Credit Card: పండుగ సీజన్‌లో కొనుగోళ్లా? క్రెడిట్‌కార్డుతో ఇలా ఆదా చేసుకోండి..!

ఈ పండుగ సీజన్‌లో మీ పొదుపును పెంచుకునేందుకు క్రెడిట్‌ కార్డు ఏవిధంగా సహాయపడుతుందో ఇప్పడు తెలుసుకుందాం.

Published : 30 Sep 2022 18:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయులు సహజంగా పండగ సందర్భాల్లో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు. వాహనాలు దగ్గర నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు ఎక్కువ ధరతో కూడిన వస్తువులను తక్కువ ధరకు లభించే సమయం కూడా ఇదే. మీరు కూడా పండగకు వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే క్రెడిట్‌ కార్డుతో పండగ కొనుగోళ్లపై మరింత పొదుపు చేయవచ్చు. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు పండుగ వేళ్లలో అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఒకవేళ ప్రస్తుతం మీ వద్ద క్రెడిట్‌ కార్డు లేకపోతే.. ఆన్‌లైన్‌లో క్రెడిట్‌ కార్డులను పోల్చి చూసుకుని మీ అవసరాలకు సరిపోయే క్రెడిట్‌ కార్డును తీసుకోవచ్చు. మరి ఈ పండుగ సీజన్‌లో మీ పొదుపును పెంచుకునేందుకు క్రెడిట్‌ కార్డు ఏవిధంగా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అదనపు డిస్కౌంట్లు..

బ్రాండెడ్‌ సంస్థలు.. అదనపు రాయితీని అందించేందుకు బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలతో తరచుగా భాగస్వామ్యం కుదుర్చుకుని, క్యాష్‌బ్యాక్‌, యాక్సిలిరేటెడ్‌ రివార్డు పాయింట్ల రూపంలో డిస్కౌంట్లు అందిస్తుంటాయి. ఈ డిస్కౌంట్లు సాధారణంగా బ్రాండెడ్‌ సంస్థలు అందించే డిస్కౌంటుకు అదనంగా లభిస్తుంది. ఉదాహరణకు రూ.10 వేల విలువ గల వస్తువుపై బ్రాండెడ్‌ సంస్థలు 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తే.. ఆ వస్తువు రూ. 9 వేలకే వస్తుంది. దీనిపై నిర్దిష్ట క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు మరో 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తాయి. అంటే ఆ వస్తువు రూ.8,100 కే అందుబాటులో ఉంటుంది. అంటే క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేయడం వల్ల మరో రూ. 900 ఆదా చేసుకోవచ్చు.

2. క్రెడిట్‌ సైకిల్‌ ప్రారంభంలో లాభం ఎక్కువ..

క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేసేటప్పుడు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం. మీ క్రెడిట్‌ కార్డు సైకిల్‌. మీ క్రెడిట్‌ కార్డు సైకిల్‌ ప్రారంభంలో కొనుగోలు చేస్తే, అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ను చెల్లించేందుకు కనీసం 30 రోజుల సమయం దొరుకుతుంది. కాబట్టి సులభంగా, సమయానికి బిల్లు చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో ఆలస్య రుసుములు నుంచి తప్పించుకోవచ్చు. 

3. రివార్డు పాయింట్లను వినియోగించండి..

క్రెడిట్‌ కార్డుతో చేసే కొనుగోళ్లపై కార్డు సంస్థలు సాధారణంగా రివార్డు పాయింట్లను ఇస్తుంటాయి. కూడబెట్టిన రివార్డు పాయింట్లను రీడీమ్‌ చేసేందుకు పండుగ సీజన్‌ సరైన సమయం. కొనుగోళ్లు చేసేటప్పుడు మీ రివార్డు పాయింట్లను ట్రాక్‌ చేయండి. వీటిని ఉపయోగించి చెల్లింపులు చేయడం లేదా క్యాష్‌బ్యాక్‌ పొందడం వరకు కొంత వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

4. నో-కాస్ట్‌ ఈఎంఐ..

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేని వారికి.. అధిక విలువ కలిగిన వస్తువులను కొనుగోలు చేసేందుకు నో-కాస్ట్‌ ఈఎంఐ లేదా జీరో వడ్డీ ఈఎంఐ అనేది మంచి సదుపాయంగా చెప్పుకోవచ్చు. దీంతో వస్తువు కొనుగోలు కోసం చెల్లించవలసిన మొత్తాన్ని, వడ్డీ రహిత వాయిదాలలో చెల్లించవచ్చు. పండుగ వేళ్లలో మీ బడ్జెట్‌, పెట్టుబడులకు ఆటకం కలగకుండా ఈ సదుపాయం ద్వారా అధిక విలువ గల వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. 

5. గరిష్ఠ రివార్డు అందించే కార్డులను ఎంపిక చేసుకోండి..

క్రెడిట్‌ కార్డు తీసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి రివార్డు పాయింట్లు. ప్రజల్లో ఇవి అత్యంత ఆదరణ పొందాయనే చెప్పాలి. ఇవి మీ పొదుపును పెంచడంలో సహాయపడతాయి. వివిధ కొనుగోళ్లపై మీరు సంపాదించే క్రెడిట్‌ పాయింట్లు మీ కార్డుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సాధారణ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే కొన్ని ప్రీమియం కార్డులు, కార్డుదారుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ రివార్డు పాయింట్లను అందిస్తాయి. కొన్ని క్రెడిట్‌ కార్డులు ప్రతి రూ.100కు రూ. 1 నుంచి రూ. 10 వరకు రివార్డు పాయింట్లను అందిస్తాయి. మరికొన్ని క్రెడిట్‌కార్డులు కొనుగోళ్లపై 2x నుంచి 5x రివార్డ్ పాయింట్లను అందిస్తాయి లేదా సాధారణ క్రెడిట్ కార్లు కంటే ప్రతి రివార్డ్ పాయింట్‌కి అధిక నగదు విలువను అందిస్తాయి.

ఇవీ గుర్తుంచుకోండి..

క్రెడిట్‌ కార్డులు సరిగ్గా, తెలివిగా ఉపయోగించినట్లయితే పండగ సీజన్లో పొదుపు చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే ఖర్చు చేసేటప్పుడు ఒక విషయం గుర్తించుకోవాలి. మీ క్రెడిట్‌ పరిమితిని మించకుండా చూసుకోవాలి. మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటే కొనుగోళ్లను ఒకే కార్డుపై కాకుండా బిల్లింగ్‌ సైకిల్‌, అవి అందించే ఆఫర్లను అనుసరించి కొనుగోళ్లు చేయండి. అలాగే క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో (CUR).. 30 శాతం మించకుండా చూసుకోండి. మీ మొత్తం క్రెడిట్‌ పరిమితిలో మీరు ఉపయోగించిన మొత్తమే, క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో. సీయూఆర్‌ పెరిగితే.. ఇది మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు