Foreign education | పిల్లల విదేశీ చదువులకు తల్లిదండ్రులు ఎలా సిద్ధం కావాలి..?

త‌ల్లిదండ్రులు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను ప్రారంభించ‌డం చాలా ముఖ్య‌మ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Updated : 12 Feb 2022 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌ల్లిదండ్రులు త‌మ కెరీర్ క‌న్నా త‌మ పిల్లల చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ పిల్లలకు అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విదేశాల్లో సైతం తమ పిల్లలను చదివించేందుకు వెనుకాడడం లేదు. అయితే, విదేశాల్లో చదువులంటే ఆషామాషీ విషయం కాదు. అందుకు భారీగానే ఖర్చవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా 10% క‌న్నా ఎక్కువే పెరుగుతోంది. కాబట్టి మరి వారి చదువులు విదేశాల్లో సాగాలంటే మనం ఎలా సన్నద్ధమవ్వాలి..?

మామూలు సంప్రదాయ పొదుపు పథకాల్లో మదుపు చేస్తే విదేశీ విద్యకు సరిపడా మొత్తాలను చేకూర్చడం చాలా కష్టమైన పనే. అందుచేత వారి ద‌గ్గర ఉన్న పెట్టుబ‌డుల‌ను వివిధ స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, బాండ్‌లు, విభిన్నమైన పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబ‌డి పెడితే గ‌రిష్ఠ ఆర్థిక ప్రయోజనాలుంటాయి. క్రమం తప్పకుండా క్రమ శిక్షణతో పొదుపు చేయ‌డం వ‌ల్ల ఫండ్ వృద్ధి చెంది, భ‌విష్యత్‌లో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని గమనించండి.

మీరు మీ పిల్లల చదువు కోసం ఆదా చేసేందుకు మీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారిని అంత‌ర్జాతీయ పోటీ ప‌రీక్షలకు సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ఆ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత, గ్రూప్‌ డిస్కషన్స్‌, ఆన్‌లైన్‌ ఇంట‌ర్య్యూల‌తో స‌హా వివిధ అర్హత రౌండ్లు దాటితే విద్యార్థులకు అనేక స్కాల‌ర్‌షిప్‌లు అందుతాయి. ఇటువంటి అంత‌ర్జాతీయ ఎడ్యుకేష‌న్ స్కాల‌ర్‌షిప్‌లు విద్యార్థి ఆర్థిక మనుగడకు, విదేశీ విద్యకు ఉత్పేరకంలాగా పనిచేస్తాయి. ఈ ప‌రీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థికి తెలివితేటలు ఎంతో అవసరం. ఈ ప‌రీక్షలకు సంబంధించిన సమస్త సమాచారం ఇంటర్నెట్‌లో లభిస్తుంది.

మ‌న పొదుపుతోనే విదేశీ విద్యా ఖ‌ర్చులు స‌రిపోక‌పోవ‌చ్చు. విద్యా రుణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డానికి వెనుకాడ‌కూడ‌దు. మొత్తం పొదుపును ఒకేసారి ఖ‌ర్చు చేయ‌డం కంటే బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకోవ‌డం ప్రయోజనకరంగా ఉంటుంది. రూ. 7.50 ల‌క్షల నుంచి రూ.1.50 కోట్ల వ‌ర‌కు విద్యా రుణాన్ని విద్యార్థులు బ్యాంకుల ద్వారా పొందే వీలుంది. విద్యార్థినులకు 0.50% వ‌డ్డీ రాయితీ కూడా ల‌భిస్తుంది. విద్యా రుణం పొంద‌డం వ‌ల్ల ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 80 (ఈ) కింద మీరు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. పైగా విద్యా రుణాలు తక్కువ వడ్డీకే లభిస్తున్నాయి. సాధార‌ణంగా మీ కోర్సు పూర్తి చేసి, ప‌ని చేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత రుణ చెల్లింపు ప్రారంభ‌మ‌వుతుంది. ఉద్యోగంలో చేరినా రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి 6 నెల‌లు, ఒక ఏడాది మార‌టోరియం (గ‌డువు) కూడా పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని