SBI FD: పన్ను ఆదా ఎఫ్‌డీ ఖాతా.. ఆన్‌లైన్‌లో తెరిచేదెలా?

ఎస్‌బీఐ ఖాతాదారులు పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌లో కూడా తెరవచ్చు.

Updated : 18 Nov 2022 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడని, పన్ను మినహాయింపు కోరుకునే పెట్టుబడిదారులకు ఉన్న అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.. పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. రాబడి హామీ ఉండడంతో పాటు పన్ను భారం తగ్గించుకునేందుకు ఒక అవకాశంగా వీటిని చూస్తుంటారు. కాబట్టి, వీటికి ఆదరణ ఎక్కువ. ప్రస్తుతం పన్ను ఆదా ఎఫ్‌డీలు దాదాపు అన్ని బ్యాంకులూ అందిస్తున్నాయి. అన్ని బ్యాంకుల మాదిరిగానే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా పన్ను ఆదా ఎఫ్‌డీను అందిస్తోంది. ప్రస్తుతం ఎస్‌బీఐ పన్ను ఆదా ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 6.10%, సీనియర్‌ సిటిజన్లకు 6.90% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ ఖాతాను ఆన్‌లైన్‌లో కూడా తెరవొచ్చు. అదెలాగో చూద్దాం..

ఆన్‌లైన్‌లో తెరిచే విధానం..

  • ముందుగా ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌కు లాగిన్‌ అవ్వాలి. 
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ట్యాబ్‌ కింద అందుబాటులో ఉండే ‘e-TDR/eSTDR FD’ పై క్లిక్‌ చేయాలి. 
  • ఆ తర్వాత ఆదాయపు పన్ను సేవింగ్స్‌ స్కీం కింద  ‘e-TDR / eSTDR’ ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు డిపాజిట్‌ చేసే మొత్తాన్ని ఎంచుకుని, నిబంధనలు, షరతులను అంగీకరించి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. 
  • ఆ తర్వాత ‘కన్ఫర్మ్‌’ పై క్లిక్‌ చేస్తే, మీ పన్ను ఆదా ఎఫ్‌డీకి సంబంధించి అన్ని వివరాలు చూడొచ్చు.

పన్ను..

ఒక ఆర్థిక సంవత్సరం పెట్టుబడిపై సెక్షన్‌ 80సి కింద గరిష్ఠగా వర్తించే రూ.1.50 లక్షల పరిధి మేరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, అసలు మొత్తంపై ఆర్జించే వడ్డీపై మాత్రం పన్ను వర్తిస్తుంది. వడ్డీ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుని ఆదాయానికి చేర్చి.. వర్తించే స్లాబు ప్రకారం పన్ను విధిస్తారు. 

మీకు అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం రూ. 40 వేలకు మించితే బ్యాంకులే టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను)ను మినహాయించి మిగిలిన డబ్బును ఖాతాలో జమచేస్తాయి. సాధారణంగా ఎఫ్‌డీలపై 10% టీడీఎస్‌ వర్తిస్తుంది. పాన్‌ నంబరు ఖాతాతో అనుసంధానించకపోతే 20% టీడీఎస్‌ వర్తిస్తుంది. ఒకవేళ డిపాజిట్‌దారుని వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రానట్లయితే టీడీఎస్‌ నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. ఇందుకోసం బ్యాంకులకు ఫారం 15జీ/15హెచ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ. 50 వేలు మించితే టీడీఎస్‌ వర్తిస్తుంది.

ముందస్తు విత్‌డ్రాలు, లోన్‌..

పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 5 సంవత్సరాల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. ముందుస్తు విత్‌డ్రాలను అనుమతించరు. అలాగే రుణ సదుపాయం కూడా ఉండదు. ఒకవేళ డిపాజిట్‌దారుడు మరణిస్తే, నామినీ/చట్టపరమైన వారసులు మెచ్యూరిటీకి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని