LIC premium: ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించండిలా..!

LIC premium online Payment: ఆన్‌లైన్‌ ద్వారా ప్రీమియం చెల్లించాలనుకునేవారికి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ లేదా ఎల్‌ఐసీ యాప్‌ రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Updated : 11 Apr 2023 13:23 IST

LIC premium online Payment | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో అత్యంత విశ్వసనీయత గల బీమా సంస్థల్లో ఎల్‌ఐసీ (LIC) ముందుంటుంది. దీనికి దాదాపు 25 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వీళ్లందరికీ మెరుగైన సేవలను అందించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త పరిష్కారాలను అన్వేషిస్తుంది. ప్రీమియం చెల్లింపులను మరింత సులభతరం చేయడం కోసం ఆన్‌లైన్‌ సేవలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ప్రీమియం (LIC premium online Payment) చెల్లించేయొచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా ప్రీమియం చెల్లించాలనుకునేవారికి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ లేదా ఎల్‌ఐసీ యాప్‌ రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా వెబ్‌సైట్‌ ద్వారా ఎలా చేయాలో చూద్దాం..

www.licindia.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘పే ప్రీమియం ఆన్‌లైన్‌’పై క్లిక్‌ చేయాలి. వెంటనే కింద a) పే డైరెక్ట్‌ (లాగిన్‌ కాకుండానే) b) ‘త్రూ కస్టమర్‌ పోర్టల్‌’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

పే డైరెక్ట్‌ (లాగిన్‌ కాకుండానే)

  • ఎల్‌ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ కాకుండానే ప్రీమియం చెల్లించాలనుకునేవారి కోసం ఈ ఆప్షన్‌ను ఇస్తున్నారు. దీంట్లో అడ్వాన్స్‌ ప్రీమియం పేమెంట్‌, లోన్‌ రీపేమెంట్‌, లోన్‌ ఇంట్రెస్ట్‌ రీపేమెంట్‌ అనే మూడు ఐచ్ఛికాలు కనిపిస్తాయి.
  • ‘అడ్వాన్స్‌ ప్రీమియం పేమెంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ప్రీమియం చెల్లింపు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు పాప్‌-అప్‌ మెనూ రూపంలో మీ ముందుంటాయి. దీనికి మన సమ్మతి తెలిపి ‘ప్రొసీడ్‌’పై క్లిక్‌ చేయాలి.
  • పాలసీ నెంబర్‌, ప్రీమియం మొత్తం.. సహా అక్కడ అడిగే వివరాలన్నీ ఎంటర్‌ చేయాలి. ఎలాంటి తప్పులు లేకుండా సమయం ముగియక ముందే చెల్లింపులు చేసేయాలి. లేదంటే పేజీ టైమవుట్‌ చూపిస్తుంది. అప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
  • తర్వాత ‘ఐ అగ్రీ’పై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. ఎల్‌ఐసీ నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్‌ ప్రీమియం చెల్లింపులు పాలసీదారులే స్వయంగా చేయాలి. థర్డ్‌పార్టీ చెల్లింపులకు అనుమతి ఉండదు.
  • సబ్మిక్‌ చేసిన తర్వాత మీ పాలసీ వివరాలన్నీ మీ ముందుంటాయి. ‘చెక్‌ అండ్‌ పే’పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాతి స్టెప్‌లో మీకు అనువైన పేమెంట్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

త్రూ కస్టమర్‌ పోర్టల్‌

ఎల్‌ఐసీ పోర్టల్‌లో రిజిస్టరై నేరుగా మీ ఖాతా ద్వారానే చెల్లింపులు కూడా చేయొచ్చు. ఒకవేళ రిజిస్టర్‌ కాకపోతే ‘సైనప్‌’పై క్లిక్‌ చేసి పాలసీ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి ప్రీమియం చెల్లించొచ్చు.

  • సరైన వివరాలు ఎంటర్‌ చేసి మీ ఖాతాలోకి లాగిన్‌ కావాలి.
  • లాగిన్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్స్‌పై క్లిక్‌ చేయాలి. అది మిమ్మల్ని ప్రీమియం పేమెంట్‌ పోర్టల్‌లోకి తీసుకెళ్తుంది.
  • ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలను ఎంపిక చేసుకొని ‘చెక్‌ అండ్‌ పే’పై క్లిక్‌ చేయాలి.
  • మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, ప్రీమియం మొత్తం వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకొని మళ్లీ ‘చెక్‌ అండ్‌ పే’పై క్లిక్‌ చేయాలి.
  • క్రెడిట్‌ కార్డ్‌, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డ్‌, యూపీఐ వంటి పేమెంట్‌ గేట్‌వేలలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకొని చెల్లింపులు చేయొచ్చు.

యాప్‌ ద్వారా ఇలా..

ఇక యాప్‌స్టోర్‌లోకి వెళ్లి ఎల్‌ఐసీ కస్టమర్‌, ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌, మై ఎల్‌ఐసీ అనే యాప్‌ల ద్వారా కూడా ప్రీమియం చెల్లించొచ్చు. ఎల్‌ఐసీ కస్టమర్‌ యాప్‌లో వెబ్‌సైట్‌ తరహాలోనే పే డైరెక్ట్‌, త్రూ కస్టమర్‌ ఆప్షన్లు ఉంటాయి. రెండింట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని పైన తెలిపిన విధంగానే చెల్లింపును పూర్తి చేయొచ్చు. ఎల్‌ఐసీ పే డైరెక్ట్ యాప్‌లో అయితే వెబ్‌సైట్‌లో పే డైరెక్ట్‌ తరహాలోనే రిజిస్టర్‌ కాకుండానే ప్రీమియం చెల్లించొచ్చు. ఇక మై ఎల్‌ఐసీ యాప్‌.. పైన తెలిపిన రెండు యాప్‌లకు రీడైరెక్ట్‌ చేస్తుంది.

ఆటోమేటిక్‌ చెల్లింపులు..

పాలసీదారులు ఎల్‌ఐసీకి ‘ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ సర్వీస్‌ (ECS)’ ద్వారా నేరుగా ప్రీమియం తీసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. దీనివల్ల మీ ప్రమేయం లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతా నుంచి నిర్దిష్ట తేదీ రోజు ప్రీమియం కట్‌ అవుతుంది. ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి క్యాన్సిల్‌ చేసిన చెక్‌, పాలసీ వివరాలను అందజేసి ఈసీఎస్‌ ద్వారా చెల్లింపులకు అంగీకారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  • సరైన, మనుగడలో ఉన్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ ఇవ్వాలి.
  • ప్రీమియం చెల్లించినట్లు రశీదు మీ మెయిల్‌కు వస్తుంది
  • పాలసీదారుడు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా ప్రీమియం చెల్లించాలి. థర్డ్‌ పార్టీలు చేయడానికి అనుమతి లేదు.
  • ప్రీమియం మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి కట్‌ అయినప్పటికీ.. మీకు ఎర్రర్‌ పేజీ వస్తే.. మూడు రోజుల వరకు వేచి చూడాలి. అప్పటి వరకు మీ మెయిల్‌కు రశీదు వస్తుంది. ఒకవేళ రాకపోతే bo_eps1@licindia.comలోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. లేదా ఎల్‌ఐసీ శాఖకు వెళ్లి కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చు.
  • ప్రీమియం చెల్లించినట్లు మీకు ధ్రువీకరణ రాకపోతే.. ముందు మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కట్‌ అయితే మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. మూడు రోజుల్లోగా రశీదు వస్తుంది.
  • దేశీయ బ్యాంకులు జారీ చేసిన కార్డుల ద్వారా మాత్రమే ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ బ్యాంకు కార్డుల ద్వారా కుదరదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని