Womens Day: మగువకు ఆర్థిక రక్ష

ఒకప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. కానీ ఆధునిక మహిళగా మన పరిస్థితి వేరు. కుటుంబ శ్రేయస్సు గురించే కాదు మన గురించీ ఆలోచించుకోవాలి.  మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా  బీమా, ఆరోగ్య, పొదుపు పథకాలపై అవగాహన పెంచుకుందాం..

Published : 08 Mar 2022 14:59 IST

ఒకప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. కానీ ఆధునిక మహిళగా మన పరిస్థితి వేరు. కుటుంబ శ్రేయస్సు గురించే కాదు.. మన గురించీ ఆలోచించుకోవాలి.  మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా  బీమా, ఆరోగ్య, పొదుపు పథకాలపై అవగాహన పెంచుకుందాం..

బీమా రక్షణ ఉండాల్సిందే: మగవారితో పోలిస్తే మహిళల ఆరోగ్య అవసరాలు భిన్నంగా ఉంటాయి. అవి ప్రసూతి అవసరాలు కావొచ్చు.. లేదా సర్వైకల్‌ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌లాంటివి కావొచ్చు. వీటి నుంచి రక్షణ కోసం తగిన పాలసీలు, బీమా అవసరం చాలా ఉంది. మార్కెట్లో ప్రసూతి ఖర్చులను చెల్లించే పాలసీలూ అందుబాటులో ఉన్నాయి. అలాగే టాటా ఏఐజీ వెల్‌ అస్యూరెన్స్‌ ఉమెన్‌, బజాజ్‌ అలియాంజ్‌ ఉమెన్‌ స్పెసిఫిక్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌లాంటి పాలసీలు తీవ్రమైన వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తున్నాయి. వీటిలో తగిన వాటిని ఎంచుకుంటే ప్రసూతి, ఇతర అనారోగ్యాల గురించి భయపడాల్సిన అవసరం లేదు.

మనకోసం ప్రత్యేకంగా: బీమా అనగానే అది మగవాళ్లకి సంబంధించింది మాత్రమే అనుకోవద్దు. ఉద్యోగినులు, గృహిణులు ఎవరికైనా ఈ రక్షణ అవసరం.

40 ఏళ్లలోపు జీవిత బీమా పాలసీలు తీసుకునే వారికి ప్రీమియంలో దాదాపు 10శాతం వరకూ రాయితీ ఉంది. కొన్ని బీమా సంస్థలైతే ఆడవాళ్లకి పాలసీ ఇచ్చేటప్పుడు వారి వయసును రెండు మూడేళ్లు తక్కువగా పరిగణించి ప్రీమియాన్ని లెక్కిస్తాయి. ఎల్‌ఐసీ జీవన్‌ భారతీ ప్లాన్‌ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన మనీ బ్యాక్‌ పథకం. దీంతోపాటు ఎస్‌బీఐ స్మార్ట్‌ ఉమెన్‌ అడ్వాంటేజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్మార్ట్‌ ఉమెన్‌ పథకాలూ ఉన్నాయి. మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్‌ సెక్యూర్‌ ప్లాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్‌ ఉమెన్‌ యులిప్‌లతోపాటు, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌లాంటి సంస్థలూ ప్రత్యేకంగా అతివలకు బీమా పాలసీలు అందిస్తున్నాయి. అయితే ఏదో ఒకటి అని కాకుండా నిపుణుల సాయంతో మీ ఆర్థిక అవసరాలకు తగిన పాలసీని ఎంచుకునే ప్రయత్నం చేయండి.

పొదుపు ఖాతాలు: ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళలకు ప్రత్యేకంగా పొదుపు ఖాతాలను అందిస్తున్నాయి. వీటి నుంచి నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతర షాపింగ్‌లు, ప్రయాణాలు చేయడం ద్వారా కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక అవసరాల కోసం పొదుపు, పెట్టుబడులు కూడా ఈ ఖాతాల నుంచి నిర్వహించుకోవచ్చు. కోటక్‌ సిల్క్‌ ఉమెన్‌ సేవింగ్స్‌, యాక్సిస్‌ ఉమెన్‌ సేవింగ్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ అడ్వాంటేజ్‌ ఉమెన్‌ సేవింగ్స్‌, ఐడీబీఐ సూపర్‌ శక్తి ఉమెన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉమెన్‌ సేవింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మహిళా శక్తి సేవింగ్‌, ఇండస్‌ దివా ఉమెన్స్‌ సేవింగ్‌ ఖాతాలు ఇలాంటి సేవలు అందిస్తున్నాయి. మీకు ఇప్పటికే ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి, అందులో మహిళలకు ప్రత్యేకంగా ఖాతా ఉంటే దానిలోకి మారి అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.

క్రెడిట్‌ కార్డులు:  కొన్ని బ్యాంకులు మహిళల కోసం ఆదాయం ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా క్రెడిట్‌ కార్డులు అందిస్తున్నాయి. గృహిణులూ తమ జీవిత భాగస్వామి ప్రాథమిక కార్డుపై అనుబంధ కార్డును తీసుకునే వీలుంది. మహిళలకు కొన్ని బ్యాంకులు అందించే డెబిట్‌ కార్డులతో ఎన్నిసార్లయినా ఉచితంగా డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. సిటీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఇలాంటి కార్డులను అందిస్తున్నాయి.

రుణాలూ తీసుకోవచ్చు: మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమవంతుగా తోడ్పాటునిస్తున్నాయి. ఈ అప్పులకు వడ్డీ రేటులోనూ 0.5శాతం వరకూ రాయితీనిస్తున్నాయి.

చదువుకు అండగా: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు అమ్మాయిలకు విద్యారుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. గృహరుణాలని ఎస్‌బీఐతో పాటు, యాక్సిస్‌, ఫెడరల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలాంటి బ్యాంకులు ఇస్తున్నాయి.

ఇక మహిళా రైతుల కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా ట్రాక్టర్‌ కొనుగోళ్లకి అప్పు ఇస్తోంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీయ మహిళా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు మహిళలు వాహన రుణాలు తీసుకుంటే వడ్డీ రాయితీ కల్పిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఎస్‌బీఐ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలాంటివి అధికంగా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి.

- జి.మల్లారెడ్డి, ఈనాడు, హైదరాబాద్‌


ప్రతి స్థాయిలో మహిళలను కించపరిచేవారుంటారు. విమర్శలు ఎదురవుతాయి. అవి సమంజసంగా ఉంటే పరిగణనలోకి తీసుకోవచ్చు. లేదంటే నమ్మిన దిశగా వెళ్లడమే. ఒకరకంగా అవి కూడా మనకి పాఠాలే! కొన్నిసార్లు నేను ఎంతమాత్రం అంగీకరించని, నా ఆలోచనకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆ క్షణంలో ఆశ్చర్యానికీ ఆందోళనకూ లోనయినా.. నిజానిజాలు, రాబోయే లాభనష్టాల గురించి చర్చిస్తాను. పరిష్కారం దిశగా ఆలోచించినప్పుడు అలజడి ఉండదు.

- డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌, ప్రధాన శాస్త్రవేత్త, ప్రపంచ ఆరోగ్య సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని