Joint Account: ఉమ్మడి బ్యాంకు ఖాతా వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి?

ఉమ్మడి బ్యాంకు ఖాతాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టే, మరికొన్ని సమస్యలు కూడా ఉండొచ్చు. ఈ ఖాతాలతో ఏర్పడిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ చూడండి.

Published : 02 May 2023 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా కుటుంబ సభ్యులు పొదుపు కోసం లేదా ఏదైన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్య సాధన కోసం ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. వ్యాపార భాగస్వాములు అయితే వ్యాపార నిర్వహణ కోసం ఉమ్మడి ఖాతా ఓపెన్‌ చేస్తారు. ఇతర రెగ్యులర్‌ ఖాతాల మాదిరే ఇక్కడా పొదుపు ఖాతాతో పాటు లోన్‌ అకౌంట్‌, మార్జిగేజ్‌ అకౌంట్‌ ఇలా కొన్ని రకాల ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా ప్రారంభించేందుకు భాగస్వామ్యులు ఇద్దరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, ఉమ్మడి ఖాతాతో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. అవేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? 

ఇబ్బందులు

ఉమ్మడి ఖాతా కలిగిన వారిలో ఇద్దరిలో ఒకరికి ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉంటే అప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. అనేక కారణాల వల్ల, ఇతరత్రా భావోద్వేగాల వల్ల ఎవరైనా ఖాతాలో నిధులు ఖాళీ చేయొచ్చు. అందుకే ఉమ్మడి ఖాతాను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. అయితే ఇరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తితే ఉమ్మడి ఖాతా సమస్యాత్మకంగా ఉంటుంది. ఇద్దరి మధ్య నెలకొనే ఏదో ఒక వివాదం జాయింట్‌ ఖాతాలో నిధుల నిర్వహణను కష్టతరం చేస్తుంది. అలాంటప్పుడు ఖాతాదారులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. పరస్పరం అంగీకరించే విధానాన్ని ఎంచుకొని పరిష్కారానికి ప్రయత్నించాలి. బ్యాంకుల్లో ఉమ్మడి ఖాతా నిధులపై వివాదం తతెత్తితే పరిస్థితిని చక్కదిద్దడానికి కింది దశలను అమలు చేయొచ్చు.

మధ్యవర్తి సాయం

వివాదాన్ని ఇరువురు సామరస్యంగా పరిష్కరించుకోకపోతే, మధ్యవర్తి సాయం తీసుకోవడం మంచిది. విశ్వసనీయుడైన స్నేహితుడు గానీ, కుటుంబానికి చెందిన మరో వ్యక్తి గానీ ఇక్కడ మూడో పక్షంగా వ్యవహరించొచ్చు.

న్యాయ సలహా

మధ్యవర్తిత్వం విఫలమైతే, న్యాయ సలహా కోరడం అవసరం కావచ్చు. వివాదానికి సంబంధించి చట్టపరమైన చిక్కులను అర్ధం చేసుకోవడానికి, పరిష్కరించడానికి అవకాశాలను అన్వేషించడానికి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ చట్టాల్లో నైపుణ్యం కలిగిన న్యాయవాదిని సంప్రదించడం మంచిది.

బ్యాంకునే ఆశ్రయిస్తే..

బ్యాంకును ఆశ్రయించడం చివరి అవకాశం కావచ్చు. జాయింట్‌ ఖాతా ఒప్పందానికి సంబంధించి నిబంధనలు, షరతుల ఆధారంగా బ్యాంకు మీ ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంది, లేదా నిధులను విభజిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది చట్టపరమైన చర్యలను కలిగి ఉంటుంది. పైగా ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. కాబట్టి వివాద పరిష్కారంలో బ్యాంకును ఆశ్రయించడం అనేది చిట్టచివరి ప్రయత్నమై ఉండాలి.

బ్యాంకు స్టేట్‌మెంట్‌

మీ బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఈ స్టేట్‌మెంట్లను మీరు ఎప్పుడు పొందారో చెక్‌ చేయండి. ఈ విధంగా మీరు ఏదైనా లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా వివాదం లేదా నిధుల మళ్లింపు విషయంలో మీరు దాన్ని రుజువుగా కూడా ఉపయోగించవచ్చు. బ్యాంకులో నిధులు ఉపసంహరించిన ప్రతిసారీ మీ ఫోన్‌/ఇ-మెయిల్‌కు మెసేజ్‌ వస్తుంది. మీకు తెలియకుండా జరిగిన లావాదేవీల గురించి వెంటనే బ్యాంకుకు తెలియజేయడం ముఖ్యం. బ్యాంకు ఖాతాలో నిధులు ఉమ్మడిగా ఉంటాయి, వివాదం ఏర్పడితే, అది రెండు పార్టీల సమ్మతితో, ఖాతాకు సంబంధించిన నిబంధనలు, షరతులతో నిర్వహించగలిగేలా ఉండాలి.

పారదర్శకత

ఉమ్మడి బ్యాంకు ఖాతాలో నిధుల నిర్వహణకు పార్టీల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌, పారదర్శకత, పరస్పర విశ్వాసం అవసరం. ప్రతి వ్యక్తి ఖాతాకు ఎంత జమ చేస్తారు? ఉమ్మడి ఖాతా నుంచి ఏ ఖర్చులు చెల్లిస్తారో చూసుకోవాలి. అన్ని లావాదేవీల రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేవో చూడాలి. మీ సమ్మతి లేకుండా జరిగిన ఏదైనా లావాదేవీని ట్రాక్‌ చేయడంలో ఇది మీకు ఉపయోగపడుతుంది.

ఖాతా స్తంభన

ఒకవేళ మీ సమ్మతి లేకుండా ఉపసంహరణలు కొనసాగితే లేదా నిధులు సురక్షితంగా ఉండవని మీరు విశ్వసిస్తే, వెంటనే ఖాతాను స్తంభింపజేయమని బ్యాంకును కోరవచ్చు. ఈ విషయంలో, బ్యాంకు రెండు పార్టీల అనుమతి తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ మాత్రమే ఖాతాను బ్లాక్‌ చేయగలరు. అయితే, ఇది ఉమ్మడి ఖాతాలకు సంబంధించిన బ్యాంకు నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని