SVB Crisis: ఒక్క పౌండ్‌కే HSBC చేతికి ఎస్‌వీబీ యూకే యూనిట్‌

Silicon Valley Bank: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ విషయంలో బ్రిటన్‌ సైతం చర్యలు వేగవంతం చేసింది. ‘ఎస్‌వీబీ యూకే’ దివాలా ప్రక్రియను ప్రారంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌.. ఆ బ్యాంక్‌ను హెచ్‌ఎస్‌బీసీకి విక్రయించింది. 

Published : 13 Mar 2023 15:25 IST

లండన్‌: అమెరికాలో దివాలా తీసిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon Valley Bank) అనుబంధ ఎస్‌వీబీ యూకే (SVB UK) విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ చర్యలు చేపట్టింది. ఎస్‌వీబీ యూకే దివాలా ప్రక్రియలో భాగంగా ఆ బ్యాంక్‌ను హెచ్‌ఎస్‌బీసీ (HSBC)కు విక్రయించింది. ఒక్క పౌండ్‌కే బ్యాంక్‌ను హెచ్‌ఎస్‌బీసీ ఎస్‌వీబీ యూకే దక్కించుకుంది. డిపాజిటర్లకు రక్షణ కల్పించే ఉద్దేశంతో హెచ్‌ఎస్‌బీసీకి విక్రయించినట్లు యూకే ట్రెజరీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఎస్‌వీబీ దివాలా తీసిన వెంటనే చర్యలు చేపట్టిన బ్రిటన్‌.. ఈ ఉదయం హెచ్‌ఎస్‌బీసీకి బ్యాంక్‌ను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల డిపాజిటర్లకు రక్షణ కల్పించినట్లు అవుతుందని, ఈ లావాదేవీలో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏమాత్రం వినియోగించలేదని ట్రెజరీ చీఫ్‌ జెరెమీ హంట్‌ వెల్లడించారు. 

ఎస్‌వీబీ యూకే లిమిటెడ్‌ను ఒక్క పౌండ్‌కే కొనుగోలు చేసినట్లు హెచ్‌ఎస్‌బీసీ సైతం మరో ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌వీబీ అప్పులు, ఆస్తులను ఈ లావాదేవీల నుంచి మినహాయించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపింది. ఎస్‌వీబీ యూకే ఖాతాదారులను, ఉద్యోగులను హెచ్‌ఎస్‌బీసీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. 2023 మార్చి 10 నాటికి ఎస్‌వీబీ యూకే 5.5 బిలియన్ల విలువైన రుణాలు ఇచ్చింది. మరో 6.7 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఈ బ్యాంక్‌ వద్ద ఉన్నాయి. మరోవైపు ఎస్‌వీబీ దివాలా నేపథ్యంలో అమెరికా సైతం దిద్దుబాటు చర్యలకు దిగింది. బ్యాంక్‌ ఆస్తులను విక్రయించి డిపాజిట్‌దారులకు చెల్లించాలని ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీఐసీ) నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని