HPCL Q2 results: హెచ్‌పీసీఎల్‌కు మరోసారి నష్టాలు

ప్రభుత్వరంగ చమురు సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.2172 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది.

Published : 03 Nov 2022 17:28 IST

దిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.2172 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 30 శాతం పెరిగి 1.13 లక్షల కోట్లకు చేరింది. కొన్ని నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగించడం నష్టాలకు కారణమయ్యాయి. ప్రభుత్వం ఇటీవల గ్రాంట్‌ అందించినా అవి నష్టాలను తగ్గించడానికి సాయపడిందే గానీ.. నష్టాలను మాత్రం పూర్తిగా ఆపలేకపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ కంపెనీ రూ.1,923.51 కోట్ల లాభాలను ప్రకటించింది. 

హెచ్‌పీసీఎల్‌ ఇలా వరుస రెండు త్రైమాసికాల్లో నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో సైతం రూ.10,196.94 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. మరో ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఐఓసీ సైతం ఇటీవల వరుస త్రైమాసికాల్లో నష్టాలను ప్రకటించింది. అయితే, ఎల్పీజీ సిలిండర్లను తక్కువ ధరకు విక్రయించినందుకు గానూ సంభవించిన నష్టాలను భర్తీ చేసేందుకు అక్టోబర్‌ 12న ప్రభుత్వం వన్‌టైమ్‌ గ్రాంట్‌ ప్రకటించింది. మూడు చమరు కంపెనీలకు కలిపి రూ.22వేల కోట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందులో రూ. 5,617 కోట్లు హెచ్‌పీసీఎల్‌కు  వచ్చాయి. ఈ గ్రాంట్‌ కింద ఐఓసీకి రూ.10,800 కోట్లు రాగా.. ఆ కంపెనీ క్యూ2లో రూ.272.35 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు