Home Loan: ఇంటి రుణానికి చెల్లించిన వడ్డీని ఎలా రాబట్టొచ్చు?

ఇంటి రుణం తీసుకున్న వారు ఎవరైనా ప్రిన్సిపల్‌తో పాటు వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. దీర్ఘకాలంలో వడ్డీ అధిక మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని ఇంకో విధంగా ఎలా రికవరీ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

Updated : 15 May 2023 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనుగోలు చేసేవారు చాలామంది రుణాన్నే (Home loan) ఎక్కువగా ఆశ్రయిస్తారు. ఈ రుణం పెద్ద మొత్తంతో ఉండడమే కాదు.. దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి ఉంటుంది. రమారమి 20-25 సంవత్సరాల వరకు అసలు, వడ్డీ చెల్లిస్తూనే ఉంటారు. దీంతో తిరిగి చెల్లించే అసలు కన్నా వడ్డీ ఎక్కువ అవుతుంది. మరి, ఈ వడ్డీ భారమే కదా! దీన్నీ తిరిగి పొందొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం..

ఒక వ్యక్తి రూ.30 లక్షలు గృహ రుణం తీసుకున్నారనుకుందాం. దీనికి వార్షిక ప్రాతిపదికన వడ్డీ 8 శాతం. కాలవ్యవధి 25 సంవత్సరాలు. ఈఎంఐ రూ.23,154 చెల్లించాలి. ఈ లెక్కన 25 సంవత్సరాలకు అసలు+వడ్డీ కలిపి రూ.69,46,346 అవుతుంది. అసలు గాక వడ్డీనే రూ.39,46,346 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్న రుణం కంటే వడ్డీనే ఎక్కువ అని గ్రహించాలి. ఇప్పుడు ఈ వడ్డీ భారమవ్వకుండా ఏం చేయొచ్చో చూద్దాం.

మొదటి పట్టిక ఇంటి రుణానికి సంబంధించినది. రెండో పట్టిక మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌నకు సంబంధించినది. ఇంటి రుణానికి చెల్లించిన వడ్డీని రాబట్టాలంటే ఇంటి రుణ ఈఎంఐతో పాటు మ్యూచువల్‌ ఫండ్‌లో సిప్‌ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అటు రుణం, ఇటు ‘సిప్‌’ సమాంతరంగా ఒకే కాలవ్యవధి వరకు చెల్లించాలి. గృహ రుణంతో పాటు ‘సిప్‌’ చెల్లించడం భారం కదా అనుకుంటారు. కానీ, చిన్న మొత్తంలో.. అంటే, గృహ రుణ ప్రిన్సిపల్‌ మొత్తంలో సుమారుగా 0.1% లెక్కించి ‘సిప్‌’ మొదలుపెట్టొచ్చు. పైన తెలిపిన గృహ రుణం ఉదాహరణ ప్రకారం చుస్తే ప్రతి నెలా సిప్‌ రూ.3,000 చొప్పున 25 సంవత్సరాలు చెల్లిస్తే.. మీరు చెల్లించే మొత్తం రూ.9 లక్షలు అవుతుంది. మ్యూచువల్‌ ఫండ్‌లో సగటు రాబడి (సీఏజీఆర్‌) 12% ఉంటుందని భావిస్తే.. 25 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.57 లక్షలు అందుకుంటారు. మీరు చెల్లించింది రూ.9 లక్షలు పోనూ, రాబడి రూ.48 లక్షలు వస్తుంది. గృహ రుణానికి చెల్లించే వడ్డీ (రూ.39,46,346) పోగా అదనంగా రూ.8,53,654 పొందుతారు.

ఈ విధంగా చేస్తే, గృహ రుణంపై చెల్లించే వడ్డీ భారాన్ని పూర్తిగా భర్తీ చేయొచ్చు. ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతూ వెళితే మరింత సమకూర్చుకోవచ్చు. రిస్క్ తీసుకోలేని వారు పీపీఎఫ్ లాంటి పథకాలను ఎంచుకోవచ్చు. వీటిలో ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని పొందడం సాధ్యం కాకపోవచ్చు.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్ ‘సిప్‌’లో రాబడిని.. గతంలో వచ్చిన రాబడుల ఆధారంగా తెలిపాం. అలాగని ఇది భవిష్యత్‌కు కొలమానం కాదు. ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని