Home Loan: ఈఎంఐ భారం తగ్గించుకోవడం ఎలా? ఈ టిప్స్‌ పాటించండి..

రుణ గ్రహీతలు ఈఎంఐ భారం కాకుండా ఎలాంటి మార్గాలను అనుసరించవచ్చో ఇప్పుడు చూద్దాం. 

Published : 08 Dec 2022 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ (RBI) కీలక రెపో రేటును (Repo rate) తాజాగా 0.35% పెంచింది. దీంతో ఇది 6.25% కు చేరింది. ఈ ఏడాది మే నుంచి ఇప్పుటి వరకు అయిదు సార్లు రెపోరేటును 2.25% (225 బేసిస్‌ పాయింట్లు) మేర పెంచింది. ఈ ప్రభావం రుణ గ్రహీతలపై తప్పక పడుతుంది. ముఖ్యంగా గృహ రుణం  (Home loan) అనేది 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉండే దీర్ఘకాలిక రుణం కాబట్టి వడ్డీ రేటులో స్వల్ప మార్పులు వచ్చినా.. దాని ప్రభావం అధికంగానే ఉంటుంది. దీంతో తక్కువ వడ్డీ రేట్ల సమయంలో ఒక ప్రణాళిక ప్రకారం రుణాలు తీసుకొని చెల్లిస్తున్నవారు.. వారి ఆర్థిక ప్రణాళిక దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. మరి రుణ గ్రహీతలు ఈఎంఐ భారం కాకుండా ఎలాంటి మార్గాలను అనుసరించవచ్చో ఇప్పుడు చూద్దాం..

ఏం చేయాలి?

రీఫైనాన్స్‌: ప్రస్తుతం మీ బ్యాంకు అందించే వడ్డీరేటును, ఇతర బ్యాంకుల వడ్డీ రేటుతో పోల్చి చూడండి. ఒకవేళ వడ్డీరేటులో ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తే.. తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇచ్చే సంస్థకు మారే ప్రయత్నం చేయవచ్చు. కనీసం 0.75-1% తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో అధిక మొత్తం ఆదా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. రుణం బదిలీ చేసేముందు కొత్త బ్యాంకు ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర హిడెన్‌ ఛార్జీలను కూడా తెలుసుకోవడం మంచిది.

  • వడ్డీ తగ్గించమని ఇప్పటికే రుణం తీసుకున్న బ్యాంకును కూడా కోరవచ్చు. మీరు మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహిస్తున్నవారైతే.. బ్యాంకులు మీ అభ్యర్థనను మన్నించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బ్యాంకులు కొంత ప్రాసెసింగ్‌ ఫీజు ఛార్జ్‌ చేసినప్పటికీ ఎక్కువ పేపర్‌ వర్క్‌ ఉండదు.

అధిక కాలపరిమితి: వడ్డీ రేట్లు పెరిగిన ప్రతిసారీ అది వినియోగదారుల ఈఎంఐలో ప్రతిబింబించకుండా బ్యాంకులు రుణ కాలపరిమితి పెంచుతుంటారు. దీంతో ప్రతి నెలా ఎంత చెల్లిస్తున్నామో అంతే ఈఎంఐ చెల్లించవచ్చు. కానీ, రుణ ఈఎంఐ చెల్లింపులు మరికొంత కాలం కొనసాగించాల్సిరావచ్చు. అధిక మొత్తంలో ఈఎంఐలు చెల్లించలేనప్పుడు కాలపరిమితిని పెంచుకోవచ్చు.

ఉదాహరణకు మీరు మీ రుణ అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ రూ.15 లక్షలు ఉందనుకుందాం. ప్రస్తుతం 8.40% వడ్డీ అనుకుందాం. నెలవారీగా దాదాపు రూ.14,683 ఈఎంఐ చెల్లిస్తే.. 15 ఏళ్లలో మీ రుణం పూర్తిగా చెల్లించవచ్చు. రుణ మొత్తం పూర్తయ్యేలోపు మీరు చెల్లించిన వడ్డీ మొత్తం రూ.11,42,994. అయితే వడ్డీ 8.75%కు పెరిగిందనుకుంటే అదే ఈఎంఐ కొనసాగిస్తే మరో 8 నెలలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 12,60,665.  వడ్డీలో వచ్చిన వ్యత్యాసం రూ.1,17,671.

అధిక ఈఎంఐ: ఒకవేళ కొంత ఎక్కువ ఈఎంఐ మొత్తం చెల్లించగలిగిన వారైతే ఈఎంఐ మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. దీని వల్ల అనుకున్న సమయంలోనే రుణం చెల్లించవచ్చు. అయితే నెలవారీ బడ్జెట్‌, పెట్టుబడులపై ప్రభావం పడకుండా చూసుకోవాలి.

పై ఉదాహరణనే తీసుకుంటే.. ఈఎంఐను రూ. 14,683 నుంచి రూ.14,992కు పెంచుకుంటే ముందు అనుకున్నట్లు 15 ఏళ్లలోనే రుణం పూర్తిగా చెల్లించవచ్చు. ఇక్కడ చెల్లించిన వడ్డీ మొత్తం రూ.11,98,511.

ఒక ఈఎంఐ అధికంగా చెల్లించడం: ప్రతి ఏడాదీ ప్రారంభంలో ఒక అదనపు ఈఎంఐను చెల్లించడం ద్వారా కూడా వడ్డీ గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే రుణాన్ని త్వరగా క్లియర్‌ చేసుకోవచ్చు. అయితే, ఒక ఏడాదిలో 12 ఈఎంఐలకు బదులు 13 ఈఎంఐ చెల్లించేలా మీ ఆర్థిక ప్రణాళికను సరిదిద్దుకోవాలి.

ఏడాదికి 5% లోన్‌ బ్యాలెన్స్‌ చెల్లించడం: ఏడాదికి ఒకసారి అసలు మొత్తంలో కనీసం 5% మొత్తానికి చెల్లింపులు చేసేలా ప్రయత్నించవచ్చు. దీని వల్ల చాలా వరకు వడ్డీని ఆదా చేయగలుగుతారు. తొందరగా లోన్‌ క్లియర్‌ చేయగలుగుతారు. పెద్ద మొత్తంలో డబ్బు అందినప్పుడు, పనిచేస్తున్న సంస్థ నుంచి బోనస్‌, ఇతర ప్రోత్సాహకాలు అందినప్పుడు ఆ మొత్తాన్ని ఇందుకు వినియోగించి రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు.

ముందస్తు చెల్లింపులు: ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంటే రుణ పూర్తి చెల్లింపులు గానీ, పాక్షిక చెల్లింపులు గానీ చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం గృహ రుణ అసలు చెల్లింపులపై సెక్షన్‌ 80సి కింద రూ.1.50 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్‌ 24బి కింద రూ.2 లక్షల వరకు.. మొత్తంగా ఒక ఏడాదిలో రూ. 3.50 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లెయిం చేసుకునే వీలుంది. కాబట్టి, రుణాన్ని పూర్తిగా చెల్లించడం వల్ల ఈ ఆదాయపు పన్ను ప్రయోజనాలు కోల్పోవచ్చని గమనించండి.

చివరిగా..

ఆర్‌బీఐ రెపో రేటును పెంచినా, తగ్గించినా ఆ ప్రభావం రుణ గ్రహీతలపై పడుతుంది. గృహ రుణం అనేది 20 నుంచి 30 ఏళ్లు కొనసాగుతుంది. ఈ కాలంలో వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. కాబట్టి వీటి గురించి ఆందోళన చెందకుండా రుణ ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం మంచిది. కనీసం 3 నెలలకు సమానమైన ఈఎంఐ మొత్తాన్ని అత్యవసర నిధిలో ఉంచడం ద్వారా నిధుల కొరత సమయంలోనూ సకాలంలో ఈఎంఐలు చెల్లించగలుగుతారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు