ONDC food delivery: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ONDC.. తక్కువకే ఫుడ్‌ ఆర్డర్‌!

ONDC vs Food delivery apps: ఫుడ్‌ డెలివరీ యాప్స్‌నకు ఓఎన్‌డీసీ రూపంలో కొత్త సవాల్‌ ఎదురవుతోంది. ప్రభుత్వానికి చెందిన ఈ వేదికపై ఇప్పటికే 10 వేల రోజువారీ ఫుడ్‌ ఆర్డర్స్‌ జరుగుతున్నాయి.

Updated : 08 May 2023 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా ఫుడ్‌ డెలివరీ (Food delivery) విభాగంలో స్విగ్గీ, జొమాటో మధ్య పోటీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో వేరే కంపెనీలు వచ్చినా ఈ రెండింటిదే హవా. తమదైన ఆఫర్లతో ఈ రెండు కంపెనీలు అంతగా యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అలాంటి ఈ కంపెనీలకు ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC) వేదిక సవాలు విసురుతోంది. ఈ ప్రభుత్వ ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో తక్కువ ధరకే ఫుడ్‌ లభిస్తోందంటూ పలువురు యూజర్లు స్క్రీన్‌ షాట్లు తీసి పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. ఈ క్రమంలోనే ఆహార విభాగంలో రోజువారీ డెలివరీల సంఖ్య 10వేల మైలురాయిని సైతం అందుకుంది.
Also Read: ప్రభుత్వ ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ వచ్చేస్తోంది!

ఇ-కామర్స్‌ విభాగంలో గుత్తాధిపత్యానికి చెక్‌పెడుతూ ఓఎన్‌డీసీని ప్రభుత్వం లాంచ్‌ చేసింది. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ వేదికగా ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. వినియోగదారులు సైతం కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ సహా 240కి పైగా నగరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగానే ఆహార విభాగంలోకి ప్రవేశించింది. సోషల్‌మీడియా కారణంగా గత కొన్ని రోజులుగా విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుంటోంది. సాధారణంగా రెస్టారెంట్లకు, హోటళ్లకు నేరుగా వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఆహార పదార్థాల ధరలకు, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో ఉండే ధరలకు వ్యత్యాసం ఉంటుంది. దీనికి డెలివరీ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు యూజర్లు స్విగ్గీ, జొమాటోలో లభించే ఆహారానికి, ఓఎన్‌డీసీ వేదికగా లభించే ఆహార పదార్థాల ధరలతో పోలుస్తూ స్క్రీన్‌షాట్లు పోస్ట్‌ చేస్తున్నారు.
Also Read: ONDC: ప్రభుత్వ ఇ-కామర్స్‌ వేదికపైకి మీషో

ఎలా ఆర్డర్‌ చేసుకోవచ్చు..?

స్విగ్గీ, జొమాటో తరహాలో ఓఎన్‌డీసీకి ప్రత్యేకంగా యాప్‌ అంటూ ఏదీ లేదు. మనకు ఏదైనా కావాలంటే బయ్యర్‌ యాప్స్‌లోకి వెళ్లి కొనుగోలు చేయాలి. పేటీఎం, మైస్టోర్‌, పిన్‌కోడ్‌, స్పైస్‌ మనీ వంటి యాప్స్‌ ప్రస్తుతం బయ్యర్‌ యాప్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు పేటీఎంను తీసుకుంటే.. పేటీఎం యాప్‌లోకి వెళ్లి ONDC అని సెర్చ్‌ చేసి.. ఆహార విభాగంలో మీకు నచ్చిన ఆహరాన్ని ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. అయితే, ఓఎన్‌డీసీ కొత్తది కావడం వల్ల అన్ని రెస్టారెంట్లు, అన్ని పిన్‌కోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో ఈ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని