Train Ticket: రైలు టికెట్‌ తేదీని మార్చుకోవచ్చా?పై క్లాస్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చా?

Train Ticket: ఒక్కోసారి రైలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో లేదా తేదీని మార్చుకోవడమో చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ముందే బుక్‌ చేసుకున్న టికెట్‌ని మార్చుకోవచ్చో? లేదో? చూద్దాం..!

Updated : 24 Oct 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకోవాల్సి (Train Ticket Cancellation) వస్తుంటుంది. అయితే, ఈ క్రమంలో కొనుగోలు చేసిన టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు వదులుకోవాల్సిందే. అయితే, మీరనుకున్న తేదీకి ముందుగానీ లేదా తర్వాతగానీ ప్రయాణించే వెసులుబాటు ఉంటే మాత్రం టికెట్‌ రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్యాన్సిలేషన్‌ ఛార్జీ భారం పడొద్దంటే టికెట్‌ తేదీని మార్చుకోవడం ఒక ఉత్తమ మార్గం.

ఇదీ ప్రక్రియ..

రైల్వే పాలసీ ప్రకారం.. ఒకసారి బుక్‌ చేసుకున్న టికెట్‌ తేదీని ముందుకు లేదా వెనక్కు మార్చుకోవచ్చు. అయితే, రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలి. రిజర్వేషన్‌ డెస్క్‌ దగ్గరకు వెళ్లి ఒక దరఖాస్తు సమర్పించాలి. అలాగే కొత్త తేదీ ఎప్పుడు అందుబాటులో ఉందో కూడా తెలుసుకోవాలి. ఆ తేదీ మీకు ఓకే అనుకుంటే టికెట్‌ను అప్పటికి మార్చుకొని నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు. ఒకవేళ మీరనుకున్న క్లాస్‌లో టికెట్‌లు లేకపోతే.. అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు కూడా వెసులుబాటు ఉంది. దీనికి సంబంధించిన దరఖాస్తును రిజర్వేషన్‌ డెస్క్‌లో సమర్పిస్తే టికెట్‌ తేదీ, క్లాస్‌ మారిపోతాయి. అయితే, క్లాస్‌ అప్‌గ్రేడ్‌ అయితే మాత్రం కచ్చితంగా అదనపు ఛార్జీని చెల్లించాలి. ఒకవేళ ముందు బుక్‌ చేసుకున్న క్లాస్‌లోనే ప్రయాణించే అవకాశం లభిస్తే ఎలాంటి అదనపు రుసుము అవసరం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకునే వారికి ఈ వెసులుబాటు లేదు. ఒకవేళ ప్రయాణం వేరే తేదీ చేయాలంటే టికెట్‌ రద్దు చేసుకుని మళ్లీ బుక్‌ చేసుకోవాల్సిందే.

ఎక్కువ దూరమూ ప్రయాణించొచ్చు..

మరోవైపు టికెట్‌ బుక్‌ చేసుకున్న కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును కూడా భారతీయ రైల్వే కల్పిస్తోంది. టీటీఈతో మాట్లాడి ఈ సదుపాయాన్ని పొందొచ్చు. అయితే, మీరు ముందు బుక్‌ చేసుకున్న స్టేషన్‌ రావడానికి ముందే టీటీఈతో మాట్లాడి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అదనపు ఛార్జీ వసూలు చేసే బాధ్యత కూడా టీటీఈపైనే ఉంటుంది. అలాగే టీటీఈతో మాట్లాడి కావాలంటే ప్రయాణించే క్లాస్‌ను కూడా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. దీనికి కూడా అదనపు ఛార్జీని టీటీఈనే వసూలు చేస్తారు.

పై క్లాస్‌కూ అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చు..

రిజర్వ్‌ చేసుకున్న టికెట్‌ను పై క్లాస్‌కు మార్చుకునేందుకు కూడా రైల్వే శాఖ అవకాశం కల్పిస్తోంది. అయితే, తేదీ, రైలులో మాత్రం ఎలాంటి మార్పు ఉండొద్దు. పైగా మీరు కోరుకున్న పై క్లాస్‌లో సీట్లు అందుబాటులో ఉంటేనే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. అదనపు రుసుమును రిజర్వేషన్‌ డెస్క్‌లో చెల్లించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలోనూ టీటీఈని సంప్రదించి మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని