పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ఎక్కువ వడ్డీ పొందాలంటే..

 ప్రతి నెలా 5 వ తేదీ కంటే ముందే పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ఎక్కువ వ‌డ్డీ ఆదాయాన్ని పొంద‌చ్చు. 

Published : 21 Apr 2021 12:12 IST

భార‌త‌దేశంలో ప్ర‌భుత్వ హామీతో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) ఒక‌టి. ఈ ప‌థ‌కం వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వం త్రైమాసికంగా ప్ర‌క‌టిస్తుంది. అయితే వ‌డ్డీ మాత్రం నెల‌వారి ప్రాతిప‌దికన లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతాలో న‌గ‌దు జ‌మ చేసే వారికి 5వ తేది చాలా ముఖ్యం. పీపీఎఫ్ నిబంధ‌న‌ల ప్రకారం, ప్ర‌తీనెల 5 తేది నుంచి నెల చివ‌రి తేది వ‌ర‌కు ఉన్న క‌నీస మొత్తాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వ‌డ్డీ లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతాదారుడు ఒక నెల‌లో 1వ తేది నుంచి 5వ తేది లోపుగా న‌గ‌దు జ‌మ‌చేస్తే, అత‌డు/ఆమె ఆ నెల మొత్తానికి వ‌డ్డీ పొందేందుకు అర్హులు.  కాబ‌ట్టి ప్ర‌తీ నెల 1వ తేది నుంచి 5తేదిలోపుగా పీపీఎఫ్ మొత్తాన్ని జ‌మ చేయ‌డం ద్వారా రాబ‌డి పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు, మీరు నెల ప్రారంభంలో రూ.10 వేలు పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసార‌నుకుందాం. త‌ర్వాత 7 వ తేదీన మ‌రో రూ.5 వేలు దానికి జ‌త చేసినా, మీకు రూ.10 వేల‌కు మాత్రం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. రూ.15 వేల‌కు క‌లిపి వ‌డ్డీ రాదు. అందుకే ప్ర‌తి నెలా 5వ తేదీ కంటే ముందు పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేస్తే మంచిద‌ని ఆర్థిక నిపుణ‌లు సూచిస్తున్నారు. అయితే 5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. కాని ఇలాంటి చిన్న‌ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలంలో పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయ‌ని మ‌ర్చిపోవ‌ద్దు. మొద‌టి ఐదు రోజుల్లో జ‌మ చేస్తే మిగ‌తా 25 రోజుల‌కు వ‌డ్డీ వ‌ర్తిస్తుంది

చెక్ ద్వారా పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు జ‌మ చేసే వారు ఒక విష‌యం గుర్తించుకోవాలి. మీరు చెక్ డిపాజిట్ చేసిన రోజున ఖాతాకు జ‌మ కాదు కాబ‌ట్టి, డిపాజిట్ రోజును లెక్క‌లోకి తీసుకోరు. ఖాతాదారుడు డిపాజిట్ చేసిన చెక్ ఏ రోజు అయితే క్లియ‌రయ్యి ఖాతాలో డ‌బ్బు జ‌మౌతుందో అదే రోజును ప‌రిగ‌ణలోకి తీసుకుంటారు. కాబ‌ట్టి, వ‌డ్డీ ప్ర‌యోజ‌నం పొంద‌గోరే వారు 5వ‌తేది కంటే ముందుగానే చెక్ క్లియ‌ర్ అయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం ద్వారా నిర్ధిష్ట నెలకు వ‌డ్డీ ఆదాయాన్ని కోల్పోకుండా చూసుకోవ‌చ్చు. 

ఏప్రిల్ 2016 నుంచి పీపీఎఫ్‌తో పాటు ఇత‌ర చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌కు త్రైమాసిక ప్ర‌తిప‌దిక‌న వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తుంది. తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం పీపీఎఫ్ చందాదారులకు ఏప్రిల్- జూన్ 2021 త్రైమాసికానికి 7.1శాతం వ‌డ్డీ రేటును ప్ర‌క‌టించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని