Bonus: పండగ బోనస్‌ వచ్చిందా?.. ఈ పనులు చేయడానికి ప్రయత్నించండి..

పండుగ బోనస్‌ను ఖర్చులకు కాకుండా వివేకంతో పెట్టుబడులకు మళ్లిస్తే ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చంటున్నారు నిపుణులు. 

Updated : 07 Oct 2022 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా, దీపావళి పండగలు ప్రతీ సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని తెస్తుంటాయి. ఇంటిల్లిపాది కలిసి జరుపుకొనే ఈ పండగల సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇదే సమయంలో సంస్థలు కూడా ఉద్యోగులకు బోనస్‌ రూపంలో ప్రొత్సాహకాలను అందిస్తుంటాయి. ఇవి పండగ వేడుకలను మరింత గొప్పగా జరుపుకొనేందుకు తోడ్పడతాయి. అయితే పండగ బోనస్‌లను అనవసర ఖర్చులకు కాకుండా వివేకంతో పెట్టుబడులకు మళ్లిస్తే ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చంటున్నారు నిపుణులు. 

రుణాలు తీర్చేయండి..

రుణాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆర్థికంగా నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణం తీసుకోకపోవడమే మంచిది. ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నా పర్వాలేదు. కానీ, సరైన ప్రణాళిక ఉండాలి. ముందుగా మీ రుణాల (ఇల్లు, వాహన, వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు రుణం, స్నేహితులు/బంధువుల వద్ద తీసుకున్న రుణాలు) జాబితాను తయారు చేయండి. ఇందులో అధిక వడ్డీ చెల్లించే రుణాలను బోనస్‌తో చెల్లించండి. దీంతో రుణ భారం తగ్గుతుంది. ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆర్‌బీఐ రెపోరేటును పెంచ‌డంతో బ్యాంకులు కూడా రుణాలపై రేట్ల‌ను పెంచుతున్నాయి. దీంతో ఇప్ప‌టికే గృహ రుణం తీసుకున్న‌వారికి కూడా ఈఎంఐ చెల్లింపులు భారం అవుతున్నాయి. ఈ బోన‌స్‌తో కొంత రుణం చెల్లించ‌డం ద్వారా ఈఎంఐ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. 

దీర్ఘకాలిక పెట్టుబడులు..

రుణాలు లేని వారు ఈ మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టవచ్చు. ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో పెట్టుబడి పెడుతున్నవారు బోనస్‌ ఉపయోగించి అదనపు యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఏకమొత్తంగా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ యూనిట్లను సమకూర్చుకోగలుగుతారు. ఇవి దీర్ఘకాలంలో సంపద సృష్టికి తోడ్పడతాయి. 

బంగారంలో పెట్టుబడులు..

మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో బంగారంపై కేటాయింపులు లేక‌పోతే బోనస్‌తో కొంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడుల కోణంలో ఆలోచించేవారు, ఆభరణాల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసేకంటే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ పసిడి పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. బంగారంపై దీర్ఘకాలంలో 5 నుంచి 10 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే, సార్వభౌమ పసిడి పథకంలో మూలధన ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

అత్యవసర నిధి..

ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో (ఉద్యోగం కోల్పోవడం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇతర సంక్షోభాలు) అత్యవసర నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయానికి కనీసం 6 నుంచి 12 రెట్లు సమానమైన అత్యవసర నిధిని కలిగి ఉండాలి. ఉదాహరణకు మీ నికర జీతం (నెలకు) రూ. 50 వేలు అయితే మీకు అత్యవసర నిధిగా రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉండాలి. ఒకవేళ మీ కార్పస్‌లో నిధులు తక్కువగా ఉంటే.. పెంచుకునేందుకు బోనస్‌ను ఈ నిధికి మళ్లించడం మంచిది. ఇందుకోసం లిక్విడ్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. 

బీమా కవరేజీ పెంచుకోవచ్చు..

జీవిత, ఆరోగ్య బీమాలు.. కుటుంబ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తాయి. మీ వార్షిక ఆదాయానికి 12-15 రెట్లు జీవిత బీమా హామీ ఉండాలి. అలాగే, కుటుంబ వైద్య చరిత్ర ఆధారంగా ఆరోగ్య బీమా కవరేజీ ఉండాలి. ఒకసారి వీటిని సమీక్షించి మీ అవసరాలకు తగినట్లుగా లేవు అనుకుంటే.. పెంచుకునే ప్రయత్నం చేయండి. 

ఖరీదైన వస్తువుల కొనుగోలు..

జీవన ప్రమాణాలను పెంచుకునేందుకు మీరు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువుల కొనుగోలును వాయిదా వేసి ఉండొచ్చు. ఈ దసరా, దీపావళి సమయంలో గృహోపకరణాలపై అనేక ఆఫర్లు వస్తుంటాయి. ఇదే సమయంలో బోనస్‌ కూడా వస్తుంది కాబట్టి వాషింగ్‌ మెషీన్‌, రిఫ్రిజిరేటర్‌, ల్యాప్‌టాప్‌, టూ-వీలర్‌ వంటి వాటిని కొనుగోలు చేయవచ్చు. లేదా ఇంటిని రిపేరు, మెరుగుపర్చడం వంటి వాటికి ఉపయోగించవచ్చు. 

నైపుణ్యం కోసం..

ఉద్యోగుల తమ ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయిలను చేరుకోవాలంటే తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. దీనికి కావాల్సిన కోర్సులను అభ్యసించేందుకు కొంత మొత్తం ఖర్చు కావచ్చు. ఇలా బోనస్‌ వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని కెరియర్‌ గ్రోత్‌ కోసం ఖర్చు చేయవచ్చు. 

చివరిగా..

పండగుల సమయంలో వ్యాపారులు మ వ్యాపార వృద్ధి కోసం అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఇదే సమయంలో జీతంతో పాటు బోనస్‌ రూపంలో డబ్బు చేతికందడంతో  చాలా మంది కొనుగోళ్లు చేసేందుకు ఏ మాత్రం ఆలోచించరు. ఇది మీ ఆర్థికతను దెబ్బతీస్తుంది. అందువల్ల బోనస్‌ను ఖర్చు చేసే ముందు తెలివిగా ఆలోచించండి. ఈ పండగ బోనస్‌తో ఎలా సంపదను సృష్టించుకోవచ్చో.. అటువైపు అడుగులు వేయండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని