Savings Account: పొదుపు ఖాతా ఓపెన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

పొదుపు ఖాతా తెరిచేందుకు వ‌డ్డీ ఒక్క‌టే ప్రామాణికం కాదు. బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌ల‌ను చూడాలి. 

Updated : 25 May 2022 16:36 IST

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌తో ప‌రిచ‌యం సాధార‌ణంగా పొదుపు ఖాతాతోనే ప్రారంభ‌మ‌వుతుంది. ఖాతాలో జ‌మ చేసిన‌ మొత్తంపై వ‌డ్డీ అందిస్తూ.. పొదుపు అలవాటును ప్రోత్స‌హిస్తుంది. ప్ర‌స్తుతం వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఒక‌టి కంటే ఎక్కువ పొదుపు ఖాతాల‌ను నిర్వ‌హిస్తున్నారు. డిజిట‌ల్ చెల్లింపుల ట్రెండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌క్కువ నిర్వ‌హ‌ణ‌తో మెరుగైన ఫీచ‌ర్ల‌ను అందించే పొదుపు ఖాతాను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి, పొదుపు ఖాతా తెరిచే వారికి ఈ కింది విష‌యాల గురించి అవ‌గాహ‌న ఉండాలి. 

వ‌డ్డీ రేట్లు..
పొదుపు ఖాతాను తెరిచే స‌మ‌యంలో చాలా మంది చూసేది వ‌డ్డీరేటు. అన్ని బ్యాంకులు ఒకేర‌క‌మైన వ‌డ్డీ రేటును అందించ‌వు. చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ బ్యాంకులు ప్ర‌స్తుతం 2.5 శాతం నుంచి 3.5 శాతం వర‌కు వ‌డ్డీ అందిస్తుండ‌గా, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు గరిష్టంగా 6.25 శాతం వ‌ర‌కు, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు గరిష్టంగా 7 శాతం వ‌ర‌కు కూడా వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి. అందువ‌ల్ల ఖాతా తెరిచే ముందు బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్ల‌ను పోల్చి చూడ‌వ‌చ్చు. ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. పొదుపు ఖాతా తెరిచేందుకు వ‌డ్డీ ఒక్క‌టే ప్రామాణికం కాదు, బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌ల‌ను చూడాలి. 

క‌నీస నిల్వ‌..
కొన్ని పొదుపు ఖాతాల‌కు కనీస బ్యాలెన్స్‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా 'శాలరీ' (వేతన) ఖాతాలకు కనీస నిల్వ నిబంధన ఉండదు. ఇతర బ్యాంకుల్లో కొన్ని రుసుములు తప్పించుకునేందుకు కనీస నిల్వ‌ తప్పనిసరి. కొన్ని బ్యాంకులు నెలవారీ సగటు నిల్వను లెక్కిస్తే.. మ‌రికొన్ని బ్యాంకులు త్రైమాసిక నిల్వను పరిగణిస్తాయి. ఒక‌వేళ నిర్వ‌హించ‌డంలో విఫ‌లం అయితే పెనాల్టీలు వ‌ర్తిస్తాయి. అలాగే, బ్యాంకులు ఇచ్చే బీమా క‌వ‌రేజ్‌, ప్రీఅప్రూడ్ రుణ ఆఫ‌ర్లు, ఆన్‌లైన్ డిడి జ‌న‌రేష‌న్‌, ఉచిత చెక్‌బుక్ వంటి సేవ‌లు కూడా నిలిపి వేయ‌వ‌చ్చు. 

కొన్ని ప్రీమియం ఖాతాల‌కు రూ. 50 వేల నుంచి రూ. 1 ల‌క్ష వ‌ర‌కు కూడా స‌గ‌టు నిల్వ నిబంధ‌న‌ ఉండ‌చ్చు. ఇలాంటి ఖాతాలు అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌తో వ‌స్తాయి. అలాగే, పీఎమ్ జ‌న్ ధ‌న్ యోజ‌న, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ వంటి ఖాతాలు 'జిరో' స‌గ‌టు నిల్వ‌తోనే వ‌స్తాయి. అయితే, ఈ ఖాతాల‌ సేవ‌లు కూడా ప‌రిమితంగానే ఉంటాయి. పొదుపు ఖాతాను ప్రారంభించే సమయంలో కనీస నిల్వ ఎంత అన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఇత‌ర‌ రుసుములు..
పొదుపు ఖాతా తెరిచే వారు వ‌డ్డీ రేట్ల‌ను మాత్ర‌మే కాదు, ఇత‌ర రుసుమ‌ల‌ను కూడా చూడాలి. వార్షిక నిర్వ‌హ‌ణ రుసుములు, చెక్ బుక్, ఆన్‌లైన్‌ నగదు బదిలీ, ఏటీఎం కార్డు, చెక్ బౌన్స్‌ ఛార్జీలు, బ్యాంకు స్టేట్‌మెంట్‌ రుసుములు, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ రుసుములు, క‌నీస నెల‌వారి స‌గ‌టు నిర్వ‌హించ‌కుంటే వ‌ర్తించే చార్జీలు, ఏటీఎమ్ వ‌ద్ద ఉచిత లావాదేవీలు మించితే వ‌ర్తించే ఛార్జీల గురించి తెలుసుకోవాలి. డెబిట్‌ కార్డును విదేశాల్లో వాడినప్పుడు కరెన్సీ కన్వర్షన్‌ ఫీజునూ బ్యాంకులు వసూలు చేస్తాయి. వీటి గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి. 

డిజిట‌ల్ సేవ‌లు..
చాలా వ‌ర‌కు బ్యాంకింగ్ లావాదేవీలు ఇప్పుడు బ్యాంకుకు వెళ్ల‌కుండా ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవ‌చ్చు. అందువ‌ల్ల మీరు ఎంచుకున్న బ్యాంకు నెట్ బ్యాంకింగ్‌ స‌ర్వీసులను అందిస్తున్న‌ది లేనిది సరి చూసుకోండి. ఖాతా బ్యాలెన్స్ త‌నిఖీ, నిధుల బ‌దిలీ, ఫిక్స్‌డ్ డిపాజిట్‌, పీపీఎఫ్ ఖాతాల‌ను ఆన్‌లైన్ ద్వారా తెర‌వ‌డం వంటి క‌నీస స‌దుపాయాల‌ గురించి ఆరాతీయండి. డిజిట‌ల్ సేవ‌ల‌కు ఎక్కువ‌ అంత‌రాయం క‌లగకుండా సురక్షితంగా అందిస్తున్న డిజిట‌ల్ బ్యాంకింగ్‌ను ఎంచుకోవ‌డం మంచిది. 

అద‌న‌పు ఆఫ‌ర్లు..
సాధారణంగా, పొద‌పు ఖాతాను తెరిచేటప్పుడు చాలా బ్యాంకులు జాయినింగ్ కిట్‌లో భాగంగా డిస్కౌంట్లు, రాయితీలు, ఇత‌ర సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తాయి. చెక్ బుక్, సప్లిమెంటరీ(అదనపు) కార్డ్‌లు, సినిమా టికెట్లు, స్వైపింగ్ కార్డ్‌లు, ఎయిర్‌పోర్ట్‌, రైల్వే లాంజ్ సౌకర్యం, త‌క్కువ‌/నో కాస్ట్ ఈఎమ్ఐతో ఆన్‌లైన్ కొనుగోళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్ కాంప్లిమెంట‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, వినియోగ వ‌స్తువుల కొనుగోళ్లు, బిల్ చెల్లింపుల‌పై క్యాష్‌బ్యాక్‌, వంటివి అందిస్తుంటాయి. బ్యాంకులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లతో టై-అప్‌లు చేసుకుని ఈ సేవలను అందిస్తుంటాయి. త‌ర‌చుగా ఈ సేవ‌ల‌ను వినియోగించుకునే వారికి డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డు పాయింట్లు ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటాయి. 

చివ‌రిగా..
బ్యాంకులు విధించే రుసుముల గురించి ఖాతాదారుల‌కు ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది. ఖాతా తెరిచిన‌ప్పుడు బ్యాంకు వ‌ద్ద మీ మొబైల్ నెంబ‌రును రిజిస్టర్ చేస్తే, ఖాతా లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారంతో పాటు ఇత‌ర వివ‌రాల‌ను మీ మొబైల్‌ లో తెలుసుకోవచ్చు. ఒక‌వేళ మీ ఫోన్‌కి స‌మాచారం రాక‌పోయినా, బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో వీటి గురించి పూర్తి స‌మాచారం అందుబాటులో ఉంటుంది. మీకు సంబంధం లేని రుసుములు విధించినట్లు మీరు గుర్తిస్తే.. వెంటనే ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవ‌చ్చు. రుసుముల రూపంలో అద‌నపు మొత్తాన్ని డిడ‌క్ట్ చేస్తే.. బ్యాంకుకు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. బ్యాంకు ఫిర్యాదును ప‌రిశీలించి..బ్యాంకు ఖాత‌ను వెరిఫై చేసిన పిమ్మ‌ట అద‌న‌పు మొత్తాన్ని తిరిగి ఖాతాలో డిపాజిట్ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని