Car Insurance: కారు బీమా ప్రీమియం తగ్గించుకోవాలా? ఇలా చేయండి..

ప్రీమియం ఎక్కువవుతుందని కారు బీమాను తీసుకునేందుకు ఆలోచిస్తున్నారా? బీమా కవరేజీని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రీమియం కొంత వరకు తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

Updated : 03 Nov 2022 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు కొనుగోలుకు లక్షలాది రూపాయిలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా పరిశోధన చేసి, అవసరమైతే రుణం తీసుకుని కొంటుంటాం. అలా కొన్న కారుకు భద్రత ఉండాలంటే బీమా ఉండాల్సిందే. కొంత మంది.. వారి డ్రైవింగ్‌ మీద ఉన్న నమ్మకంతో ఖర్చుతో కూడుకున్నదని బీమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఎంత జాగ్రత్తగా డ్రైవ్‌ చేసినా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరగొచ్చు. అదీకాక మన దేశంలో వాహనం రోడ్డు మీదకు రావాలంటే కచ్చితంగా థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్‌ తీసుకోవాల్సిందే.  లేదంటే జరిమానా తప్పదు. 

వాస్తవానికి బీమాను భద్రతగా చూడాలే తప్ప ఖర్చు అనుకోకూడదు. అధిక మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి థర్డ్‌ పార్టీ ఇన్సురెన్స్‌తో పాటు తగిన కవరేజీతో సమగ్ర బీమాను తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు బీమా ప్రీమియం ఎక్కువవుతుందని ఆలోచిస్తున్నట్లయితే తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. బీమా కవరేజీని ఏమాత్రం తగ్గించుకోకుండా ప్రీమియం కొంత వరకు తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. 

ఆన్‌లైన్‌లో కొనుగోలు..

కారు/ ద్విచక్ర వాహన డీలర్లు.. తమతో ఒప్పందం ఉన్న బీమా సంస్థల నుంచి పాలసీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మనం వారు చెప్పిన పాలసీ తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. కాబట్టి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వివిధ పాలసీల గురించి తెలుసుకోండి. మీకు సరిపోయే పాలసీని ఎంచుకుని.. ఆ పాలసీకి వివిధ సంస్థలు అందించే ప్రీమియంను పోల్చి చూడండి. ప్రీమియం ఒక్కటే కాదు క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని మీకు నచ్చిన సంస్థ నుంచి నేరుగా పాలసీ కొనుగోలు చేయండి. బీమా సంస్థల వెబ్‌సైట్ల నుంచి నేరుగా పాలసీ కొనుగోలు చేయడం వల్ల ఏజెంట్లు ఉండరు కాబట్టి  ప్రీమియం చాలా వరకు తగ్గే  అవకాశం ఉంటుంది. దీంతో మీకు అన్ని విధాలా సరిపోయే పాలసీని బడ్జెట్‌లోనే కొనుగోలు చేయొచ్చు.

నో-క్లెయిం బోనస్‌.. 

పాలసీ కాలవ్యవధిలో ఎలాంటి క్లెయింలూ చేయనివారికి నో-క్లెయిం బోనస్‌ పొందేందుకు అర్హత ఉంటుంది. ప్రతి క్లెయిం రహిత సంవత్సరానికి బీమా సంస్థ నో-క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) రివార్డు అందిస్తుంది. ఇలా వరుసగా 5 ఏళ్ల పాటు మీరు ఎటువంటి క్లెయిమూ చేయకపోతే గరిష్ఠంగా 50% వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఏదైనా ఏడాది క్లెయిం చేస్తే.. రెన్యువల్‌ సమయంలో ఎన్‌సీబీ జీరో అయిపోతుంది. కాబట్టి, చిన్న చిన్న రిపేర్లకు క్లెయిం చేయకుండా ఉంటే ఎన్‌సీబీతో ప్రీమియంను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

డిడక్టిబుల్స్‌..

కారు బీమా ప్రీమియంను తగ్గించుకునేందుకు ఉన్న మరో ముఖ్య మార్గం డిడక్టిబుల్స్‌. వీటిని ఎంచుకోవడం కొంత వరకు ప్రయోజనకరమే. డిడక్టిబుల్స్‌ ఉంటే.. కారుకు ఏదైనా నష్టం జరిగినప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అలాగే చిన్న చిన్న నష్టాలకు బీమా క్లెయిం చేయరు. తద్వారా ఎన్‌సీబీ కోల్పోకుండా ఉంటారు.

డిడక్టిబుల్‌ అంటే..?: బీమా సంస్థకు, పాలసీదారుడికి మధ్య జరిగే కాస్ట్‌ షేరింగ్‌ ఎగ్రిమెంటు (ఖర్చు భాగస్వామ్యం ఒప్పందం)నే డిడక్టిబుల్స్‌ అంటారు. అంటే ప్రమాదం కారణంగా కారుకు ఏదైనా నష్టం జరిగితే.. క్లెయిం మొత్తంలో కొంత భాగం పాలసీదారుడు చెల్లించాలి. ఆ తర్వాత మాత్రమే బీమా సంస్థ క్లెయిం సెటిల్‌మెంట్‌ చేస్తుంది. అంటే, ఖర్చు కనీస మొత్తం దాటితేనే బీమా క్లెయిం చేయగలుగుతారు. ఒకవేళ మీరు డిడక్టిబుల్‌ జీరోగా ఎంచుకుంటే ప్రీమియం మొత్తం పెరుగుతుంది. అదే, కొంత మొత్తాన్ని భరించగలిగితే ప్రీమియం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ డిడక్టిబుల్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. 1. కంపల్సరీ డిడక్టిబుల్‌ 2. వాలంటరీ డిడక్టిబుల్‌. 

కంపల్సరీ డిడక్టిబుల్‌: బీమా నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. బీమా చేసిన అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది.  పాలసీలో తప్పనిసరిగా పాలసీదారుడు చెల్లించవలసిన భాగాన్ని కంపల్సరీ డిడక్టిబుల్‌ అంటారు. ఎంత మొత్తం అనేది వాహన ఇంజిన్‌ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 1499 సీసీ వరకు ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లకు తప్పనిసరి మినహాయింపు రూ.1,000, అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి రూ.2,000 ఉంటుంది. కంపల్సరీ డిడక్టిబుల్‌తో ప్రీమియం ఏమాత్రం తగ్గదు. పాలసీదారుడు క్లెయిం చేసినప్పుడు ఫీజు కింద ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

వాలంటరీ డిడక్టిబుల్‌: ప్రీమియం తగ్గించడంలో వాలంటరీ డిడక్టిబుల్‌ సాయపడుతుంది. క్లెయిం మొత్తంలో కొంత భాగాన్ని మీరు స్వచ్ఛందంగా భరించడానికి అంగీకరించడమే వాలంటరీ డిడక్టిబుల్‌. క్లెయిం చేయాల్సివచ్చినప్పుడు పాలసీదారుడు ఖర్చులను భరించగలిగే సామర్థ్యాన్ని, కారు ఉపయోగించే తీరును అనుసరించి, ఎంత వరకు వాలంటరీ డిడక్టిబుల్‌ను ఎంచుకోవాలో నిర్ణియంచుకోవచ్చు. ఉదాహరణకు కారు వినియోగం తక్కువగా ఉండి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఎక్కువ మినహాయింపుతో పాలసీ తీసుకోవచ్చు. డ్రైవింగ్‌ నైపుణ్యాలు, కారు తిరిగే ప్రాంతం, కారుకు ఉన్న భద్రతా ఫీచర్లు వీటిన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎంత ఎక్కువ వాలంటరీ డిడక్టిబుల్‌ తీసుకుంటే అంత ప్రీమియం తగ్గుతుంది. అయితే క్లెయిం చేయాల్సి వచ్చినప్పుడు అధిక భాగం పాలసీదారుడే చెల్లించాలి. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవడం మేలు. 

ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్ వేల్యూ(ఐడీవీ)..

మోటారు బీమాలో ప్రీమియంపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఐడీవీ ఒకటి. ఏదైనా ప్రమాదం కారణంగా వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పుడు (రిపేరు చేసేందుకు వీలులేని విధంగా) లేదా దొంగిలించినప్పుడు బీమా సంస్థ, పాలసీదారునికి చెల్లించే గరిష్ఠ బీమా విలువే ఐడీవీ. సాధారణంగా పాలసీ కొనుగోలు చేసినప్పుడు లేదా పునరుద్ధరణ సమయంలో కారు మోడల్‌, తయారీదారు ఇచ్చిన అమ్మకం ధర ఆధారంగా ఐడీవీ నిర్ణయిస్తారు. ఐదేళ్లకు పైబడిన వాహనాలకు, వాహన కండీషన్‌ ఆధారంగా ఐడీవీ అంచనా వేస్తారు. పాలసీదారుడు, బీమా సంస్థ పరస్పర అంగీకారంతో కూడా ఐడీవీ నిర్ణయించవచ్చు. ఎక్కువ ఐడీవీ ఎంచుకుంటే ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి వాహన కండీషన్‌ను బట్టి సరిపోయే ఐడీవీ ఎంచుకుంటే బీమా ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

యాంటీ థెఫ్ట్ పరికరం..

మీ వాహనంలో యాంటీ థెఫ్ట్ పరికరాన్ని అమర్చడం ద్వారా మీ వాహనం దొంగతనానికి గురికాకుండా కాపాడుకోవడం మాత్రమే కాకుండా, బీమా ప్రీమియంను కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్టిఫై చేసిన యాంటీ థెఫ్ట్ పరికరాన్ని అమర్చినట్లయితే, బీమా కంపెనీలు మీ పాలసీ ప్రీమియంపై డిస్కౌంటును అందిస్తాయి. 

చివరిగా..

వాహన బీమా పాలసీను సకాలంలో పునరుద్ధరించాలి.. లేకపోతే అప్పటి వరకు పొందిన నో-క్లెయిం బోనస్‌ కోల్పోవడంతో పాటు.. దురదృష్టవశాత్తు, బీమా కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రమాదం జరిగితే ఎలాంటి కవరేజీ లభించదు. ఖర్చు మొత్తం మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే బీమా కవరేజీని పెంచుకునేందుకు ఇంజిన్‌ ప్రొటక్షన్‌, జీరో డిప్రిసియేషన్‌, నో క్లెయిం బోనస్‌ ప్రొటెక్షన్‌, ఇన్‌వాయిస్‌ కవర్‌ రిటర్న్‌, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, లాక్‌/కీ రీప్లేస్‌మెంట్‌ కవర్‌ వంటి అనేక రకాల యాడ్‌-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో తక్కువ ఖర్చుతోనే కవరేజీని పెంచుకోవచ్చు. మీ అవసరాలకు తగినట్లుగా యాడ్‌-ఆన్‌లను ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని