స్థిరాస్తి అమ్ముతున్నారా? ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలివే!

స్తిరాస్థి విక్ర‌యం భారీ లాభాలతో పాటు ప‌న్నులను ఆక‌ర్షిస్తుంది. ప‌న్ను ఆదా దిశ‌గా చ‌ర్య‌లేమిటో చూద్దాం.

Published : 16 Dec 2020 15:43 IST

స్థిరాస్తికి ఉన్న డిమాండు అంతా ఇంతా కాదు. పెరుగుతోన్న జ‌నాభా అందుకు మ‌రింత ఊత‌మిస్తోంది. దీర్ఘ‌కాలంలో మంచి లాభాలు సంపాదించాల‌నే ఆశ‌తో చాలా మంది స్థిరాస్తి రంగంలో పెట్టుబ‌డులను పెడుతుంటారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు అధిక రాబ‌డిని తీసుకొచ్చాయి. రాబ‌డికి త‌గ్గ‌ట్టే మూల‌ధ‌న లాభాల‌పై ప‌న్ను వ‌సూలు అధికంగానే ఉంటుంది. స్తిరాస్తి విక్ర‌యించే ముందే మూల‌ధ‌న లాభంపై స‌మాలోచ‌న‌లు జ‌ర‌పాలి.

స్తిరాస్తి అమ్మ‌కం - ప‌న్ను వ‌ర్తింపు

ఏదైనా స్తిరాస్థిని కొనుగోలు చేసిన రెండేళ్ల లోపు అమ్మితే వ‌చ్చే లాభాల‌పై స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న లాభాల‌ (షార్ట్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్‌) ప‌న్ను విధిస్తారు. అదే విధంగా రెండేళ్ల పైన స్తిరాస్థి క‌లిగి ఉండి దానిని విక్ర‌యిస్తే గ‌నుక దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభాల (లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్‌) ప‌న్నును చెల్లించాల్సి ఉంటుంది. స్వ‌ల్పకాల మూల‌ధ‌న లాభాలపై ప‌న్నును లెక్కించేందుకు లాభాల‌ను ప‌న్ను చెల్లింపుదారు ఆదాయానికి జ‌త‌చేస్తారు. ప‌న్ను చెల్లింపుదారు శ్లాబును బ‌ట్టి ప‌న్ను నిర్ణ‌య‌మ‌వుతుంది. లాంగ్‌ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్ విష‌యంలో మాత్రం వ్య‌క్తి ఆదాయ‌పు ప‌న్ను శ్లాబుకు సంబంధం లేకుండా మూల‌ధ‌న లాభంపై 20శాతం ప‌న్ను వ‌సూలు చేస్తారు.

దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నుపై పాక్షికంగా లేదా పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ చ‌ట్టంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం…

మరో ఇల్లు కొనుగోలు చేస్తే…

మూల‌ధ‌న ఆస్తుల‌ను అమ్మ‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌కు సెక్ష‌న్ 54(ఎఫ్‌) కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే సెక్ష‌న్ 54(ఎఫ్‌) ప్ర‌కారం ఇలా వ‌చ్చిన లాభాల‌ను మ‌రో నివాస గృహాన్ని కొనుగోలుకు ఉప‌యోగించాలి. అప్పుడే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

  • స్తిరాస్థిని అమ్మగా వ‌చ్చిన లాభాల‌తో రెండేళ్ల‌లోపు నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే ప‌న్ను మినహాయింపు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.
  • నిర్మాణంలో ఉన్న నివాస స్థ‌లంపై పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే… మూల‌ధ‌న ఆస్తిని విక్ర‌యించిన మూడేళ్ల‌లోగా ఆ ప‌నిచేయాలి.
  • ఐటీ శాఖ వారి దృష్టిలో నూత‌న నివాసంపై చేసిన పెట్టుబ‌డి మూడేళ్ల దాకా లాక్ ఇన్ అయి ఉంటుంది. కాబట్టి కొత్త ఇంటిని కొని మూడేళ్ల లోపు అమ్మేదానికి వీల్లేదు. ఒక వేళ అలా చేస్తే గ‌నుక మీ మూల‌ధ‌న ఆస్తిపై తొలుత ఏదైతే లాభం వ‌చ్చి, దానిపై ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందారో అదంతా కోల్పోవాల్సి ఉంటుంది.
  • పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం పొందాల‌నుకునే వారికి కేవలం ఒక్క సొంత ఇల్లు మాత్రమే ఉండాలి అలా కాకుండా రెండు, మూడు ఇళ్లు ఉన్న‌వారికి సెక్ష‌న్ 54(ఎఫ్‌) వ‌ర్తించ‌దు.

క్యాపిట‌ల్ గెయిన్స్ బాండ్స్‌లో పెట్టుబ‌డిః

మూల‌ధ‌న ఆస్తిని విక్ర‌యించిన ఆరు నెల‌ల లోపు బాండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే సెక్ష‌న్ 54 (ఈసీ) కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. గ్రామీణ విద్యుత్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఆర్‌.ఇ.సి.)/ జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ‌(ఎన్‌.హెచ్‌.ఏ.ఐ) లాంటివి జారీచేసే బాండ్ల‌లో మూల‌ధ‌న ఆస్తి విక్ర‌య లాభాల‌ను పెట్ట‌వ‌చ్చు. ఈ బాండ్ల కాల‌ప‌రిమితి మూడేళ్లు. 6శాతం వార్షిక వ‌డ్డీని చెల్లిస్తారు. ఒక ఏడాదికిగాను ఈ బాండ్ల‌లో గ‌రిష్టంగా రూ.50ల‌క్ష‌ల మేర‌కు సొమ్ము జ‌మ‌చేయ‌వ‌చ్చు. అయితే ఈ బాండ్ల‌పై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను ఉంటుంది. టీడీఎస్ రూపంలో మూలం వ‌ద్ద ప‌న్ను కోత ఉంటుంది.

క్యాపిట‌ల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ః

స్తిరాస్థిని విక్ర‌యించిన మూడేళ్ల‌లోపు మ‌రో ఇంటిని కొనుగోలు చేయ‌లేక‌పోయినా లేదా కొత్త ఇంటిని నిర్మించుకోలేక‌పోయినా ప‌రిస్తితి ఏమిటి? ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోవాల్సిందేనా? అంటే కాద‌నే చెబుతాయి ఆదాయ శాఖ‌లోని కొన్ని వెసులుబాట్లు. ఇలాంటి వారి కోస‌మే ప్ర‌త్యేకంగా మూల‌ధ‌న లాభాల ఖాతా ప‌థ‌కం(క్యాపిట‌ల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌) అనేది ఒక‌టుంది. ఈ ఖాతాను ఏదైనా ప్ర‌భుత్వ రంగానికి చెందిన బ్యాంకు ద్వారా తెర‌వ‌వ‌చ్చు.

ఈ ఖాతా రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి పొదుపు ఖాతా, మ‌రొక‌టి ట‌ర్మ్ డిపాజిట్ ఖాతా. వీటిపై జ‌మ అయ్యే వ‌డ్డీ సాధార‌ణ పొదుపు, ట‌ర్మ్ ఖాతాల మాదిరే ఉంటాయి. అయితే కొంత కాలం వ‌ర‌కూ వీటిలోని సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం లేదు. వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. టీడీఎస్ రూపంలో మూలం వ‌ద్ద ప‌న్ను కోత విధిస్తారు. ఈ క్యాపిట‌ల్ గెయిన్స్ అకౌంట్‌ తాత్కాలిక ఖాతా మాత్ర‌మే. మ‌రో ఇంటిని కొనుగోలు చేయ‌డానికి / నిర్మించ‌డానికి మాత్ర‌మే ఈ ఖాతాలోని సొమ్మును ఇస్తారు.

Source
Zen.png

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని