పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకుంటున్నారా? అయితే ఇది చ‌ద‌వండి

మార్కెట్ పడినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్మకాలు చేయడం మన ఉద్దేశం కాకూడ‌దు....

Published : 23 Dec 2020 15:49 IST

మార్కెట్ పడినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్మకాలు చేయడం మన ఉద్దేశం కాకూడ‌దు

దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాలైన పిల్లల చదువులు, పదవీవిరమణ నిధి వంటి వాటి కోసం చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల‌ లో మదుపు చేయాలనుకుంటున్నారు . తక్కువకు పడిపోయిన ప్రస్తుత మార్కెట్ ను అవకాశంగా తీసుకోదలిచారు. దీర్ఘకాలం మదుపు చేయాలనుకున్నప్పుడు , ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకంటే , ఎంత త్వరగా మదుపు చేయడం మొదలుపెట్టామా అన్నది ముఖ్యం. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్మకాలు చేయడం మన ఉద్దేశ్యం కాదు కాబట్టి.

అత్యవసర నిధి:
మీ జీతాల్లో లేదా ఉద్యోగాల్లో కోత పడొచ్చు. అటువంటి సమయంలో మీకు, మీపై ఆధారపడిన వారి ఖర్చుల కోసం 6-12 నెలలకు అవసరమైన డబ్బును అత్యవసర నిధి కింద ఉంచాలి.

జీవిత బీమా :
మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్ ఆర్ధిక అవసరాల కోసం , మీ పేరున టర్మ్ జీవిత బీమా పాలసీని తీసుకోవాలి .

ఆరోగ్య బీమా :
మీకు, మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక బేసిక్ పాలసీ , అదనంగా సూపర్ టాప్-అప్ పాలసీ తీసుకోవాలి. తరువాత మీ ఆర్ధిక లక్ష్యాలను విడివిడిగా రాయాలి . ప్రతి లక్ష్యానికి ఇప్పటినుంచి ఎంత సమయం వుందో రాయాలి. వాటి ప్రస్తుత ఖర్చు ఎంత , ద్రవ్యోల్బణాన్ని పరిగణించి , మీకు డబ్బు అవసరమైన నాటికి ఎంత సమకూర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పటినుంచి నెలకు ఎంత మొత్తం ఏ పథకాలలో జమ చేయాలో తెలుసుకోవాలి.

ఉదా : ఇప్పుడు మీ వయసు 30 ఏళ్ళు . 60ఏళ్ల వయసులో పదవీవిరమణ తీసుకోదలిచారు. అంటే 30 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుత మీ నెలసరి ఖర్చులు రూ 20 వేలు. ద్రవ్యోల్బణాన్ని 6 శాతంగా పరిగణిస్తే, 30 ఏళ్ల తరువాత మీ నెలసరి ఖర్చులు రూ.1.20 లక్షలు గా వుంటాయి .

స్వల్పకాలిక లక్ష్యాలు అంటే 5 ఏళ్ల లోపు కాలానికి బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్ల‌ లో కూడా, ఏడాది కంటే తక్కువ కాలానికి లిక్విడ్ , లేదా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఎంచుకునే ముందు మీ రిస్క్ సామర్ధ్యాన్ని, లక్ష్యాన్ని చేరటానికి ఉన్న సమయాన్ని పరిగణించాలి . 5 నుంచి 7 ఏళ్ల సమయం ఉండి , కొంచెం రిస్క్ తీసుకునేవారయితే లార్జ్ కాప్ ఫండ్స్ , ఇదే కాలానికి ఒక మోస్తరుగా రిస్క్ తీసుకునేవారయితే మల్టీ కాప్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఒకవేళ 7-10 ఏళ్ల సమయం ఉండి , అధిక రిస్క్ తీసుకోగలవారయితే మిడ్ కాప్ ఫండ్స్ పెట్టుబడి చేయొచ్చు.

కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి మొదలుపెట్టదలుచుకున్న వారు , ఫండ్స్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ ప్లాన్ లలో చేయరాదు. ఎందుకంటే ఆ ఫండ్స్ గురించి అవగాహన ఉండదు. ఇక్కడ అక్కడ సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని పెట్టుబడి చేస్తే ఫలితం ఉండదు. అందువలన ముందుగా అడ్వైజర్ సలహా తో పెట్టుబడి చేయడం మంచిది. ఆర్థిక స‌ల‌హాదారులు మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా , రిస్క్ సామర్ధ్యాన్ని గుర్తించి ఫండ్స్ సూచిస్తారు .

చివరి మాట :
ముందుగా అడ్వైజర్ సహాయంతో పెట్టుబడి మొదలు పెట్టి, కొంత అవగాహన వచ్చిన తరువాత మీరు సొంతంగా చేయొచ్చు. మొదటినుంచీ అవగాహనా లేమితో డబ్బు నష్టపోయే ప్రమాదం వుంది . అలాగే అవగాహన / అనుభవం లేని ఇరుగుపొరుగు వారి సలహాలతో పెట్టుబడులు చేయరాదు . నష్టపోతే వారిని బాధ్యులు చేయలేము. ఫీజు తీసుకున్న స‌ల‌హాదారునికి క జవాబుదారి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని