Investments: యువత తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలి?

కెరియర్‌లో స్థిరపడ్డ యువత దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను కొనసాగించాలి. ఇందుకుగాను స్థిరమైన మదుపు సాధనాలలోనే కాకుండా మార్కెట్‌ పెట్టుబడులను అనుసరించొచ్చు. యువత మదుపు చేయగలిగే కొన్ని పెట్టుబడి సాధనాలను ఇక్కడ చూద్దాం.

Updated : 05 Dec 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాల్లో యువ జనాభా ఎక్కువున్నది భారత్‌లోనే. అయితే, మన దేశంలో యువతకు కెరీర్‌ మీద ఉన్నంత దృష్టి.. పెట్టుబడుల మీద ఉండదు. కాబట్టి వారు స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి తమ నిధులను ఎలా కేటాయించాలో తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో యువత కోసం పెట్టుబడి ఎంపికలు బాగా పెరిగాయి. ఈ అవకాశాలతో ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వారు చేయాల్సిన కొన్ని పెట్టుబడి ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.

స్టాక్స్‌లో పెట్టుబడి

యువత స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి మార్గాల్లో ఒకటి అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. యువతకు బాధ్యతలు తక్కువ ఉండడమే కాకుండా, వారికి దీర్ఘకాలం పాటు ఆర్థిక ఆరోగ్యం సహకరిస్తుంది. స్టాక్‌ పెట్టుబడులు దీర్ఘకాలానికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో పెట్టుబడులు అధికంగా పెట్టాలని కూడా లేదు. స్వల్ప పెట్టుబడులతో కూడా పేరున్న స్టాక్స్‌ను కైవసం చేసుకోవచ్చు. స్టాక్స్‌ కొనుగోళ్లకు, అమ్మకాలకు ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ కారణం చేత పెట్టుబడులకు స్టాక్‌ మార్కెట్లు మంచి అవకాశమనే చెప్పొచ్చు.

స్టాక్స్‌లో మదుపు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనైనప్పుడు కూడా పెట్టుబడిని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ పెట్టుబడులన్నీ ఒకే రంగంలో పెట్టొద్దు. వివిధ రంగాలు, వివిధ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచండి. ఇది ఆర్థిక ఆటుపోట్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. 

మ్యూచువల్‌ ఫండ్లు

ఇందులో కూడా తక్కువ పెట్టుబడితో వివిధ ఫండ్ల యూనిట్లను కైవసం చేసుకోవచ్చు. ఫండ్‌ మేనేజర్లు తమకున్న మార్కెట్‌ అనుభవంతో వివిధ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారు. అంటే, మీరు ప్రత్యక్షంగా ఈక్విటీ మార్కెట్లో పాల్గొననకుండా మీ తరఫున నిపుణులైన మేనేజర్లు పాల్గొంటారు. వీటిలో కూడా దీర్ఘకాలానికి మంచి లాభాలను ఆశించొచ్చు. ఈ ఫండ్లలో పెట్టుబడులు మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరుస్తాయి. దీర్ఘకాలం పాటు మదుపు చేయడానికి యువత ఇండెక్స్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇందులో కొంతవరకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. కాస్త రిస్క్‌ తీసుకోవాలనుకునేవారు మిడ్‌ క్యాప్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. అయితే స్వల్పకాలానికి ఇందులో నష్టభయం ఉంటుందని గమనించాలి.

స్థిరాస్తి రంగం

ఇందులో మదుపు కూడా దీర్ఘకాలానికి మంచి ఆర్థిక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే ఈ రంగానికి ప్రతికూలత. అయితే ఆస్తిని కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం వల్ల ప్రతి నెలా ఆదాయాన్ని పొందొచ్చు. ఇది స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని అందిస్తుంది. అయితే ఇందులో తక్కువ పెట్టుబడితో మదుపు చేయడానికి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT)లో పెట్టుబడి పెట్టడం మరొక ఎంపిక. ఇది పెట్టుబడిని నేరుగా నిర్వహించాల్సిన అవసరం లేకుండా ఆస్తుల పోర్ట్‌ఫోలియోలో వాటాలను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

బాండ్లు

ఇవి తక్కువ నష్టభయం కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందించగలవు. యువత పెట్టుబడి పెట్టగల కొన్ని విభిన్న రకాల బాండ్‌లు ఉన్నాయి. అవి ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, మున్సిపల్‌ బాండ్లు. ప్రతి బాండ్‌కు దాని  సొంత రిస్క్‌లు, రివార్డులు ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి కొంత పరిశోధన చేయడం ముఖ్యం. ఈ బాండ్లను బ్రోకర్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎక్కువ మంది ముఖ్యంగా యువత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించడానికే మక్కువ చూపుతారు. ఈ బాండ్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బు అవసరం ఉండదు. మొత్తం మీద పోర్ట్‌పోలియోలను బ్యాలెన్స్‌ చేయడానికి బాండ్లు గొప్ప మార్గం. ఎక్కువ రిస్క్‌ తీసుకోకుండా స్థిరమైన రాబడిని అందుకోవచ్చు.

పీపీఎఫ్‌

యువతకు పదవీ విరమణకు ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి పూర్తిగా రిస్క్‌లేని, ప్రభుత్వ హామీ ఉన్న మదుపు సాధనంగా పీపీఎఫ్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇందులో ఏడాదికి కనీస, గరిష్ఠ పెట్టుబడులుగా రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మెచ్యూరిటీకి 15 ఏళ్ల సమయం ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 ఏళ్ల చొప్పున (25, 30. 35.. ఇలా) పెట్టుబడులను కొనసాగించొచ్చు. ఈ మదుపును పదవీ విరమణ నిధిగా ఉపయోగించుకోవచ్చు.  80సి కింద ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.50 లక్షల ప‌రిమితి వ‌ర‌కు పన్ను మిన‌హాయింపు పొందే వీలుంది.

ఎన్‌పీఎస్‌

యువతకు దీర్ఘకాలిక పెట్టుబడికి ఎన్‌పీఎస్‌ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ఆర్‌డీఏ అందించే ఎన్‌పీఎస్‌లో 18-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న భార‌తీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు.  క్రమశిక్షణతో కూడిన, దీర్ఘకాలంలో ఉప‌యోగ‌ప‌డే పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని మీకు అనిపిస్తే ఎన్‌పీఎస్‌ స‌రైన మదుపు ప‌థ‌కం అని చెప్పవచ్చు. ఎన్‌పీఎస్ పెట్టుబ‌డి ఎక్కువ‌గా పెట్టుబ‌డిదారుడి ప‌ద‌వీ విర‌మ‌ణపై దృష్టి పెడుతుంది. ఈ ఖాతాను ప్రారంభించ‌డానికి కేవ‌లం రూ.1,000 చెల్లించాలి.  ఆ త‌ర్వాత ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA, 2002)కు లోబ‌డి ఎంత మొత్తం అయిన చెల్లించ‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ చందాదారుల‌కు 80సి కింద ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.50 లక్షల ప‌రిమితి వ‌ర‌కు పన్ను మిన‌హాయింపు ఉంటుంది.

చివరిగా: పెట్టుబడి అనేది ఒక స్థిరమైన ప్రక్రియగా విజయవంతం కావాలంటే మదుపర్లకు క్రమశిక్షణ ఉండడం చాలా ముఖ్యం. మార్కెట్ల మీద విస్తృత పరిశోధన, ఎప్పటికప్పుడు ఆర్థికపరమైన విషయాలపై అపడేట్‌ అవ్వడం చాలా అవసరం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు