Credit cards: క్రెడిట్‌ కార్డులు.. ఇలా వాడితే లాభం..

ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అవసరాలు, సౌలభ్యం మాట ఎలా ఉన్నా.. వీటిని నిర్వహించడంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.

Updated : 14 Jun 2024 08:54 IST

ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అవసరాలు, సౌలభ్యం మాట ఎలా ఉన్నా.. వీటిని నిర్వహించడంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. అధిక వడ్డీ రేట్లు భారంగా మారతాయి. క్రెడిట్‌ కార్డుల నుంచి గరిష్ఠ ప్రయోజనాలు పొందాలంటే వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

రెండు మూడు క్రెడిట్‌ కార్డులున్నప్పుడు ఆర్థికంగా కాస్త భరోసాగానే ఉంటుంది. కానీ, ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పుడూ చేయొద్దన్న విషయం తెలిసిందే. ఏ కార్డులో ఎంత పరిమితి ఉంది, అందులో ఏ అవసరానికి ఏది వాడాలి అనేది ముందుగా ఒక ప్రణాళిక వేసుకోవాలి. బిల్లుల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు, వినోదం కోసం ఖర్చులు.. ఇలా విడివిడిగా బడ్జెట్‌ ఉండాలి. దాని ప్రకారమే కార్డులను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. మీరు ప్రతి నెలా ఎంత ఖర్చు చేస్తారన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. అప్పుడే బిల్లుల చెలింపు సులభం అవుతుంది. 

 • ప్రతి క్రెడిట్‌ కార్డుపై నిర్వహించే లావాదేవీలకు కచ్చితంగా సందేశాలు వచ్చేలా చూసుకోవాలి. బిల్లు చెల్లింపు గడువు ఎప్పుడుందన్న విషయాన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. 
 • క్రెడిట్‌ కార్డు పరిమితిని మించి వినియోగించినప్పుడూ హెచ్చరిక సందేశాలు రావాలి. 
 • రెండు మూడు క్రెడిట్‌ కార్డుల గడువును గుర్తుంచుకొని, బిల్లును చెల్లించడం కష్టం కావచ్చు. కాబట్టి, మీ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా గడువు తేదీకి ఒక రోజు ముందే చెల్లింపులు జరిగేలా ఆటోమేట్‌ చేయండి. దీనివల్ల రుసుముల భాధ తప్పుతుంది. 
 • బిల్లును గడువు తేదీలోగా చెల్లించకుంటే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుందన్న సంగతిని గుర్తుంచుకోండి.
 • రెండు మూడు క్రెడిట్‌ కార్డుల వరకూ ఇబ్బంది లేదు. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. చాలా కార్డులున్నప్పుడు.. రుసుములు, ఇతర ఖర్చుల రూపంలో ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్క కార్డు చెల్లింపులను సమయానికి చేయకపోయినా, మొత్తం మీ రుణ చరిత్రపైన ప్రభావం పడుతుంది. 
 • క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్లను క్రమం తప్పకుండా పరిశీలించడం మంచి అలవాటు. ఏమైనా అనధికార లావాదేవీలను గుర్తిస్తే వెంటనే కార్డు సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయాలి. 
 • క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పేరుమీద కార్డులు, రుణాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి మోసపూరిత లావాదేవీలు కనిపిస్తే వెంటనే క్రెడిట్‌ బ్యూరోలకు నివేదించాలి. 
 • క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి, ఎప్పుడూ నగదును తీసుకోవద్దు. అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు.
 • రుణాలను తీసుకునేటప్పుడూ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. క్రెడిట్‌ కార్డు నుంచి రుణం తీసుకున్నప్పుడు దాదాపు 19-24 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.
 • రివార్డులను పరిశీలిస్తూ ఉండాలి. అధికంగా ఉన్న రివార్డులను సమయానుకూలంగా వినియోగించుకోవాలి. నగదు వెనక్కి, డిస్కౌంట్‌లు, రివార్డుల్లాంటివి ఏ కార్డుపై ఎలా ఉన్నాయన్న అవగాహన ఉండాలి. 
 • కొనుగోళ్లు చేసేటప్పుడు రివార్డు పాయింట్లను వ్యూహాత్మకంగా వినియోగించాలి. రివార్డులను సంపాదించడం కోసం ఎక్కువ ఖర్చు చేయొద్దు.
 • క్రెడిట్‌ కార్డులకు ఫీజులు, వార్షిక రుసుముల్లాంటివి ఉంటాయి. అధికంగా కార్డులుంటే.. ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి, అధిక పరిమితి ఉన్న కార్డులను అట్టిపెట్టుకొని, మిగతా వాటిని రద్దు చేసుకోవడమే మంచిది.
 • కార్డులపై ఉన్న పరిమితిలో 30 శాతానికి మించి ఎప్పుడూ వాడకుండా చూసుకోండి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని