PM Kisan Maan Dhan Yojana: 60 ఏళ్ల తర్వాత రైతులకు పెన్షన్‌.. ఎలా న‌మోదు చేసుకోవాలి?

వృద్ధాప్యంలో చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ను అందించే ప్ర‌భుత్వ ప‌థ‌కం.

Updated : 15 Sep 2022 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతుల పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని ఈ మూడు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే, రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన మరో పథకమే.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజ‌న (PM Kisan Maan Dhan Yojana). ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు పెన్షన్‌ పొందొచ్చు. కనీసం రూ.3 వేలు పింఛన్‌గా అందుతుంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా నమోదు చేసుకోవాలి?

ఎవ‌రు అర్హులు?

ఇది వృద్ధాప్యంలో ఉన్న చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ను అందించ‌డానికి రూపొందించిన ప్ర‌భుత్వ ప‌థ‌కం. దీనికి 18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి. 2019 ఆగ‌స్టు నాటికి దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల భూ రికార్డుల‌లో పేర్లు ఉండి.. 2 హెక్టార్ల వ‌ర‌కు సాగు చేయ‌ద‌గిన భూమిని క‌లిగి ఉండాలి. అలాంటి చిన్న‌, స‌న్న‌కారు రైతులంద‌రూ ఈ ప‌థ‌కం కింద పెన్ష‌న్ పొంద‌డానికి పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. పెన్ష‌న్ పొంద‌డానికి 60 ఏళ్లు నిండాలి.

రైతు భాగ‌స్వామికీ పెన్ష‌న్

ఈ ప‌థ‌కం ప‌రిధిలోకి వ‌చ్చిన రైతుల‌కు క‌నీస హామీ పెన్ష‌న్ నెల‌కు రూ.3,000. పెన్ష‌న్ పొందే రైతు చ‌నిపోతే అత‌డి జీవిత భాగ‌స్వామికి 50% పెన్ష‌న్ వ‌స్తుంది. కుటుంబ పెన్ష‌న్‌కు జీవిత భాగ‌స్వామి మాత్ర‌మే అర్హులు.

రైతు చందా ఎంత?

18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల రైతులు 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాలి. ద‌ర‌ఖాస్తుదారుడైన రైతు త‌న‌కు 60 ఏళ్లు నిండిన త‌ర్వాత పెన్ష‌న్ కోసం క్లెయిమ్‌ను స‌మ‌ర్పించాలి. ప్ర‌తి నెలా రైతు బ్యాంకు ఖాతాలో ప్ర‌భుత్వం పెన్ష‌న్ జ‌మ చేస్తుంది.

పీఎం కిసాన్ పెన్ష‌న్ కోసం ఎలా న‌మోదు చేసుకోవాలి?

  • ప‌థ‌కంలో చేరాల‌నుకునే అర్హ‌త‌ గ‌ల రైతులు త‌మ ప్రాంతంలో ఉన్న ప్ర‌జాప‌నుల‌ సేవా కేంద్రాన్ని (కామన్ సర్వీస్ సెంటర్) సంద‌ర్శించాలి.
  • ఈ ప‌థ‌కంలో న‌మోదు ప్ర‌క్రియ కోసం ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ అవ‌స‌రం.
  • రైతు ఆధార్  నంబర్‌, పేరు, పుట్టిన తేదీ వివ‌రాల‌ను.. గ్రామ సేవా కేంద్రంలో ఉన్న 'గ్రామ స్థాయి ప్ర‌తినిధి' (VLE) ఆన్‌లైన్‌లో స‌రిపోల్చుకుంటారు.
  • రైతు బ్యాంకు ఖాతా వివ‌రాలు, మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ, జీవిత భాగ‌స్వామి వంటి వివ‌రాల‌ను నమోదు చేయ‌డం ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ పూర్తవుతుంది. నామినీ వివ‌రాలు కూడా న‌మోదు అవుతాయి.
  • ల‌బ్ధిదారుని వ‌య‌సు ప్ర‌కారం చెల్లించాల్సిన నెల‌వారీ చందాను సిస్ట‌మ్ ఆటోమేటిక్‌గా లెక్కిస్తుంది.
  • ప్ర‌భుత్వం నియమించిన గ్రామ స్థాయి ప్ర‌తినిధి (VLE)కి న‌గ‌దు రూపంలో మొద‌టి చందా మొత్తాన్ని చెల్లించాలి.
  • నమోదయిన 'ఆటో డెబిట్ మాండేట్ ఫార‌మ్' ప్రింట్ తీసిన త‌ర్వాత దానిపై ల‌బ్ధిదారు (రైతు) సంత‌కం చేస్తారు. దానిని 'VLE' స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా సిస్ట‌మ్‌లోకి అప్‌లోడ్ చేస్తారు.
  • ప్ర‌త్యేక‌మైన కిసాన్ పెన్ష‌న్ ఖాతా నంబర్‌ (KPAN) సిద్ధ‌మై.. కిసాన్ కార్డు త‌యార‌వుతుంది.

ఎవ‌రు అర్హులు కాదు?

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (NPS), ఈఎస్ఐ స్కీమ్‌, ఈపీఎఫ్ఓ ప‌రిధిలో ఉన్న‌వారు, ఏవైనా ఇత‌ర చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల కింద క‌వ‌రేజీలో ఉన్న‌వారు, జాతీయ పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ఎంచుకున్న రైతులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉన్న‌త ఆర్థిక స్థితి క‌లిగిన వ‌ర్గాల వారు.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజ‌న‌లో పెన్ష‌న్‌కు అర్హులు కారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts