌క్ష్యాల‌ను అనిశ్చితులు, న‌ష్టాల నుండి సుర‌క్షితంగా ఉంచ‌డానికి ఆరోగ్య బీమాని, జీవిత బీమాని కూడా ఒక ర‌క‌మైన పెట్టుబ‌డిగానే ప‌రిగ‌ణించాలి, ఖ‌ర్చుల కింద చూడ‌కూడ‌దు. మీ జీవిత బీమా ర‌క్ష‌ణ‌కు మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య బీమా కోసం అయితే  క‌నీసం మీ వార్షిక ఆదాయానికి స‌మాన‌మైన క‌వ‌రేజ్ ఉండాలి. మీ ఆదాయం, కుటుంబ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఎక్కువ ఆరోగ్య బీమా ఉన్నా కూడా మంచిదే.

ప‌న్ను ఆదా:
ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మీ ప‌న్ను భారాన్ని త‌గ్గించుకోవ‌డం మంచిది. పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ప‌న్ను ఆదా చేసే మ్యూచువ‌ల్ ఫండ్‌లు మొద‌లైన ప‌థ‌కాల‌లో మీ డ‌బ్బుని పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా ప‌న్ను ఆదా చేయోచ్చు. సెక్ష‌న్ 80సీ కింద అనుమ‌తించ‌బ‌డిన గ‌రిష్ట మిన‌హాయింపు ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో రూ. 1.50 ల‌క్ష‌లు. అయితే, పన్ను ఆదా మైత్రమే దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను ఎంచుకోకూడదు.

పెట్టుబ‌డి, సంప‌ద సృష్టి:
మీరు దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ కోసం చూస్తున్న‌ట్ల‌యితే, రిస్క్ చేయ‌డానికి మీ ప‌రిస్థితులు స‌హ‌క‌రిస్తే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో  క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల (SIP) ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మార్కెట్ అస్థిర‌త‌లో కూడా స‌గ‌టు లాభాల రాబ‌డికి మీకు ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడుల కోసం పీపీఎఫ్ లాంటి పధకాలు సరైనవి. స్వల్ప కాలం కోసం అయితే రికరింగ్ డిపాజిట్ లు పూర్తిగా సురక్షితం.

సాంప్ర‌దాయ పెట్టుబ‌డి ప‌థ‌కాలు:
పీపీఎఫ్ ఖాతా 7.10 శాతం, సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 7.40 శాతం వ‌డ్డీ నిస్తాయి. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు 5.50-6.70 శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తాయి. కిసాన్ వికాస్ ప‌త్ర‌లో 6.90% వ‌డ్డీ వ‌స్తుంది. బాలిక‌ల‌కు ప్ర‌త్యేక ప‌థ‌క‌మైన సుక‌న్య స‌మృద్ధి యోజ‌నలో వ‌డ్డీ అత్య‌ధికంగా 7.60 శాతం ఉంది. వీటి వ‌డ్డీ రాబ‌డికి, అస‌లుకి ప్ర‌భుత్వం హామి ఉంటుంది. రిస్క్ ఇష్టం లేనివారు మీ డ‌బ్బుని ఈ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే, ఈ వ‌డ్డీ రేట్ల‌లో ప్ర‌తి త్రైమాసికానికి మార్పులుండ‌వ‌చ్చు, లేదా సమీక్ష లో యధా విధిగా ఉంచవచ్చు.

అయితే, మీ ఆర్ధిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి మీ పెట్టుబ‌డుల‌ను ఒకే దానిలో కాకుండా మిశ్ర‌మ పధకాలను ఎంచుకోవడం మంచిది. పెట్టుబ‌డుల‌లో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించండి. అవసరం అయితే ఆర్ధిక స‌ల‌హాదారుని సంప్ర‌దించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని