Digital Payments: డిజిట‌ల్ చెల్లింపుల్లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు - ప‌రిష్కారాలు 

ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేట‌ప్పుడు ఎదుర‌య్యే స‌మ‌స్యలు వాటి ప‌రిష్కారాల‌ను తెలుసుకుందాం. 

Updated : 31 Dec 2021 16:34 IST

ప్ర‌స్తుతం షాపింగ్ వెళ్లాలంటే నగదు జేబులో పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు. ఫోన్‌(చరవాణి) చేతిలో ఉంటే చాలు షాపింగ్ ద‌గ్గ‌ర నుంచి సినిమా వ‌ర‌కు, కూర‌గాయ‌ల ద‌గ్గ‌ర నుంచి కిరాణా స‌రుకుల వ‌ర‌కు, అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అంతేనా ఫోన్ రీఛార్జ్ ద‌గ్గ‌ర నుంచి విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, కేబుల్ బిల్లు వంటివ‌న్ని ఇల్లు క‌ద‌ల‌కుండానే చెల్లించేయచ్చు. కేవలం ఒక క్లిక్‌తో చెల్లింపులు సుల‌భం కావ‌డంతో అంద‌రికి దీనిపై ఆస‌క్తి పెరిగింది. అయితే కొన్నిసార్లు తప్పు ఖాతాకు డబ్బు బదిలీ చేయడం లేదా విఫలమైన లావాదేవీలు వంటి కొన్ని సమస్యలు కూడా ఆన్‌లైన్ లావాదేవీల్లో ఎదుర‌వుతాయి. మ‌రి ఇటువంటి స‌మ‌స్యలు ఎదుర‌య్యిన‌ప్పుడు ఎలా ప‌రిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

రెండు సార్లు న‌గ‌దు డెబిట్ కావ‌డం: డిజిట‌ల్ చెల్లింపుల్లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్లో ఒకటి డబుల్ డెబిట్. అంటే ఒకే లావాదేవీకి రెండుసార్లు డ‌బ్బు డెబిట్ కావ‌డం. చాలా సార్లు, డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు, మీ లావాదేవీలు విఫ‌ల‌మ‌వుతుంటాయి. అప్పుడు మీరు మళ్ళీ లావాదేవీని చేస్తారు. కానీ ఆ మొత్తం ఖాతా నుంచి రెండుసార్లు డెబిట్ అవుతుంది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం.. మీరు ఏ వ్యాపార సంస్థ వద్ద అయితే చెల్లింపులు చేశారో వారిని సంప్ర‌దించి రెండు సార్లు డెబిట్ అయిన‌ట్లు చూపిస్తే, వారు బ్యాంకును సంప్ర‌దించి తిరిగి మీ డ‌బ్బు మీకు డిపాజిట్ చేస్తారు. కొన్నిసార్లు క‌స్ట‌మ‌ర్ కేర్‌ను సంప్ర‌దించి దీని గురించి అడ‌గాల్సి వ‌స్తుంది. 

క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీక‌రించ‌కపోవ‌డం: ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు వ్యాపారులు  వారి టెర్నిన‌ల్స్ వ‌ద్ద అన్ని ర‌కాల కార్డుల‌ను  అనుమ‌తిస్తున్నారు.  అయిన‌ప్ప‌టికీ కొన్ని చోట్ల‌ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మాత్రమే ప‌నిచేస్తాయి. దీంతో చెల్లింపుల స‌మ‌యంలో వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డే అవకాశం ఉంది. కాబ‌ట్టి ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడటాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యాపారులు వారి టెర్మినల్స్‌లో అన్ని కార్డులు ప‌నిచేసే విధానంపై శ్ర‌ద్ధ పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలుస్తోంది.

ఈఎంఐ లావాదేవీలు:ఈఎమ్ఐ చెల్లిస్తున్న‌ప్పుడు ఒక్కోసారి మీ ఖాతాలో డ‌బ్బు డెబిట్ అవుతుంది కానీ, అది ఈఎంఐ గా మార్చబడదు. ఇందులో భయపడటానికి ఏమీ లేదు. మీరు చేయవలసిందల్లా మీ బ్యాంకును సంప్ర‌దించి ఈఎంఐగా బ‌దిలీ చేయ‌మ‌ని కోరితే స‌రిపోతుంది.

త‌ప్పు సంఖ్య ఎంట‌ర్ చేయ‌డం: ఒక్కోసారి మీరు చెల్లించాల్సిన మొత్తం త‌ప్పుగా ఎంట‌ర్ చేస్తుంటారు. అప్పుడు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. వెంట‌నే ఆ లావాదేవీని ర‌ద్దు చేసి కొత్త‌గా మ‌రోసారి చేస్తే స‌రిపోతుంది. డిజిట‌ల్ చెల్లింపులతో మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది.

కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్: పరికరం, చెల్లింపుల టెర్మినల్ మధ్య భౌతిక సంబంధం అవసరం లేని లావాదేవీని కాంటాక్ట్‌లెస్ చెల్లింపు అంటారు, కాని కాంటాక్ట్‌లెస్ చెల్లింపు అందుబాటులో లేకుంటే చెల్లింపు కోసం మీరు కార్డును స్వైప్ చేయవచ్చు.

ముగింపు: ఫిన్‌టెక్ కంపెనీలు, అగ్రిగేటర్లు, బ్యాంకింగ్ అధికారులు అందరూ డిజిటల్ చెల్లింపుల సంబంధిత సేవ‌ల‌ను మెరుగైన విధానంలో అందిస్తూ.. వినియోగదారుల సౌలభ్యం, నమ్మకం, విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ రంగం డిజిటల్ సంస్థ‌ల‌కు అపారమైన అవకాశాలను అందిస్తుంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు