Meta AI: సమాచారం కావాలంటే.. ఇక వాట్సప్‌లో సెర్చ్‌ చేయొచ్చు!

Meta AI: వాట్సప్‌లో ఏఐ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ సమాచారం అయిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలుపడుతుంది.

Updated : 01 Jul 2024 14:44 IST

Meta AI | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటిగా మాట్లాడుతుంటాం.. ఇంతలో తెలీని ఏదో అంశం గురించి చర్చ. వెంటనే దానికోసం వాట్సప్‌ (Whatsapp) ఓపెన్‌ చేస్తే చాలు. క్షణాల్లో ఆ సమాచారం మీ ముందుంటుంది. కుటుంబసభ్యులతో చాట్‌ చేస్తున్నాం. ఇంతలో ‘నా పరిస్థితి ఇదీ’ అని తెలియజేయడానికి ఒక ఇమేజ్‌ పంపించాలి. అందుకు ఇకపై పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్‌ వాట్సప్ ఓపెన్‌ చేస్తే చాలు. అంతేకాదు.. ఏదైనా లెటర్‌ రాయాలన్నా, రెజ్యూమె ప్రిపరేషన్‌లో టిప్స్‌ కావాలన్నా ఇకపై వాట్సప్‌ని అడిగితే చాలు.. సమస్త సమాచారం మీ ముందు ఉంచుతుంది. ఇందుకోసం వాట్సప్‌ మాతృసంస్థ మెటా.. మెటా ఏఐని (Meta AI) తీసుకొచ్చింది. ఇంతకీ ఏమిటీ మెటా ఏఐ. దీంతో ఏమేం చేయొచ్చు..?

వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో మెటా సంస్థ ఈ ఏఐని తీసుకొచ్చింది. ఇందులోభాగంగా వాట్సప్‌లో ఇప్పటికే చాలామందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లకు కుడివైపు కింది భాగంలో ఒక రింగ్‌ లాంటి సింబల్‌ దర్శనమిస్తుంది. ఐఫోన్‌ యూజర్లకు అయితే డిస్‌ప్లే పైభాగంలో కెమెరా ఐకాన్‌ పక్కన ఈ ఆప్షన్ కనిపిస్తుంది. వెబ్‌ వాట్సప్‌లోనూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ పిక్‌ పక్కనే కనిపిస్తుంది.

కల్కి కలెక్షన్ల నుంచి రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ దాకా..

  • వాట్సప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ సదుపాయంతో మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు. అందుకోసం రింగులాంటి సింబల్‌పై క్లిక్‌ చేస్తే చాలు ఒక చాట్‌ స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది. దాంట్లోకి వెళ్లి మీకు కావాల్సిన అంశాన్ని వెతకొచ్చు. ఉదాహరణకు ప్రభాస్‌ కొత్త చిత్రం ‘కల్కి’ కలెక్షన్ల గురించి తెలుసుకోవాలనుకుంటే చాలు.. ఆ అంశాన్ని సెర్చ్ చేస్తే చాలు. ఆ వివరాలను మీ ముందుంచుతుంది. ఆన్‌లైన్‌ దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే రిఫరెన్సు లింకులను కూడా ఇస్తుంది.

  • రోహిత్‌శర్మ టీ20 వరల్డ్‌కప్‌ అని కీవర్డ్స్‌ ఎంటర్‌ చేయగానే.. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గురించిన సమాచారాన్ని సంక్షిప్త రూపంలో మెటా ఏఐ మన ముందుంచుతుంది. ఆ మ్యాచ్‌లో ఎన్ని పరుగులతో టీమిండియా గెలించింది.. ఆ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఎన్ని పరుగులు చేసిందీ వంటి వివరాలను చూపించింది.

  • ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది అని అడిగిన ప్రశ్నకు.. అమరావతి అంటూ ఠక్కున సమాధానం ఇచ్చింది. అంతేకాదు విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరమని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం వికీపీడియా లింకును కూడా అందిస్తోంది.

మెటా ఏఐ జనరేట్ చేసిన ఏఐ చిత్రం

  • టీ20 మ్యాచ్‌ వీక్షిస్తున్న భారతీయుల చిత్రం కావాలని అడిగినప్పుడు ఈ చిత్రాన్ని క్షణాల్లో జనరేట్‌ చేసి ఇచ్చింది. అదే సమయంలో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రముఖుల ఫొటోలను ఇచ్చేందుకు నిరాకరించింది. సున్నితమైన అంశాల విషయంలో గోప్యతను పాటిస్తోంది.

తెలుగు విషయంలో మడత..!

తెలుగు విషయంలో మెటా ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు లేదని తెలుస్తోంది. సమాధానం ఇచ్చే విషయంలో కొంత తడబడుతోంది. ముందు తెలుగు అర్థమవుతుందా? అని తెలుగులోనే ప్రశ్న అడిగినప్పుడు దానికి అర్థమవుతుందంటూ ఇంగ్లిష్‌లోనూ, తెలుగులోనూ సమాధానం ఇచ్చింది. తర్వాత తెలుగులో వేమన పద్యాన్ని పూరించు అని అడిగినప్పుడు కొంతసేపు ప్రయత్నించి.. ‘తెలుగు అర్థం చేసుకోలేకపోతున్నా’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని