Retirement life: ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ప్ర‌శాంత జీవ‌నం ఎలా..?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పొందిన మొత్తం ఇత‌ర ఖ‌ర్చుల కోసం ఉప‌యోగించుకునే థోర‌ణి మంచిదికాదు. 

Updated : 16 Jun 2022 14:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సాధార‌ణ జీవితాన్ని పొంద‌డం చాలా ముఖ్యం. మీరు జీవించి ఉన్నంత వ‌ర‌కు మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌డానికి క్ర‌మం త‌ప్ప‌కుండా ఆదాయ వ‌న‌రుని క‌లిగి ఉండాలి. పదవీ విరమణ నిధి ఎంత ఉండాలనేది మీ ప్ర‌స్తుత ఆదాయం, మీ జీవ‌న‌శైలి, మీపై ఆధార‌ప‌డేవారు మొద‌లైన వాటిపై ఆధార‌ప‌డి ఉంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగేకొద్దీ పెరిగిన నిత్యావ‌స‌రాల ధ‌ర‌లతో జీవ‌న శైలిని కొన‌సాగించాల్సి ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం త‌యారు చేసుకున్న బ‌డ్జెట్‌ని ఈ పెరిగిన ధ‌ర‌లు బాగా ప్ర‌భావితం చేస్తాయి.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేవారు గుర్తించ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన విష‌యాలు చాలానే ఉన్నాయి. గ‌తంలో క‌న్నా మ‌నిషి ఆయుర్దాయం ఇపుడు పెరిగింది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం స‌గ‌టున 70.19 సంవ‌త్స‌రాలకి మాన‌వుని ఆయుష్షు ఇపుడు పెరిగింది. ఇది స‌గ‌టు మాత్ర‌మే. ప్ర‌తి ఏడాది ఎంతోకొంత మనిషి ఆయుర్దాయం పెరుగుతూనే ఉంది. అందువల్ల వృద్ధులు ఇంకా ఎక్కువ కాలం బ‌తికే అవ‌కాశాలు ఉన్నాయి. దీర్ఘాయువు వ‌ల్ల ఖ‌ర్చులు ఉండే స‌మ‌యం కూడా పెరుగుతుంది. జీవ‌న‌శైలి కూడా ఖ‌ర్చుల‌ను ప్ర‌భావితం చేస్తుంది. ఈ ఖ‌ర్చుల‌ను త‌ట్టుకోవ‌డానికి ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి? ఎంత పెట్టుబ‌డి పెట్టాలి? అనేది తెలుసుకుందాం..

ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఆలోచ‌న చేస్తున్న‌ప్పుడు 3 ర‌కాల రిస్క్‌ల‌ను ప‌రిగ‌ణించాలి. దీర్ఘాయువు ఖ‌ర్చులు, జీవ‌న‌శైలి ఖ‌ర్చులు, అనారోగ్య‌ ప్ర‌మాదం. దీర్ఘాయువు అనేది చెప్పుకోవ‌డానికి బాగుంటుంది గానీ, మీరు మీ ద‌గ్గ‌రున్న నిధి కంటే ఎక్కువ కాలం జీవించ‌డం వ‌ల్ల అధిక జీవ‌న కాలానికి ఖ‌ర్చు పెట్టేంత నిధిని దాయాల్సి ఉంటుంది. ఈ నిధి గురించి మీరు వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి అనేక‌ ఆర్థిక ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయాల్సి ఉంటుంది.

జీవ‌న‌శైలి ఖ‌ర్చులు.. రోజువారీ జీవ‌న‌శైలి ఖ‌ర్చుల కోసం పొదుపుతో ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత మీరు మీ జీవ‌న‌శైలిలో రాజీ ప‌డ‌కూడ‌దు అనుకుంటారు కానీ, మీ ఉద్యోగ విర‌మ‌ణ జీవితంలో రోజువారీ ఖ‌ర్చులు ఇప్పుడు మీరు క‌లిగి ఉన్న వాటికి భిన్నంగా ఉండొచ్చు. మీ అవ‌స‌రాలు ఆకాంక్ష‌ల‌పై రాజీ ప‌డాల్సి ఉంటుంది.

అనారోగ్య‌ ప్ర‌మాదం.. వ‌య‌స్సు సంబంధిత అనారోగ్యాల కార‌ణంగా ఆసుప‌త్రిలో చేర‌డం వల్ల ఊహించ‌ని ఖ‌ర్చులు అవుతాయి. 60 ఏళ్ల వ‌య‌స్సులో అతి పెద్ద ఖ‌ర్చుల్లో అనారోగ్య‌మే కీల‌క‌మైన స‌మ‌స్య, ఖ‌ర్చు కూడా. ఇంకా భ‌విష్య‌త్తులో తీవ్ర‌మైన అనారోగ్యాల కార‌ణంగా బీమా క్లెయిమ్‌ల స‌మ‌స్యలు, ఆర్థికప‌ర‌మైన ఇబ్బందులు నివారించ‌డానికి మీరు భాగ‌స్వామితో పాటు 40 ఏళ్ల‌లోనే అధిక విలువ‌గ‌ల ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది దీన్ని ఎంచుకోరు. ఉద్యోగం చేసేట‌పుడు య‌జ‌మాని అందించిన హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆధార‌ప‌డ‌తారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌, వారికి బీమా ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. వ్య‌క్తి జీవించి ఉన్నంత‌కాలం నెల‌వారీ ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌డానికి సాధార‌ణ ఆదాయ వ‌న‌రును, ఆరోగ్య బీమా పాల‌సీలు క‌లిగి ఉండ‌టం ముఖ్యం.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పొందిన మొత్తం ఇత‌ర ఖ‌ర్చుల కోసం ఉప‌యోగించుకునే ధోర‌ణి మంచిదికాదు. కుటుంబ అవ‌స‌రాల‌తో, ముఖ్యంగా పిల్ల‌ల ఉన్నత విద్య‌, వివాహం వంటి పిల్ల‌ల అవ‌స‌రాల‌తో ముడిప‌డి ఉన్న భావోద్వేగాల కార‌ణంగా, చాలా మంది వ్య‌క్తులు త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఇత‌ర ల‌క్ష్యాల‌ కోసం ఖ‌ర్చుపెట్టేస్తుంటారు. అందువ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత సాధార‌ణ ఆదాయం లేన‌ప్పుడు, ఇటువంటి ప‌రిస్థితులు జీవితంలోని త‌ర్వాత ద‌శ‌ల‌లో చాలా ఆర్థిక, మాన‌సిక ఒత్తిడిని క‌లిగిస్తాయి.

అత్య‌వ‌స‌ర నిధిని నిర్మించ‌డం: సాధార‌ణ పొదుపు, పెట్టుబ‌డికి మించి ఒక‌రు ప‌ద‌వీ విర‌మ‌ణలో కూడా ఈ అత్య‌వ‌స‌ర నిధిని సృష్టించ‌డం కోసం కొంత మొత్తాన్ని విడిగా పెట్టుబ‌డి పెట్టాలి. ఇది క‌నీసం 12 నెల‌ల పాటు అన్ని ఖ‌ర్చుల‌కు స‌రిపోయేలా ఉండాలి.

జీవిత ల‌క్ష్యాల ఖ‌ర్చులు: మీరు పూర్తి స‌మ‌యం ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు విహార యాత్ర‌లు, పుణ్య క్షేత్రాల సంద‌ర్శ‌న‌, పుస్త‌క ప‌ఠ‌నం లాంటి మీ జీవిత ల‌క్ష్యాల పై స‌మ‌యాన్ని వెచ్చించి ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే మీరు ఉద్యోగ విర‌మ‌ణ‌ కోసం త‌గినంత ఆదా చేసి ఉండొచ్చు. మీరు జీవ‌న‌శైలిలో భాగంగా మీ జీవిత ల‌క్ష్యాల‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణించాలి. 

పార్ట్ టైమ్ ప‌ని, స్వ‌చ్ఛంద సేవ‌లు: ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత స‌మ‌యాన్ని చేయ‌గ‌లిగే ప‌నిని ఎంచుకుని ఉత్పాద‌కంగా మార్చుకోవ‌డం వ‌ల్ల ఆర్థికంగా కొంత సంపాద‌న‌కు అవ‌కాశ‌ముంటుంది. సామాజిక సంస్థ‌ల‌లో స్వ‌చ్చందంగా ప‌ని చేయొచ్చు. ప‌ని వ‌ల్ల మ‌న‌స్సు ఆరోగ్యంగా ఉంటుంది. అన‌వ‌స‌ర ఒత్తిడి ఉండ‌దు. కాబ‌ట్టి, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఒక‌రు త‌మ స‌మ‌యాన్ని ఎలా ఉత్త‌మంగా ఉప‌యోగించుకోవ‌చ్చో ఆలోచించాల‌ని నిపుణులు అంటున్నారు.

  • మీ ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ప్రాథ‌మిక ఆర్థిక ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌వ‌చ్చు. దీని గురించి మీకు అన్నివైపులా ఆర్థిక స‌ల‌హాలు ఇవ్వ‌గ‌లిగే ఆర్థిక స‌ల‌హాదారుడిని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. మీరు పెట్ట‌గ‌లిగే పెట్టుబ‌డులు, జీవ‌న‌శైలి ఎంపిక‌లు, ఆర్థిక అవ‌స‌రాలు అన్నింటిపై ఆర్థిక నిపుణుల స‌ల‌హాలు అవ‌స‌రం.
  • జీవితంలో ప‌ద‌వీ విర‌మ‌ణ అనేది సెకండ్ ఇన్నింగ్స్‌గా చెబుతారు. ఈ ద‌శ‌కు సంబంధించిన ఆర్థిక ప్ర‌ణాళిక‌ను జాగ్ర‌త్త‌గా నిర్వ‌హించిన‌ట్ల‌యితే జీవితంలో వెన‌క్కి తిరిగి చూసుకోకుండా ఎవ‌రైనా త‌గిన ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రు. ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం ప్ర‌శాంతంగా జీవించ‌గ‌ల‌రు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని