Published : 25 Jun 2022 19:12 IST

EPF: ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఎలా చేయాలి?

సాధార‌ణంగా పీఎఫ్ మొత్తాన్ని ప‌ద‌వీ విర‌మ‌ణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెల‌ల త‌ర్వాత తీసుకుంటుంటారు. అంతేకాకుండా వైద్య చికిత్స ఖ‌ర్చులు, వివాహం, ఉన్న‌త చ‌దువు, ఇంటి కొనుగోలు వంటి కార‌ణాల‌తో పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌ర్ (యూఏఎన్) పొంద‌డం, దీన్ని ఆన్‌లైన్‌లో యాక్టివేట్ చేసుకోవ‌డం, కేవైసీ పూర్తిచేయ‌డం, ఈ-నామినేష‌న్ దాఖ‌లు, మొబైల్ నంబ‌రు అప్‌డేట్‌ వంటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క‌టి పూర్తికాక‌పోయినా ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవ‌డం సాధ్యం కాదు. మరి ఇవన్నీ ఎలా చేయాలో స్టెప్‌ బై స్టెప్‌ చూద్దామా!


పీఎఫ్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకొనే విధానం..
స్టెప్ 1:
 ముందుగా ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్‌కి వెళ్లి.. స్క్రీన్‌కి కుడివైపున కింది భాగంలో క‌నిపిస్తున్న స‌ర్వీసెస్ సెక్ష‌న్‌లో అందుబాటులో ఉన్న మెంబ‌ర్ యూఏఎన్‌/ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా నేరుగా ఆ వెబ్‌సైటుకు వెళ్లొచ్చు.


స్టెప్ 2: ఇక్క‌డ మీ యూఏఎన్, పాస్‌వ‌ర్డ్ తో పాటు కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒక‌వేళ మీకు యూఏఎన్ నంబరు లేక‌పోతే ఆన్‌లైన్ ద్వారా యూఏఎన్ జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. లాగిన్ పేజీలో ఎడ‌మ‌వైపు కింది భాగంలో 'Direct UAN Allotment by Employees' ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి ఆధార్‌తో అనుసంధాన‌మైన మొబైల్ నంబరు, క్యాచ్‌కోడ్ వివ‌రాలు వంటివి ఎంట‌ర్ చేసి యూఏఎన్ పొంద‌చ్చు. ఒక‌వేళ మీరు యూఏఎన్ నంబ‌రు మ‌ర్చిపోతే అదే పేజిలో 'Know Your UAN' క్లిక్ చేసి తెలుసుకోవ‌చ్చు. అదే విధంగా యూఏఎన్ యాక్టివేష‌న్ కోసం 'Activate UAN'  పై క్లిక్ చేయాలి. 


స్టెప్ 3: కేవైసీ నిబంధ‌న‌లు పూర్తి చేసింది, లేనిది చూసుకునేందుకు 'మ్యానేజ్' పై క్లిక్ చేయండి. అందులో 'కేవైసీ బ‌ట‌న్' పై క్లిక్ చేయడం ద్వారా కేవైసీ వెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చు. ఇక్క‌డే ఈ-నామినేష‌న్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు దాఖ‌లు చేయ‌ని వారు ఇక్క‌డి నుంచి దాఖ‌లు చేయ‌వ‌చ్చు. దీంతో పాటు మొబైల్ నంబ‌రు త‌దిత‌ర వివ‌రాల‌నూ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఈ-నామినేష‌న్ దాఖ‌లు చేయ‌కుండా ముంద‌స్తు విత్‌డ్రాలు అనుమతించ‌రు. ఈ-నామినేష‌న్ కంటే ముందు ప్రొఫైల్ పిక్చర్‌ని అప్‌డేట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. 


స్టెప్ 4: అనంతరం పైన మెనూ బార్‌లో ఉన్న ‘ఆన్ లైన్ సర్వీసెస్’ ట్యాబ్ పై క్లిక్ చేసి క్లెయిమ్ (ఫారం -31, 19 & 10సీ) ఎంచుకోండి. ఇక్క‌డ స‌భ్యుని వివ‌రాలు కనిపిస్తాయి. 'వెరిఫై' అని ఉన్న చోట మీ యూఏఎన్ నంబరు అనుసంధాన‌మైన బ్యాంకు ఖాతా నంబరును పూర్తిగా నమోదు చేసి, ‘వెరిఫై’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. స‌రైన వివ‌రాలు ఇస్తే ఒక మెసేజ్ వ‌స్తుంది. దానిలో 'యెస్', 'నో'.. రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. 'యెస్‌'పై క్లిక్ చేయాలి


స్టెప్ 5: త‌ర్వాత వ‌చ్చే స్క్రీన్‌లో బ్యాంకు ఖాతా వివ‌రాలు సిస్ట‌మ్‌లో ఉన్న డేటాతో స‌రిపోయిన‌ట్లుగా ఆకుప‌చ్చ రంగులో ఒక టిక్ మార్క్ క‌నిపిస్తుంది. కింద 'ప్రొసీడ్ ఫ‌ర్ క్లెయిమ్' ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసే మ‌రొక స్క్రీన్ వ‌స్తుంది.


స్టెప్ 6: ఆన్ లైన్ ద్వారా ఉపసంహరణ క్లెయిమ్ ను దాఖలు చేసేటప్పుడు, మూడు రకాల ఫామ్‌లు ఉంటాయి.

1. ఫారం 31 (పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి) - ఈ ఫారంను పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

2. ఫారం 19 (పీఎఫ్ ఉపసంహరణకు మాత్రమే) - ఇది మీరు సేకరించిన మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోడానికి ఉపయోగించబడుతుంది, దీనిని ఫైనల్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు.

3. ఫారమ్ 10సీ (పెన్షన్ ఉపసంహరణకు మాత్రమే) - ఈ ఫారంను పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

ఈ మూడింటిలో మీకు కావాల్సిన ఆప్ష‌న్ ఎంచుకుని 'ప్రొసీడ్ ఫ‌ర్ ఫ‌ర్ద‌ర్ క్లెయిమ్' పై క్లిక్ చేయాలి. 


స్టెప్ 7: ఇక్క‌డ ఒక ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మీ స‌ర్వీస్ వివ‌రాలు, ఏ కార‌ణంతో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాల‌నుకుంటున్నారు, చిరునామా త‌దిత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి, మీ చెక్‌/పాస్ బుక్ (స్కాన్డ్) కాపీని అప్‌లోడ్ చేయాలి. ఆ త‌ర్వాత కింద క‌నిపించే బాక్సులో టిక్ చేస్తే, గెట్ ఆధార్ ఓటిపీ ఆప్ష‌న్ వ‌స్తుంది.


స్టెప్ 8: ఓటీపీ వ‌చ్చిన త‌ర్వాత ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేసి, క్లెయిమ్ ఫారమ్ ను సమర్పించాలి. ఈపీఎఫ్ఓ మీ ఆధార్ వివరాలను యూఐడీఏఐ నుంచి పొంది, మీ ఆన్ లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఒకసారి ఆమోదం పొందిన తరువాత, 10 రోజుల్లో మీ పీఎఫ్ మొత్తం మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. 


చివ‌రిగా:  పీఎఫ్‌ను ముందుగానే విత్‌డ్రా చేసుకొనేందుకు ఈ-నామినేష‌న్ త‌ప్ప‌నిస‌రి. ఈపీఎఫ్ చందాదారు కుటుంబ‌స‌భ్యుల సామాజిక భ‌ద్ర‌త కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) నామినేష‌న్ సౌక‌ర్యాన్ని అందిస్తుంది. మీ కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఈ-నామినేష‌న్ త‌ప్ప‌కుండా దాఖ‌లు చేయండి. ఎలా దాఖ‌లు చేయాలో తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. పీఎఫ్, ప‌ద‌వీవిర‌మ‌ణ అనంతర జీవితం కోసం ఉద్దేశించిన‌ది. దీన్ని మ‌ధ్య‌లోనే విత్‌డ్రా చేసుకోవ‌డం మంచిది కాదు. సాధ్య‌మైనంత వ‌ర‌కు చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించేందుకే ప్ర‌య‌త్నించండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని