మీ పీపీఎఫ్ ఖాతా ప‌నిచేయ‌డం లేదా.. ఇలా యాక్టివేట్ చేసుకోండి..

పెట్టుబ‌డిదారులు యాక్టీవ్‌గా ఉన్న పీపీఎఫ్ ఖాతాలో మాత్ర‌మే డ‌బ్బు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేయ‌గ‌ల‌రు. 

Published : 28 Apr 2021 15:26 IST


కేంద్ర ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు గ‌ల, మంచి రాబ‌డిని ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో పీపీఎఫ్ ఒక‌టి.  ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.1 శాతం.  ఈ ప‌థ‌కానికి 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటి పిరియ‌డ్ ఉంటుంది. అయితే పెట్టుబ‌డిదారుడు కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఖాతా తెరిచిన ఐదేళ్ల త‌రువాత డ‌బ్బును విత్‌డ్రా చేసుకోసుకునే అవ‌కాశం ఉంది. ఈ ఖాతాలో న‌గ‌దు జ‌మ చేయాల‌న్నా, అదేవిధంగా విత్‌డ్రా చేసుకోవాల‌న్న ఖాతాను యాక్టీవ్‌(క్రీయాశీల‌కం)గా ఉంచుకోవాలి. ఇందుకోసం ప్ర‌తి సంవత్స‌రం ఖాతాలో కనీస మొత్తాన్ని జ‌మచేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఖాతా నిరుప‌యోగంగా మారితే, తిరిగి ఉప‌యోగంలోకి ఎలా తీసుకు రావాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. 

పీపీఎఫ్ ఖాతాలో ప్ర‌తీ సంవ‌త్స‌రం కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. చందాదారుడు సంవత్సరానికి రూ. 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వీలులేదు. పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఒకేసారి లేదా సంవత్సరానికి గరిష్టంగా 12 వాయిదాలలో చెల్లించవచ్చు. ఖాతాను యాక్టీవ్‌గా ఉంచుకునేందుకు ఒక ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తంలో క‌నీసం రూ.500 ఖాతాలో జ‌మ చేయాల్సి ఉంటుంది. అంటే ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి 31వ తేదీ లోపుగా క‌నీస మొత్తం రూ.500లు పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి. లేదంటే ఖాతా క్రియా ర‌హితంగా మారుతుంది. 

ఈ ఖాతాను తిరిగి యాక్టీవేట్ చేసుకునేందుకు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించాల్సిన‌ క‌నీస మొత్తాన్ని, పెనాల్టీతో పాటు జ‌మ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని సంవ‌త్స‌రాలు ఖాతా క్రియార‌హితంగా ఉందో.. అన్ని సంవ‌త్స‌రాల‌కు ఒక్కో ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.50 చొప్పున అప‌రాధ రుస‌ము చెల్లించాలి. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు రెండు సంవ‌త్స‌రాల పాటు పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు జ‌మ చేయ‌క‌, ఖాతా క్రియా ర‌హితంగా మారితే, తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు రెండు సంవ‌త్స‌రాల‌కు చెల్లించ‌వ‌ల‌సిన క‌నీస మొత్తం రూ.1000(రూ.500 x 2) తో పాటు రూ.100( 50 x 2) క‌లిపి మొత్తం రూ.1100 జ‌మ చేస్తే ఖాతా తిరిగి క్రియాశీల‌కంగా మారుతుంది. 

పీపీఎఫ్‌లో 15 సంవత్సరాల సుదీర్ఘ కాలవ్యవధి ఉన్నందున, ఇందులో కంపౌండింగ్ ప్రభావం ఎక్కువ‌గా ఉంటుందని, దీంతో అధిక రాబ‌డిని పొంద‌వ‌చ్చ‌ని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ త‌రువాత డ‌బ్బును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు లేదా మీ బ్యాంకు లేదా పోస్టాఫీసును సంప్ర‌దించి మ‌రో 5 సంవ‌త్స‌రాలు కొన‌సాగించ‌వ‌చ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని