Loan Apps: ఫేక్ రుణ యాప్‌ల‌ను గుర్తించడం ఎలా..?

రుణం కోసం డిజిట‌ల్ ప్లాట్ ఫారంల‌ను ఆశ్ర‌యించేవారు ఆర్‌బీఐ ధృవీక‌రించిన యాప్‌లకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వాలి

Updated : 21 Jul 2022 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవ‌లి కాలంలో డిజిట‌ల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జ‌రుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న డిజిట‌ల్ లావాదేవీల‌లో 40 శాతం భార‌త్‌లోనే జ‌రుగుతున్నాయ‌ని.. ఇది ప‌రిశ్ర‌మ వృద్ధిని, దాని స‌మ‌గ్ర‌తను తెలియ‌జేస్తుంద‌ని ఇటీవ‌ల భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఒక ప్ర‌సంగంలో తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఫిన్‌టెక్ సంస్థ‌ల‌ను ప్ర‌శంసించారు. అయితే, డిజిట‌ల్ ప్లాట్ ఫారంల ద్వారా లావాదేవీలు పెరిగిన‌ట్లుగానే మోసాలూ పెరిగాయి. ఈ మ‌ధ్య కాలంలో ఫేక్ రుణ యాప్‌లు ఎక్కువైపోయాయి. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా తీసుకుని క్ష‌ణాల్లో రుణాలు అందిస్తూనే ఎక్కువ వ‌డ్డీ వ‌సూలు చేస్తున్నాయి. రుణాలు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన వారిపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాయి. ఇలాంటి మోస‌పూరిత రుణ యాప్‌ల‌కు దూరంగా ఉండాలి.  మరి వీటిని గుర్తించడమెలా...?

యాప్ పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇచ్చిన నివేదిక ప్రకారం... 600 పైగా చట్టవిరుద్ధ రుణ యాప్‌లు వివిధ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల రుణం కోసం ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్ పేరు, దాని రేటింగ్, యాప్ స్టోర్లో సమీక్షలు, ఇతర వివరాలను ధ్రువీకరించుకోవాలి. నకిలీ యాప్‌లు నిర్వహిస్తున్న వారు తమ చిరునామాను తప్పుగా ఇస్తుంటారు. ఒకటి, రెండు పదాల్లో చిరునామాను పేర్కొనడం వంటివి చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఒక సంస్థ బిహార్‌లోని ప్రభుత్వ కార్యాలయం, చైనాలోని ఒక వీధి పేరుని తమ చిరునామాగా ఇచ్చిన‌ట్లు గుర్తించారు. అందువల్ల ముందుగా యాప్‌ని నిర్వహిస్తున్న సంస్థ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. వారి కార్యాలయం భారతదేశంలోనే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? వెబ్‌సైట్‌ వివరాలు, యాప్ ద్వారా రుణం పంపిణీ చేసే రుణదాతల వివరాలు.. ఇలా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఏదైనా త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ఉంటే మోస‌పూరిత యాప్‌గా గుర్తించ‌వ‌చ్చు.

ఎన్‌బీఎఫ్‌సీ వెబ్‌సైట్లు: ఇటీవ‌ల కొన్ని మోస‌పూరిత రుణ యాప్‌లు.. ఆర్‌బీఐ లైసెన్స్ ఉన్న NBFCతో భాగ‌స్వామ్యం ఉంద‌ని వినియోగ‌దారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి. అందువ‌ల్ల రుణం కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్‌ను నిర్వ‌హిస్తున్న రుణ సంస్థ గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం NBFCలు త‌మ రుణ ప్లాట్ ఫామ్‌/యాప్ పేరును త‌మ వెబ్‌సైట్‌లో త‌ప్ప‌నిస‌రిగా జాబితా చేయాలి. ఒక‌వేళ మీరు ఎంచుక‌న్న రుణ సంస్థ నిర్దిష్ట NBFCతో భాగ‌స్వామ్యం ఉంద‌ని తెలియ‌జేసిన‌ట్ల‌యితే.. ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి భాగ‌స్వాముల జాబితాను త‌నిఖీ చేయండి. ఒక‌వేళ మీరు ఎంచుకున్న రుణ యాప్ వెబ్‌సైట్ అందించిన జాబితాలో లేక‌పోతే ఆ యాప్‌కి దూరంగా ఉండ‌డం మంచిది. అలాగే గూగుల్ పాల‌సీ ప్ర‌కారం యాప్ నిర్వహ‌ణ‌దారులు, యాప్ వివ‌రాల‌తో పాటు నిర్దిష్ట యాప్‌తో అనుసంధాన‌మైన‌ బ్యాంకులు, బ్యాంకిగేత‌ర సంస్థ‌ల పేర్ల‌ను కూడా త‌ప్పనిస‌రిగా పేర్కొనాలి. అలాగే, రుణ కాల‌వ్య‌వ‌ధి గురించి తెల‌పాలి. త‌క్కువ కాల‌వ్య‌వ‌ధితో కూడిన రుణాల‌ను ఇచ్చే చాలా వ‌ర‌కు యాప్‌ల‌ను ప్లే స్టోర్‌కి అనుమ‌తించ‌డం లేదు. 

యాప్‌ ప‌ర్మిష‌న్లు: ఏదైనా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకునే క్ర‌మంలో యాప్‌లు కొన్ని అనుమతుల‌ను కోరుతుంటాయి. మ‌నలో చాలా మంది అవి కోరుతున్న అనుమతుల గురించి తెలుసుకోకుండానే అనుమ‌తించేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా యాప్‌లు వినియోగ‌దారుని మొబైల్‌లో ఉన్న స‌మాచారాన్ని (కాంటాక్ట్ లిస్ట్‌లో వివ‌రాలు, ఫోటోలు వంటి వ్య‌క్తిగ‌త స‌మాచారం) సేక‌రించి దుర్వినియోగం చేసే ప్ర‌మాదం ఉంది. వ్య‌క్తుల నుంచి క‌నీస వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని మాత్ర‌మే సేక‌రించేందుకు ఈ యాప్‌ల‌కు అనుమితి ఉంటుంది. అన‌వ‌స‌ర‌మైన స‌మాచారం అడుగుతుంటే ఆ యాప్‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది. 

రుణ ప్ర‌తాలు: ఆర్‌బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. రుణ‌దాత‌లు, వ‌డ్డీ రేట్ల‌తో స‌హా అవ‌స‌ర‌మైన మొత్తం స‌మాచారాన్ని పార‌ద‌ర్శ‌కంగా రుణం తీసుకునే ముందే అందించాలి. త‌ద్వారా రుణ గ్ర‌హీత నిర్ణ‌యం తీసుకునేందుకు వీలుంటుంది. మోస‌పూరిత రుణ యాప్‌లు ఆర్‌బీఐ సూచించిన స‌మాచారాన్ని గానీ, రుణ ఒప్పందాన్ని గానీ, రుణ మంజూరు ప‌త్రాన్ని గానీ రుణ గ్ర‌హీత‌కు ఇవ్వ‌వు. రుణ ఒప్పంద ప‌త్రంలో రుణ‌దాత పేరు, ప్రాసెసింగ్ ఫీజులు, వార్షిక వ‌డ్డీ రేటు (కొన్ని సార్లు వార్షిక వ‌డ్డీ స్థానంలో నెల‌వారీ వ‌డ్డీని చెబుతుంటాయి. ఒక‌వేళ నెల‌వారి వ‌డ్డీ అయితే చెల్లించాల్సిన వ‌డ్డీ భారం అవుతుంది), చెల్లింపుల కాల‌ప‌రిమితి మొద‌లైన స‌మాచారాన్ని ఇవ్వాలి. కానీ ఫేక్ రుణ యాప్‌లు చాలా సందర్భాల్లో ఇటువంటి స‌మాచారం ఇచ్చేందుకు అంగీక‌రించ‌వు. అలాంటి యాప్‌ల‌ను ఫేక్ రుణ యాప్‌లుగా గుర్తించ‌వ‌చ్చు.

కేవైసీ: రుణ‌దాత‌లు ప్ర‌తీ ద‌ర‌ఖాస్తు దారునికి కేవైసీ (నో యుర్ క‌స్ట‌మ‌ర్‌)ను ధ్రువీకరించాలి. ఒక‌వేళ రుణ‌యాప్ కేవైసీ రూల్స్ పాటించ‌క‌పోతే ఆ యాప్‌ను అనుమానించాల్సిందే.

ముంద‌స్తు ఫీజులు, ఇత‌ర‌ ఛార్జీలు: కొన్ని యాప్‌లు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించి ముంద‌స్తు ఫీజుల‌ను వ‌సూలు చేస్తుంటాయి. అంటే, నిజానికి ఇవి ఎలాంటి రుణం అంద‌జేయవు. కొంత ఫీజు తీసుకుని రుణాలిచ్చే సంస్థ‌ల‌కు మిమ్మ‌ల్ని రీడైరెక్ట్ చేసి త‌ప్పుకుంటాయి. ఇక‌ ఎలాంటి బాధ్య‌త తీసుకోవు. కాబ‌ట్టి ఇలాంటి వాటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. వీటి నుంచి రుణ స‌హాయం కోరడం గానీ, ముందుగానే డ‌బ్బు చెల్లించ‌డం గానీ చేయ‌కూడ‌దు.

చివ‌రిగా: చిన్న మొత్తంలో త‌క్ష‌ణ రుణం కోరుకునే వారికి రుణ యాప్‌లు మంచి ఎంపికే. కానీ, మోస‌పూరిత యాప్‌లు పెరిగిపోవ‌డం వ‌ల్ల‌, వాటి బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకునేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆర్‌బీఐ ధ్రువీకరించిన యాప్‌లకు మాత్ర‌మే ప్రాధాన్య‌ం ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని