HPCL Q1 results: చమురు ధరల ఎఫెక్ట్‌.. HPCLకు భారీ నష్టాలు

ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను ప్రకటించింది.

Updated : 06 Aug 2022 19:35 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.10,196 కోట్ల నష్టాలు వచ్చినట్లు పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు తెలిపింది. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర నష్టం రూ.10,196.94 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.1795 కోట్లు మాత్రమేనని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు హెచ్‌పీసీఎల్‌కు వచ్చిన అతిపెద్ద నష్టమిదేకావడం గమనార్హం. చమురు ఉత్పత్తులు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1.21 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.77,308.53 కోట్లుగా ఉంది.

దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న వేళ.. అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ సైతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్థిరంగా ఉంచాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సగటున బ్యారెల్‌కు 109 డాలర్లు వెచ్చించిన కంపెనీలు.. 85-86 డాలర్ల వద్ద విక్రయాలు చేపట్టాయి. ఇవి నష్టాలకు దారితీశాయి. హెచ్‌పీసీఎల్‌ కంటే పెద్ద సంస్థ అయిన ఐఓసీ జూన్‌ త్రైమాసికానికి రూ.1992.53 కోట్లు నష్టాలను మాత్రమే ప్రకటించింది. చమురు విక్రయాలతో పాటు ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారాలను ఆ సంస్థ నిర్వహిస్తుండడం.. సంస్థ నష్టాలు తగ్గడానికి దోహదపడ్డాయి. అదే సమయంలో హెచ్‌పీసీఎల్‌ ఉత్పత్తి కంటే ఎక్కువ విక్రయాలు చేపట్టడం నష్టాలకు పెరగడానికి కారణమైంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు జరుగుతున్నా.. చమురు కంపెనీలు మాత్రం వంద రోజులు దాటిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం సవరించ లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని