SBI: పెన్షనర్లు వీడియోకాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ ఎలా సమర్పించాలి?

ఎస్‌బీఐలో పెన్షన్‌ పొందేవారు వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ (జీవన్‌ ప్రమాణ్‌) దశలవారీగా సమర్పించే విధానం తెలుసుకుందాం.

Updated : 16 Nov 2022 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐలో పెన్షన్‌ పొందే పెన్షనర్లు వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ (VLC) సదుపాయం ద్వారా జీవన్‌ ప్రమాణ్‌ ప్రక్రియను బ్యాంకు శాఖను సందర్శించకుండా చాలా సులభంగా చేయొచ్చు. ఈ పద్ధతి సురక్షితం, కాగిత రహితం. ఈ సేవ ఉచితంగానే లభిస్తుంది. ఎస్‌బీఐలో పెన్షన్‌ పొందుతున్న కుటుంబ పెన్షనర్లతో సహా సీనియర్‌ సిటిజన్లు తమ ఇంటిదగ్గర నుంచే VLCను సమర్పించొచ్చు. ఎస్‌బీఐ ద్వారా ప్రాసెస్‌ అయ్యి పెన్షన్‌ అందుకునే పబ్లిక్‌ పెన్షనర్లందరికీ VLC సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే, VLCకు అర్హత పొందాలంటే పెన్షనర్‌ తన జీవిత ధ్రువీకరణ పత్రాన్ని(జీవన్‌ ప్రమాణ్‌) మునుపటి సంవత్సరంలో కూడా సమర్పించి ఉండాలి. భారత్‌లో నివసిస్తున్నవారై ఉండాలి. పెన్షను బ్యాంకు ఖాతాతో ఆధార్‌ లింక్‌ అయి ఉండాలి. VLCను సమర్పించడానికి స్థిరమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్‌ఫోన్‌/ టాబ్లెట్‌/ ల్యాప్‌టాప్‌/ పీసీ (వెబ్‌ కెమెరాతో పాటు హెడ్‌ఫోన్‌లతో) ఉండాలి. ఆటంకాలు లేని వెలుతురు ఉన్న ప్రదేశం నుంచి వీడియో కాల్‌ చేయాలి.

పెన్షనర్లు వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించడానికి దశలు

  • SBI PensionSeva వెబ్‌సైట్‌ను సందర్శించి,  'VideoLC' లింక్‌పై క్లిక్‌ చేయాలి. SBI PensionSeva మొబైల్‌ యాప్‌లో అయితే స్క్రీన్ పై ఉన్న 'వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌' బటన్‌పై క్లిక్‌ చేయండి.
  • పెన్షన్‌ క్రెడిట్‌ అయ్యే బ్యాంకు ఖాతా నంబర్‌ నమోదు చేయాలి. VLC కోసం ఆధార్‌ డేటాను ఉపయోగించడానికి బ్యాంకుకు అవకాశం ఇవ్వడానికి చెక్‌బాక్స్‌ను టిక్‌ చేసి, 'వాలిడేట్‌ అకౌంట్‌' బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • VLCకు అర్హత కలిగి ఉంటే.. మీ ఆధార్‌తో లింక్‌ అయిన రిజిస్టర్డ్‌ మొబైల్‌లో మీరు OTP అందుకుంటారు. ఆ OTPని నమోదు చేయాలి.
  • కొన్ని మాండేటరీ సర్టిఫికెట్స్‌ నిర్ధారణ అడుగుతుంది. నిర్ధారించడానికి అక్కడ ఉన్న బాక్స్‌లను క్లిక్‌ చేయాలి.
  • డ్రాప్‌ డౌన్‌లో లిస్టయిన అన్ని మాండేటరీ సర్టిఫికెట్‌లను సమర్పించాలి. VLC ల్యాండింగ్‌ పేజీకి వెళ్లడానికి 'Proceed' బటన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత VLC సైట్‌లో ఇచ్చిన సూచనలను అనుసరించాలి.
  • ఆ తర్వాత అందుబాటులో ఉన్న స్లాట్‌ కోసం వేచి ఉండొచ్చు లేదా అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేయొచ్చు. మీరు షెడ్యుల్‌ కాల్‌ ఎంచుకుంటే, అనుకూలమైన తేదీ, టైమ్‌ స్లాట్‌ను ఎంచుకుని ఆపై 'షెడ్యూల్‌' బటన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. ఎంచుకున్న అపాయింట్‌మెంట్‌ స్లాట్‌ను బ్యాంకు నిర్ధారిస్తుంది. ఇది మీ నమోదిత మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, మెయిల్‌ ఐడీకి ఇ-మెయిల్‌ వస్తుంది.
  • షెడ్యూల్‌ చేసిన తేదీలో సమయానికి 5 నిమిషాల ముందే వీడియో కాల్‌లో చేరాలి. అవసరం అయితే మళ్లీ రీ-షెడ్యూల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వీడియో కాల్‌లో చేరిన తర్వాత, బ్యాంకు అధికారి మీతో కనెక్ట్‌ అయ్యేవరకు వేచి ఉండాలి.
  • బ్యాంకు అధికారి సెషన్‌లో చేరిన తర్వాత, మీరు డిక్లరేషన్‌ పేజీకి వెళతారు. మీకు వర్తించే నిబంధనలు, షరతులను అంగీకరించమని అడుగుతారు. మీరు వీటిని అంగీకరిస్తే.. చెక్‌ బాక్స్‌ ద్వారా మీ సమ్మతిని తెలిపి, స్టార్ట్ వీడియో కాల్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత మీరు తదుపరి స్క్రీన్‌కు వెళతారు. ఇది బ్యాంకు అధికారులు ఉండే వెయిటింగ్‌ రూమ్‌.
  • వీడియో సెషన్‌లో చేరిన తర్వాత, మీరు కాల్‌లో ధ్రువీకరణ కోడ్‌ను చదవాలి. మీ పాన్‌ కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పెన్షనర్‌ మొబైల్‌ ద్వారా సైట్‌ను సందర్శిస్తే.. వెనుక కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది.
  • పాన్‌ ధ్రువీకరణ తర్వాత, బ్యాంకు అధికారి మీ ముఖం స్పష్టంగా క్యాప్చర్‌ అయ్యేలా కెమెరాను పట్టుకోమని మిమ్మల్ని అడుగుతారు. ముఖం క్యాప్చర్‌ అయ్యాక సెషన్‌ ముగిస్తుంది. సమాచారం రికార్డు అయిందని మీకు మెసేజ్‌ వస్తుంది. VLCకు సంబంధించిన స్టేటస్ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts