Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం త‌గ్గించుకోవాలా..? ఇవి తెలుసుకోండి

పాల‌సీ ప్రీమియం లెక్కించ‌డంలో ఆన్‌లైన్ క్యాలిక్యులేట‌ర్లు స‌హాయ‌ప‌డ‌తాయి. 

Updated : 23 Sep 2021 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాల‌సీ విష‌యంలో కొనుగోలుదారులు మొట్ట మొద‌ట‌గా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునేది ప్రీమియం. త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ అందించే సంస్థ, పాల‌సీల కోసం అన్వేషిస్తుంటారు. ప్రీమియం ఎంత చెల్లించాలో తెలుసుకునేందుకు చాలామంది బీమా సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డ‌తారు. అయితే ప్రీమియం కాలిక్యులేట‌ర్ సాయంతో ఆన్‌లైన్‌లో కూడా ఆరోగ్య బీమా ప్రీమియాన్ని తెలుసుకోవ‌చ్చు. మీ వ‌య‌సు, హామీ మొత్తం, బీమా చేయాల్సిన‌ కుటుంబ స‌భ్యులు, పాల‌సీ కాల‌ప‌రిమితితో పాటు సంబంధిత ఇత‌ర వివ‌రాల‌ను తెలియ‌జేస్తే వివిధ పాల‌సీలకు ఎంత ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుందో లెక్కించ‌డంలో ఈ కాలిక్యులేట‌ర్లు స‌హాయ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా కొనుగోలు చేసే ముందు ఎలాంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ప్రీమియాన్ని లెక్కిస్తారో తెలుసుకుంటే.. త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉన్న పాల‌సీని కొనుగోలు చేయొచ్చు. దీంతో కొనుగోలు ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం అవుతుంది. ఖ‌ర్చూ త‌గ్గుతుంది.

పాల‌సీ ప్రీమియంను ప్ర‌భావితం చేసే అంశాలు..

వ‌య‌సు: 20, 30 ఏళ్లలోపు వ‌య‌సు ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారికి ప్రీమియం అధికంగా ఉంటుంది. బీమా సంస్థ‌లు ప్రతి వ‌య‌సుకీ ఉన్న రిస్క్ (మ‌ర‌ణ రేటు)ను ప‌రిగ‌ణనలోకి తీసుకుని ప్రీమియం ఖ‌రారు చేస్తాయి. వ‌య‌సు పెరిగేకొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అందువ‌ల్ల చిన్న వయ‌సులోనే బీమా పాలసీ తీసుకోవాల‌ని చెబుతారు బీమా నిపుణులు.

ఆరోగ్య బీమా అండ‌ర్ రైటింగ్‌..: ద‌ర‌ఖాస్తు ఫారం నింపిన‌ప్పుడు రిస్క్ ప్రొఫైల్ గురించి పూర్తి స‌మాచారాన్ని ఇవ్వాలి. పాల‌సీదారుడు ఇచ్చిన‌ స‌మాచారాన్ని అధ్య‌యనం చేసి పాల‌సీదారుడి ప్ర‌మాద స్థాయిని గుర్తించి.. అండ‌ర్ రైటింగ్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుపుతారు. అందుకే పాల‌సీ ద‌ర‌ఖాస్తు ఫారం నింపిన‌ప్పుడు నిజ‌మైన‌, పూర్తి స‌మాచారాన్ని ఇవ్వాల‌ని నిపుణులు చెబుతారు. దీంతో భ‌విష్య‌త్‌లో క్లెయిమ్‌ చేసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు.

కుటుంబ వైద్య చ‌రిత్ర‌..: ఆరోగ్య బీమా కొనుగోలు స‌మ‌యంలో మీ పూర్తి కుటుంబ ఆరోగ్య చ‌రిత్ర నివేదిక‌ల‌ను బీమా సంస్థ‌కు అందించాలి. మీరు ఆరోగ్యంగా ఉండి, ముందుగా గుర్తించిన వ్యాధులు లేక‌పోతే ప్రీమియం త‌గ్గుతుంది. అలాగే కుటుంబంలో మేజ‌ర్ ఆరోగ్య స‌మ‌స్య‌లు లేన‌ప్పుడు కూడా ప్రీమియం త‌గ్గుతుంది. అధిక బ‌రువు ఉన్న వారికి ప్రీమియం ఎక్కువయ్యే అవ‌కాశం ఉంటుంది. కార‌ణం అధిక బ‌రువు ఉన్న‌వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే ప్రీమియం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ప్రీమియం త‌గ్గాలంటే ఫిట్‌గా ఉండాలి. ఇందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

కమ్యూనిటీ రేటింగ్..: బీమా చేసిన వ్య‌క్తి నివ‌సిస్తున్న ప్రాంతం.. ప్రధానంగా ఆ ప్రాంతంలోని జీవ‌న శైలి, రాజకీయ స్థిరత్వం, భౌగోళిక స్థానం, వాణిజ్య కార్యకలాపాలతో పాటు కుటుంబ పరిమాణం, వయస్సు, వృత్తి, భౌగోళిక ప్రాంతం వంటి వాటిని ప‌రిగణనలోకి తీసుకుంటారు.

స‌హ చెల్లింపులు: ఆరోగ్య బీమాలో స‌హ చెల్లింపుల (కో-పేమెంట్‌) ఆప్ష‌న్ ఎంచుకుంటే ప్రీమియం త‌గ్గుతుంది. ఈ ఆప్ష‌న్‌తో పాల‌సీ తీసుకుంటే అనారోగ్యం కార‌ణంగా పాల‌సీదారుడు ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే.. క్లెయిమ్‌ మొత్తంలో నిర్దిష్ట శాతాన్ని బీమా చేసిన వ్య‌క్తి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. కొన్ని పాల‌సీలు అంత‌ర్గ‌తంగా ఈ ఆప్ష‌న్‌తో వస్తాయి. అందువ‌ల్ల కొనుగోలు స‌మ‌యంలో పాల‌సీ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవాలి.

చేరిక‌లు, మిన‌హాయింపులు: త‌క్కువ మిన‌హాయింపులు ఉంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుంది. ఆసుప‌త్రిలో చేరి 24 గంట‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లు, ఐసీయూ ఛార్జీలు, గ‌ది అద్దె, డాక్ట‌ర్ ఫీజు స‌హా వైద్య ఖ‌ర్చుల‌ను చాలా వ‌ర‌కు పాల‌సీలు క‌వ‌ర్ చేస్తాయి. అయితే కొన్ని మిన‌హాయింపులు కూడా ఉంటాయి. బీమా సంస్థలు నిర్దిష్ట పాల‌సీలో కొన్ని వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌వు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు పాల‌సీ నియ‌మ‌, నిబంధ‌నల‌ను క్షుణ్ణంగా చ‌దివి తెలుసుకోవాలి. 

ఊబ‌కాయం, ఎయిడ్స్‌, ధూమ‌పానం సంబంధిత వ్యాధులు, చికిత్స‌ వంటివి పాల‌సీలో కవ‌ర్‌ కాక‌పోవ‌చ్చు. ఇటువంటి శాశ్వ‌త మిన‌హాయింపుల‌ను పాల‌సీదారుడు తెలుసుకోవాలి.

గుర్తుంచుకోండి..
పాల‌సీ వార్షిక ప్రీమియం ఎక్కువ‌గా ఉంటే.. ఆరోగ్య బీమా ప్రీమియంలను ఈఎంఐల రూపంలో చెల్లించొచ్చు. ఈ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవ‌డం ద్వారా ఒకేసారి ఎక్కువ ప్రీమియం చెల్లించ‌డం గురించి ఆందోళ‌న చెంద‌కుండా.. మీ సౌక‌ర్యాన్ని బ‌ట్టి ప్ర‌తి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూ అధిక క‌వ‌రేజ్‌తో ఆరోగ్య బీమా ప్లాన్‌ను తీసుకోవ‌చ్చు. వ‌య‌స్సు, నివ‌సిస్తున్న ప్రాంతం, ప్ర‌స్తుత ప‌న్నులు, జీఎస్‌టి వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ప్రీమియం మారొచ్చు. 
అలాగే ఆరోగ్య‌బీమా పాల‌సీని ఎంచుకునేప్పుడు ప్రీమియం ఒక్క‌టే ప్రామాణికం కాకూడదు. నెట్‌వర్క్‌ ఆసుప‌త్రులు, న‌గ‌దు ర‌హిత సేవ‌లు, వెయిటింగ్ పీరియ‌డ్‌, స‌హ చెల్లింపులు, క‌వ‌ర‌య్యే వ్యాధులు, క‌వ‌ర్‌కాని వ్యాధులు, నో-క్లెయిమ్ బోన‌స్‌, లైఫ్‌టైమ్‌ రెన్యూవల్‌ సదుపాయం త‌దిత‌ర అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని